ఒక తలారి అంతర్మధనం !!

Sharing is Caring...

Social crime drama …….

‘హ్యాంగ్ మాన్’ (Hang Man) ఇదొక విలక్షణమైన సోషల్ క్రైమ్ డ్రామా. 2020లో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈసినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యమై, చివరకు  ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ (SunNXT) లో నేరుగా విడుదలయింది.నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించారు. 

జైళ్లలో మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే ‘తలారి’ (Executioner) వృత్తి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఒక ప్రాణాన్ని తీసేటప్పుడు ఆ తలారి ఎదుర్కొనే మానసిక ఆందోళనలు, సమాజం అతని వైపు చూసే కోణాన్ని ఇందులో చూపించారు.మూడు తరాలుగా వస్తున్న ఈ వృత్తిని ఆపేయాలని, సమాజంలో మరణశిక్షనే రద్దు చేయాలని ఒక తలారి చేసిన పోరాటమే ఈ కథ.

తలారి శివయ్య పాత్రలో బ్రహ్మాజీ ఒదిగిపోయారు. తన కెరీర్‌లోనే  బెస్ట్ పాత్ర ఇది. భావోద్వేగాలను పండించడంలో ఆయన నటన అద్భుతంగా ఉంది.ఈ చిత్రంలో బ్రహ్మాజీ కొడుకు పాత్రను వినయ్ పల్లె సన్నీ, భార్య పాత్రను సీనియర్ నటి సురభి ప్రభావతి పోషించారు.ఇద్దరూ కూడా పాత్రల పరిధిలో చక్కగా నటించారు. మిగతావారివి చిన్న పాత్రలే అయినా బాగా చేశారు.

సాధారణంగా సినిమాల్లో చర్చించని ఒక సున్నితమైన, సామాజిక వృత్తి నేపథ్యాన్ని ఎంచుకోవడం సినిమాకు ప్రధాన బలం.దర్శకుడు ఉరితీసే విధానాన్ని, దాని వెనుక ఉండే నైతిక యుద్ధాన్ని హృదయానికి హత్తుకునేలా స్క్రీన్‌పై ఆవిష్కరించారు. రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ కథాంశాన్ని అభినందించారు.

ఇదొక సీరియస్ సామాజిక డ్రామా కావడం వల్ల కమర్షియల్ ఎలిమెంట్స్,కామెడీ ఆశించే వారికి కథనం కొంత నెమ్మదిగా అనిపించవచ్చు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఒక విభిన్నమైన సామాజిక అంశాన్ని , బలమైన మానసిక సంఘర్షణను చూడాలనుకునే వారికి ‘హ్యాంగ్ మాన్’ ఒక మంచి ఎంపిక.  

 సినిమాలో ఉరితీసే సన్నివేశాలు, బ్రహ్మాజీ పాత్రలోని భావోద్వేగ సంఘర్షణ,తండ్రీకొడుకుల సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.

ఒక హత్యకు ప్రతిగా నేరస్తుడికి ఉరి వేసి చంపడం న్యాయమేనా ?దీన్ని మనం న్యాయం అని ఎందుకు పిలుస్తాం? ఇది కూడా హత్యే కదా ? ఒక మనిషిని చంపడం తప్పయితే,ఉరి శిక్ష ద్వారా మరో మనిషిని చంపడం తప్పుకాదా ? ఉరి శిక్షపడాల్సిన ఇంకా ఎంతో మంది జైళ్లలో హాయిగా ఉన్నారు ..కొందరిని ఉరివేయడం ఏమిటి అనే ప్రశ్నలు కథ ద్వారా దర్శకుడు సమాజాన్ని అడుగుతాడు.

మరణ శిక్ష రద్దు చేయమని జరుగుతున్న ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని విహాన్ కథ రాసుకున్నారు. క్లైమాక్స్ లో పూర్తిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు.చెప్పదలచుకున్న పాయింట్ జనాలకు చేరాలంటే లిబర్టీ అవసరమే. 

పియర్‌పాయింట్: ది లాస్ట్ హ్యాంగ్‌మ్యాన్ (Pierrepoint: The Last Hangman – 2005) సినిమా – బ్రిటన్‌కు చెందిన నిజజీవిత తలారి ‘ఆల్బర్ట్ పియర్‌పాయింట్’ జీవిత కథ ఆధారంగా రూపొందింది.. వందలాది మందిని ఉరితీసిన తర్వాత అతని మనసులో కలిగే మార్పు, మరణశిక్షకు వ్యతిరేకంగా అతను తీసుకునే నిర్ణయం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. దర్శకుడికి ఈ సినిమా కూడా ప్రేరణ కావచ్చు. 

ఈ చిత్రానికి ఉదయ్ గుర్రాల డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరించారు.జైలు వాతావరణాన్ని, ఉరితీసే గది మూడ్‌ను,తలారి జీవితంలోని చీకటి కోణాలను కెమెరాలో చాలా సహజంగా, గ్రిప్పింగ్‌గా చూపించారు. కమ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు.

ఇదొక ఇంటెన్స్ సోషల్ మూవీ  కావడంతో, సీన్లలోని సస్పెన్స్, ఎమోషన్స్‌ను ఎలివేట్ చేయడంలో కమ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది.అందరికి సినిమా నచ్చకపోవచ్చు.సినిమా నిడివి తక్కువకావడం విశేషం..దర్శకుడు అనవసరమైన సీన్లతో విసిగించకుండా సింపుల్ గా చెప్పదలచుకున్న పాయింట్ చెప్పాడు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!