‘డ్రాగన్’ కు చెక్ చెప్పబోతున్నారా ?

Sharing is Caring...

చైనా దూకుడు కు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమౌతున్నదా ? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని అనిపిస్తుంది. పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో సైనికులకు 15 రోజుల యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లిన క్రమంలో ఈ సందేహాలు ఎవరికైనా వస్తాయి. దీనికి తోడు త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ మాటలు అలాగే ఉన్నాయి. భూమి, గాలి, సముద్రంలో ఎక్కడైనా సరే శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రావత్ చెబుతున్నారు. అంటే భారత్ ఒక వ్యూహం తో ముందుకు వెళుతున్నదని భావించవచ్చు. అయితే ఇలాంటి ప్రకటనలు ఇటీవల తరచుగా వినిపిస్తుంటాయి. ఇవన్నీ శత్రుదేశానికి సంకేతాలు ఇవ్వడంలో భాగంగా కూడా జరుగుతుంటాయి. 

తూర్పు లడఖ్‌లో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభనను ఎదుర్కొనేందుకు సైన్యానికి రూ.50 వేల కోట్ల విలువైన మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వదేశీ, విదేశీ మార్గాల ద్వారా సమకూర్చుకునేందుకు ఇటీవలే అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ప్రతీ పది రోజులకు సరిపోయే మందుగుండు, ఆయుధాలు అందుబాటులో ఉంచుతుండగా.. దీన్ని 15 రోజులకు పెంచాలని తాజాగా ఆదేశాలు అందాయి. అవసరమైన పక్షంలో ఇవి చైనాతో పాటు పాకిస్తాన్‌పై దాడులకు ఉపయోగపడతాయని , ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు మెరుపుదాడే సరైన అస్త్రమని భారత్‌ సైనిక వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఎన్ని హెచ్చరికలు చేసినా ధోరణి మార్చుకోని చైనా కు బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో  మోడీ సర్కార్ సమయం కోసం ఎదురు చూస్తోంది.

గ‌త కొంత కాలంగా వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌ర‌చూ భార‌త భూభాగంలోకి చొచ్చుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది.  వివాదాస్ప‌ద డోక్లాం ప్రాంతానికి స‌మీపంలో భూటాన్ భూభాగంలో ఏకంగా రోడ్లు, గ్రామాల‌ను నిర్మిస్తున్నది. ఇవన్ని చైనా  యుద్ధకాంక్ష తోనే చేస్తుందనే సందేహాలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే ముందు చూపుతో ఇప్ప‌టికే తూర్పు ల‌ఢక్ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహ‌రించింది. ఇప్పుడీ ఆయుధ సరఫరా పెంచాలన్న తాజా నిర్ణ‌యంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో మాన‌సిక స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేస్తోంది. చైనా బలగాలు దుందుడుకుగా వ్యవహరిస్తే ధీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.బలగాలకు ఆయుధాలను భారీగా  అందుబాటులోకి తెస్తున్నారు. 

————- KNM

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!