ఆకట్టుకునే అరుదైన చిత్రం !!

Sharing is Caring...

An entertaining movie with just two characters …..

2012లో విడుదలైన ‘మిధునం’ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అపురూపమైన దృశ్యకావ్యం. ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిధునం’ కథ ఆధారంగా, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు.

ప్రముఖ చలనచిత్ర దర్శకుడు మదురై టి.వాసుదేవన్ నాయర్ ఇదే కథ ఆధారంగా  ‘అర విరిసిన చిరునవ్వు’ అనే అర్ధంతో మలయాళంలో తీసిన ’ఒరు చెరు పుంచిరి’ విశేష ప్రేక్షకాదరణ పొందింది.

ఈ సినిమాను నిర్మాత ఆనందరావు సొంత ఊరు రాజాం దగ్గరలో రేగిడి ఆమదాలవలస మండలంలోని వావిలవలస గ్రామంలో తీశారు. సినిమా తీయడం నిజంగా సాహసోపేత ప్రయోగమే. ఈ సినిమాకు రూ.1.25 కోట్ల మేరకు ఖర్చు అయింది. శాటిలైట్ హక్కులు ,ఇతర హక్కులు అమ్మకం ద్వారా రూ.1.36 కోట్లు వచ్చాయి.

కథేంటి?

ఒక పల్లెటూరిలో నివసించే అప్పదాసు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం), అతని భార్య బుచ్చిలక్ష్మి (లక్ష్మి) అనే వృద్ధ దంపతుల కథ. వారి పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడి ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉంటారు. పిల్లలు తమతో లేరనే బాధ పడకుండా, ఆ వృద్ధ దంపతులు తమ సొంత ఇల్లే ఒక ప్రపంచంగా భావిస్తూ ఎలా బతికారు అనేదే ఈ సినిమా.

తోటలో కూరగాయలు పండించడం, సాంప్రదాయ వంటలు చేసుకోవడం, చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ, అంతే ప్రేమను కురిపించుకుంటూ వారి శేషజీవితాన్ని ఒక పండుగలా ఎలా మార్చుకున్నారో దర్శకుడు ఇందులో చూపించారు.

ఈ సినిమాలో అప్పదాసుగా బాలు, బుచ్చిలక్ష్మిగా లక్ష్మి జీవించేశారు. వారి మధ్య కెమిస్ట్రీ, డైలాగ్ డెలివరీ, వృద్ధాప్యంలో ఉండే చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఇద్దరూ పోటీపడి పలికించారు.కేవలం ఒకే ఒక ఇంట్లో, ఇద్దరు నటులతో బోర్ కొట్టకుండా సినిమా తీయడం సామాన్యమైన విషయం కాదు.

భరణి తన కలం బలంతో, సున్నితమైన హాస్యంతో, భావోద్వేగాలతో ప్రతి సన్నివేశాన్ని మనసుకు హత్తుకునేలా మలిచారు. సినిమాలో చూపించే పల్లెటూరి వాతావరణం, సాంప్రదాయ వంటల ప్రస్తావన (ఆవకాయ, ఊరగాయలు, కాఫీ, పరమాన్నం) చూస్తుంటే ప్రేక్షకుడి నోరూరుతుంది. మన మూలాలను గుర్తు చేస్తుంది.

స్వరకర్త వీణాపాణి అందించిన సంగీతం కథకు తగ్గట్టుగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా “ఆటగదరా శివా” పాట హృదయాన్ని కదిలిస్తుంది. కాఫీ దండకం ఆకట్టుకుంటుంది. కమర్షియల్ సినిమాలు, ఫాస్ట్ యాక్షన్ ఇష్టపడే నేటి తరం ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త నెమ్మదిగా  సాగుతున్నట్లు అనిపించవచ్చు.

సినిమా అంతా ఇద్దరే కనిపించడం వల్ల కొంతమంది వీక్షకులకు ఏకధాటిగా చూడటం కొంచెం కష్టంగా అనిపించవచ్చు.‘మిధునం’ అనేది కేవలం సినిమా కాదు, ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక జీవిత సత్యం.  వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోతున్న తల్లిదండ్రుల మానసిక స్థితిని, వారి ఆత్మాభిమానాన్ని ఈ సినిమా ఎంతో గౌరవంగా చూపించింది. ముఖ్యంగా నేటి యువత, తమ తల్లిదండ్రులను వదిలేసి దూరంగా ఉంటున్న పిల్లలు ఖచ్చితంగా చూడవలసిన చిత్రం.

సినిమా ముగింపులో అప్పదాసు మరణించిన తర్వాత, బుచ్చిలక్ష్మి ఒంటరిగా మిగిలిపోతుంది. కానీ ఆమె ఏడవదు. ఆయన జ్ఞాపకాలతో, ఆయన నాటిన చెట్లతో మాట్లాడుతూ, ఆయన ఎక్కడికీ పోలేదని, తనలోనే ఉన్నాడని నమ్ముతూ ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. ప్రేమ అనేది శారీరక బంధం కాదు, ఆత్మల బంధం అని నిరూపించే ఈ క్లైమాక్స్ ప్రతి ఒక్కరి మనసును భారంగా మారుస్తుంది.

భరణి మార్క్ డైలాగులు అలరిస్తాయి..దాంపత్యమూ – ధప్పళము (గుమ్మడికాయ ముక్కల పులుసు) మరిగిన కొద్దీ రుచి, ప్రతీ వాడికి శంఖు చక్రాల్లా బీపీ, షుగరూ…. మనిషిగా పుట్టడం సులువేనయ్యా…కాని మనిషిలా బ్రతకడమే కష్టం” అద్భుతః-నీచేతిలో అమృతరేఖ ఉందే అమ్మీ వంటి డైలాగులు బాగున్నాయి.

సినిమాలో ముసలాయన కుండలు చేయడం, ప్రొఫెషనల్లాగా (పెళ్ళాం కోసం) చెప్పులు కుట్టడం, కట్టెలు కొట్టడం, దూది యేకడం లాంటి రకరకాల వృత్తి పనులు చేయడం, బావిలోకి దూకి చెంచాలు,సిగ్గుబిళ్ళ. ఉద్దరిణె వంటి వస్తువులు తీయడం  కొంత అతిగా, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి.ఈ సినిమాకు నాలుగు నంది అవార్డులు వచ్చాయి. తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ మాటల రచయిత (తనికెళ్ళ భరణి), ప్రత్యేక ప్రత్యేక జ్యూరీ అవార్డులు    లక్ష్మి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం లకు వచ్చాయి.యూట్యూబ్ లో సినిమా ఉంది ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.     
   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!