Unexpected twists ……….
‘దృఢం’ మలయాళ యంగ్ వెర్సటైల్ యాక్టర్ షేన్ నిగమ్ లీడ్ రోల్ లో నటించిన ఒక పక్కా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. లెజెండరీ దర్శకుడు జీతూ జోసెఫ్ (దృశ్యం ఫేమ్) సమర్పకుడిగా వ్యవహరించగా, ఆయన శిష్యుడు మార్టిన్ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో హాట్ స్టార్ లో తెలుగు ఆడియోతో సహా స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏమిటంటే ?
విజయ్ (షేన్ నిగమ్) తల్లిదండ్రుల కోరిక మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) అవుతాడు. అతనికి అడవిని ఆనుకుని ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్‌లో మొదటి పోస్టింగ్ వస్తుంది. అక్కడ సిబ్బందితో సరదాగా గడుపుతున్న సమయంలో.. ఆ ఊరి పరిసరాల్లో ఒక్కొక్కటిగా గుర్తుపట్టలేనంత దారుణంగా ఉన్న శవాలు బయటపడతాయి.
అందరూ ఒకే తరహాలో (తల వెనుక బలమైన గాయంతో) హత్యకు గురైనట్లు పోస్ట్‌మార్టమ్ నివేదికలో తెలుస్తుంది.అంతకుముందే ఆ ఊరిలో ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీ దోపిడీ జరుగుతుంది. అసలు ఈ వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు? ఆ దోపిడీకి, ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? ఉన్నతాధికారుల ఒత్తిడిని తట్టుకుని, కొత్త ఎస్ఐ విజయ్ తన ‘దృఢ’ సంకల్పంతో ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేదే సినిమా కథ.
ఈ సినిమాకు అతిపెద్ద అసెట్ చివరి 20-30 నిమిషాలు. ప్రీ-క్లైమాక్స్ నుండి మొదలయ్యే ఊహించని మలుపులు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. హంతకుడు ఎవరో తెలిశాక వచ్చే ట్విస్ట్‌లు “జీతూ జోసెఫ్” మార్కును గుర్తుచేస్తాయి. ఊహించని ఆ ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇలా కూడా జరుగుతుందా అని ఆడియన్స్ ఆశ్చర్యపోతారు.
కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్ గా షేన్ నిగమ్ అద్భుతంగా సెట్ అయ్యాడు. ఒక కొత్త ఎస్ఐ పడే కంగారును, అమాయకత్వాన్ని చూపిస్తూనే, విచారణ తీవ్రమయ్యాక మెచ్యూర్డ్ ఆఫీసర్‌గా మారే జర్నీని బాగా పండించాడు. ఊరిలో వరుస హత్యలు, బ్యాంక్ దోపిడీ జరిగాక కేసు విచారణ తీవ్రమౌతున్న కొద్దీ ఆయన తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు.
ఒక బాధ్యతాయుతమైన, కఠినమైన పోలీస్ అధికారిగా ఖాకీ యూనిఫామ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు షేన్ నిగమ్ ఈ సినిమాలో డైలాగుల కంటే ఎక్కువగా తన కళ్లతోనే హావభావాలను పలికించారు.. అనుమానితులను విచారించేటప్పుడు చూపించే తీవ్రత చాలా నేచురల్‌గాఉంది.
మామూలు కమర్షియల్ సినిమాల్లో లాగా పెద్ద పెద్ద పంచ్ డైలాగులు చెప్పకుండా, చాలా నిశ్శబ్దంగా ఉంటూనే పవర్‌ఫుల్ పోలీస్ ఆటిట్యూడ్‌ను ప్రదర్శించారు ఈ సినిమాలో lady కానిస్టేబుల్ పాత్రలో సానియా ఫాతిమా చక్కగా నటించింది.క్లైమాక్స్ లో వచ్చే భారీ ట్విస్ట్ సమయంలో షేన్ నిగమ్ నటన పీక్స్‌లో ఉంటుంది.ఇతర నటులు కూడా బాగా చేశారు.
ఈ సినిమాకు పరిమితమైన బడ్జెట్ ఉన్నప్పటికీ, లొకేషన్ల ఎంపిక (కేరళ అడవులు, హిల్ స్టేషన్) టెక్నీషియన్స్ (సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్) నుండి ది బెస్ట్ అవుట్‌పుట్ తీసుకున్నారు. ఎక్కడా గ్రాఫిక్స్ హంగులు లేకుండా, కథలోని ఎమోషన్‌తోనే విజువల్స్ పండించారు..సినిమాను ఒక బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు మార్టిన్ జోసెఫ్ చేసిన కృషి అడుగడుగునా కనపడుతుంది.
సినిమా మొదలైన మొదటి ముప్పావు గంట కథ నెమ్మదిగా, రొటీన్ పోలీస్ డ్రామా తరహాలో సాగుతుంది. హీరో షేన్ నిగమ్ మినహా మిగిలిన నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని వారే. ఈ సినిమాకు అద్భుతమైన, ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతాన్ని శ్రీరాగ్ సజీ అందించారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌లోని ఉత్కంఠను పెంచింది. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉండటం వల్ల ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి.
అర్ధరాత్రి పూట అడవిలో సాగే ఇన్వెస్టిగేషన్,ఛేజింగ్ సీన్లలో లో-లైటింగ్ ను వాడుకున్న విధానం సినిమాకు చాలా ప్లస్ అయింది.క్రైమ్ మిస్టరీకి కావలసిన మూడ్‌ను తన కెమెరా విజువల్స్ ద్వారా ఉన్నికృష్ణన్ చాలా సహజంగా స్క్రీన్‌పై ఆవిష్కరించారు.
ఈ క్రైమ్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్,యాక్షన్ సీక్వెన్స్ సస్పెన్స్ మూవీస్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.వీకెండ్‌లో ఓటీటీలో చూడటానికి ఇదొక ఖచ్చితమైన ‘వర్త్ వాచింగ్ థ్రిల్లర్.

