ఆమె పాటలన్నీ అమృత గుళికలే!

Sharing is Caring...

Sweet singer ………………………

ఒకటా ? రెండా ? మూడా ? కొన్ని వేల పాటలు…. దేనికదే ఒక ప్రత్యేకత. సుస్వర వాణి, అద్భుత గాయని జానకి పాటలు వింటుంటే తనువు మైమర్చిపోతుంది. మనసు పులకరిస్తుంది .  ‘నీ లీల పాడెద దేవా’ … ‘పగలే వెన్నెలా…జగమే ఊయల’… ‘ఆడదాని ఓరచూపుకు.. జగాన ఓడిపోని ధీరుడెవ్వడు’.

 ‘నీలి మేఘాలలో’…’పూవులు పూయును పదివేలు’..’కలల అలలపై తేలెను’….’గున్నమావిడి కొమ్మ మీద’.. ‘ఈ దుర్యోధన …దుశ్శాసన దుర్వినీత లోకంలో’..’ఏకాంత వేళ’ …  ఇలా రాసుకుంటూ పోతే బోలెడు పాటలు. అన్నిఅమృత గుళికలే.

జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు అలవోకగా పలుకుతాయి. .. “మేఘమా దేహమా” పాటలో ఆమె గొంతులోని ఆర్ద్రత హృదయాన్ని కదిలిస్తుంది..`ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` ‘వెన్నెల్లో గోదావరి అందం’ వంటి పాటల్లో రచయితలు ఆశించిన ప్రేమ, ఆవేదన ఆమె గొంతులో పలికి మనల్ని కట్టిపడేస్తుంది.

జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆమె స్వరమే ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.

తెలుగు,తమిళ,మలయాళం , కన్నడ., హిందీ భాషలే కాకుండా మరిన్ని భాషల్లో జానకి పాటలు పాడారు. 45 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను మంత్ర ముగ్దులను చేసిన ఖ్యాతి ఆమెది. ఈ మధుర గాయని ఇళయరాజా సంగీత సారథ్యంలో అత్యధిక పాటలు పాడారు.

ఇళయ రాజా కూడా ఆమె ఫ్యాన్. అసలు కొన్ని పాటలకు జానకి గొంతు మాత్రమే నప్పుతుంది. అందుకే సంగీత దర్శకులు ఆమె చేతనే పాటలు పాడించారు.నాలుగేళ్ల పిల్లాడి నుంచి 70 ఏళ్ళ ముదుసలి కి క్కూడా స్వరం ఇచ్చి మెప్పించారు ఆమె.

పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీత ప్రియులను అలరింపజేశారు. ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలోని ‘కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే’.. పాటలో పండు ముసలావిడ గొంతు..’సప్తపది’ సినిమాలోని ‘గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన’ పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం. స్వాతిముత్యం లోని  చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాడి అభిమానులను అలరించింది. 

అలాగే ‘శ్రీవారి శోభనం’ చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ .. బామ్మ గొంతులతో పాట పాడి  తన ప్రత్యేకత ను నిరూపించుకున్నారు.’చందమామ రావే’,’జడ్జిమెంట్’ సినిమాల్లో బేబీ సుజిత కు డబ్బింగ్ చెప్పింది జానకమ్మే. అది ఆమె ఒక్కరికే సాధ్యమైంది.

ఇక “నీ కౌగిలిలో తలదాచి….నీ చేతులలో కను మూసి.” …పాట ….జానకి జీవితంలో మరచి పోలేని జ్ఞాపకం. అదే సమయంలో జానకి భర్త రాంప్రసాద్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు.ఆ టెన్షన్ లో జానకి కి ఆస్త్మా…కాస్త ఎక్కువైందట.  

ఆ పాట రికార్డింగ్ జరిగినప్పుడు…ఆయాసం తో ఉన్న ఎస్.జానకి మనస్సులో భర్త అనారోగ్యం గురించి ఆవేదన పడుతూనే ఆ పాట అద్భుతంగా పాడారు.జానకి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో ఆ పాట ఒకటి గా నిలిచి పోయింది.

కాగా “నీ లీల పాడెద దేవా” పాటకు నాదస్వర విద్వాన్ కారైకురుచ్చి అరుణాచలం…ముందు నాదస్వరం రికార్డ్ చేసి….మధ్యలో జానకి గారు పాడేలా చేశారు.నిజానికి పాటలో వాయిస్ కు తగ్గట్లు నాదస్వరం వినిపిస్తుంది. కానీ నాదస్వరానికి తగ్గట్లు…జానకి  పాడారట.అప్పట్లో అది గొప్ప ప్రయోగం అంటారు. ఈ పాట ఎస్.జానకి పాడింది అని తెలిసి నటి సావిత్రి నేనీ పాటకు నటించను .. మళ్ళీ పి.సుశీల గారితో రికార్డ్ చేస్తే నటిస్తాను అన్నారట.

సంగీత దర్శకుడు సుబ్బయ్య నాయుడు అందుకు ఒప్పుకోలేదు. దర్శకుడు రామన్  కూడా.. “మీకిష్టం లేకపోతే…కథ కాస్త మార్చి….నర్తకీమణి కమలా మీనన్ మీద చిత్రీకరిస్తాం” అన్నారట. దాంతో సావిత్రి పునరాలోచించి ఆ పాటలో నటించారట. షూటింగ్ అయ్యాక తర్వాత సావిత్రి వెళ్లి జానకిని అభినందించారట. చివరికి ఆ పాటే పెద్ద సంచలనం సృష్టించింది.

ఇక జానకి పద్మభూషణ్ ఇస్తామన్నా తిరస్కరించారు. ఒక్క ‘భారత రత్న’మాత్రమే అంగీకరిస్తానని నిర్మొహమాటంగా చెప్పారు జానకి. 2016 నుంచి పాటలు పాడటం మానేశారు. స్వచ్చందంగా రిటైర్ అయ్యారు.

జానకి ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు.ఆమె భర్త వి.రాము 1997లో మరణించారు. ఎస్. జానకికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె కుమారుడు మురళీ కృష్ణ కూడా గాయకుడే.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!