సంగీతానికి సొబగులద్దిన ఖ్యాతి ఆయనది !(2)

Sharing is Caring...

Bharadwaja Rangavajhala  ……………………………..

గాయకుడుగా ఘంటసాల అందరు సంగీత దర్శకులతోనూ పనిచేశారు. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు. వాటిలో క్లిష్టమైన అతి కష్టమైన గీతాలూ ఉన్నాయి. మల్లాది వారు నామకరణం చేసిన విజయానంద చంద్రిక రాగంలో ఓ అద్భుతమైన గీతాన్ని ఘంటసాలతో ఆలపింపచేశారు. రసికరాజ తగువారము కామా…అంటూ సాగే ఆ పాటను ఓ ఛాలెంజ్ గా తీసుకుని పాడి రక్తి కట్టించారాయన.

తెలుగు సినిమాకు సంబంధించి ప్రయోగాలు చేయడానికి సంకోచించని సంగీతదర్శకుడు సాలూరి రాజేశ్వర్రావు కాంబినేషన్ లోనూ అద్భుతమైన పాటలు పాడారు ఘంటసాల. మల్లీశ్వరి కోసం రాజేశ్వరుడు స్వరపరచిన ఆకాశవీధిలో హాయిగా ఎగిరే…పాటను సందర్భోచితంగా పాడి అజరామరం చేశారు ఘంటసాల. ఘంటసాల కన్నా గొప్ప గాయకులు అనేక మంది ఆ రోజుల్లోనే ఉన్నారు.

అయినా…ఘంటసాలనే జనం వినాలనుకున్నారు. కారణం…ఆయనలో ఉన్న రససిద్ది. భావ ప్రధానంగా పాటను పాడడం ఘంటసాలను చిరంజీవిని చేశాయి.ఆయన గాత్రం ప్రేక్షక హృదయాల మీద వేసిన ప్రభావం ఎంతటి దంటే…ఆయన మరణానంతరం ఆయన గాత్రాన్ని పోలిన రామకృష్ణ ను వినేందుకే మొగ్గు చూపేంతగా ప్రభావితం చేసింది. అది తెలుగు సినిమా పాట మీద ఆయ‌న వేసిన ముద్ర‌.

ఘంటసాల చివరిరోజుల్లో పాడలేనన్నా తప్పదు…మీరు పాడితే తప్ప భావం పలకదు అని పాడించుకున్న సందర్భాలు అనేకం. ఈ జాబితాలో తన మనసుకు నచ్చిన మనసు గతి ఇంతే లాంటి అద్భుతమైన పాటలూ ఉన్నాయి. ఘంటసాల మరణానంతరం ఆత్రేయ బావురుమన్నారు.ఇకపై నాది గొంతు లేని గోడు అన్నారు. అంతగా ప్రేక్ష‌కుల‌నూ శ్రోత‌ల‌నూ మాత్ర‌మే కాదు క‌వుల‌నూ కదిలించిన గానం ఘంటసాల.

అంత వరకు రాగాల లాగుడు సంగీతంతో కూడిన నాటక పద్యాలను విని ఉన్నజనాలకు ఘంటసాల వారి సినిమా పద్యాలు ఊరటనిచ్చాయి.చెవులకు హాయిగా తగిలాయి. గంభీరమైన స్వరంతో భావం పలికేలా ఘంటసాల పద్యం చదువుతూ ఉంటే కళ్ల ముందు సన్నివేశం కదలాడిపోయేది.పాత్ర హావభావాలనే కాదు…సన్నివేశంలోని అంతరార్ధాన్ని సైతం తన పద్యపఠనంలో ప్రతిఫలించగలగడం ఘంటసాల ప్రతిభ.

పద్యం ఎవ‌రైనా పాడుకునేలా ఉండాల‌నేది ఘంట‌సాల న‌మ్మిన సూత్రం. హాస్యరసం పండించడంలో ఘంటసాల గాత్రం చాలా కొత్త పోకడలు పోతుంది.సుంద‌రి నీవంటి దివ్య‌స్వ‌రూప‌ము లాంటి అనేక హాస్య‌గీతాలు ఆయ‌న పాడారు. అదే పద్యంలో హాస్యాన్ని పలికించాల్సి వస్తే ఇక చెప్పేది ఉందా. జస్ట్ రెచ్చిపోతాడంతే. అప్పు చేసి పప్పు కూడులో అలాంటి సందర్భం ఆయనకి దొరికింది.

పింగళి నాగేంద్రరావు రాసిన నవకళా సమితిలో పద్యాన్ని ఘంటసాల ఆలపించిన విధం చూడండి.ఊరూర కాఫి హోటళ్లలో మనకు అప్పు పుట్టవలదే అంటూ పాడే ఆ కాన్ఫిడెన్స్ ను చూడండి.ఈ పద్యం వండడం లో పింగళి కి శ్రీశ్రీ సహకారం కూడా ఉందట.ఆ రోజుల్లో బడేగులాం అలీ లాంటి వాళ్లు చెన్నై వస్తే… ఘంటసాల వారి ఇంట్లోనే బస చేసేవాళ్లట. ఘంటసాల వారు వారికి ఎవరూ ఇవ్వలేని ఆతిధ్యం ఇచ్చేవారట.

కారణం హిందూస్తానీ సంగీతం మీద ఉన్న ఇష్టమే. అందులోని మెలకువలను ఇతర గుట్టుమట్టులను తెలుసుకునేవారట.సంగీత దర్శకుడుగా ఘంటసాల వారి తొలి రోజుల నుంచీ ఈ ధోరణి కనిపిస్తుంది.ఘంటసాల వారి స్వరసారధ్యంలోనే వచ్చిన మరో విజయావారి చిత్రం గుండమ్మకథలో తిలక్ కామాద్ రాగంలో స్వరపరచిన అద్భుత గీతం వినిపిస్తుంది. అలిగిన వేళనే చూడాలి అంటూ సుశీల పాడిన సోలో గీతంలో సాంఘిక కృష్ణుడుగా ఎన్టీఆర్ అదరగొట్టేస్తారు.

శాస్త్రీయ రాగాలను సినిమాటిక్ గా ఉపయోగించుకోవడంలో అద్భుతమైన ప్రతిభ కనపరచిన సంగీత దర్శకులు రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల.ఈ ముగ్గురూ ఒక దశలో తెలుగు సినిమా హిట్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. రాజేశ్వరరావులో ప్రయోగశీలత కనిపిస్తే…మిగిలిన ఇద్దరిలోనూ పాటను హిట్ చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది.

ప‌హాడీ రాగంలో మ‌ర్మ‌యోగి చిత్రం కోసం ఘంట‌సాల‌ స్వ‌ర‌ప‌ర‌చిన నవ్వుల నదిలో గీతం చూడండి … ఆయ‌నలోని ప్ర‌తిభామూర్తి సాక్షాత్క‌రిస్తాడు. ఘంటసాల స్వయంగా సంగీత దర్శకుడై ఉండీ…కోరి మరీ సుబ్బురామన్ కు సహాయకుడుగా పనిచేశారు. విద్య నేర్చుకోడానికి ఎవరి దగ్గరకు వెళ్లినా తప్పులేదనే ఆయన అభిప్రాయం.ఈ ఇద్దరి మధ్యా కూడా ఓ సందర్భంలో గ్యాప్ వచ్చింది.

అందుకే దేవదాసు పాటలు వేరే గాయకుడితో పాడించారు సుబ్బ‌రామ‌న్.అయితే అవి మ‌నసుకు నచ్చకపోవ‌డంతో త‌ప్ప‌క‌ మళ్లీ ఘంటసాలనే పిలిపించారు. ఆ సినిమాలోనూ పహాడీ రాగం చాలా పాటల్లో తొంగిచూస్తుంది. ముఖ్యం పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో… శాస్త్రీయ సంగీతాన్ని ఇంకెవరూ ఉపయోగించని స్థాయిలో సినిమాలకు ఉపయోగించుకున్న సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు.

గాయకుడు ఘంటసాల. పెండ్యాల దగ్గర ఆయన వందలాది పాటలు పాడినా…ఆ కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే పాటల్లో శివశంకరీ ఒకటి.దర్బారీ కానడ రాగంలో స్వరపరచిన ఈ గీతాన్ని కూడా ఘంటసాల అనితరసాధ్యమైన రీతిలో పాడి మెప్పించారు.ఇలా ఘంటసాల గురించి ఈ ఏడాది అంతా మాట్లాడుకోవచ్చు..

Pl. Read It……………………  సంగీతానికి సొబగులద్దిన ఖ్యాతి ఆయనది 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!