ఆ స్టోన్ మ్యాన్ మిస్టరీ ఏమిటీ ?

Sharing is Caring...

స్టోన్ మ్యాన్ ఎవరో కనుక్కోవడం కోల్ కత్తా పోలీసులకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. గత మూడు నెలలకాలంలో ఈ స్టోన్ మ్యాన్  దాడులు పెరిగిపోయాయి. కోల్ కత్తా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిద్రించే వారు స్టోన్ మ్యాన్ బారిన‌పడి గాయాల పాలవుతున్నారు. కొందరు చనిపోతున్నారు. ఇంతకీ స్టోన్ మ్యాన్ ఎవరు? ఎలా ఉంటాడు ? ఎక్కడుంటాడు? అనే వివరాలు ఎవరికి తెలీదు. పోలీసులు సైతం తెలుసుకోలేకపోతున్నారు.

ఇటువంటి దాడులు తరచూ జరుగుతున్నకారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి సీరియల్ కిల్లింగ్స్ ఇప్పటివి కావు.1989 లో చాలా జరిగాయి. అప్పట్లో కోల్‌కతా వీధుల్లో భీభత్సాన్ని సృష్టించిన  ఒక సీరియల్ కిల్లర్‌కు ‘స్టోన్‌మ్యాన్’ అనే పేరు పెట్టారు. అయితే ఈ స్టోన్ మ్యాన్ నిజంగా లేడని .. ఆ పాత్ర కల్పితమని పోలీసులు అప్పట్లో వాదించారు. అప్పట్లో  ‘స్టోన్‌మ్యాన్’ ఆరు నెలల్లో 13 హత్యలు చేసి భయోత్పాతం సృష్టించాడు.

ఈ నేరాలు ఒక వ్యక్తి చేతి వాటమా లేక వ్యక్తుల సమూహమా అనేది ఇప్పటికి నిర్ధారణ కాలేదు. ఇప్పటి వరకు ఈ హత్యలకు సంబంధించి నిందితులు దొరకలేదు .. ఎవరికీ శిక్ష పడలేదు. కోల్ కత్తా లో ఎవరు ఈ హత్యలు చేశారో ఇప్పటివరకు మిస్టరీ యే. డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ కొంత కాలం విచారించి ఆచూకీ దొరక్క చేతులేత్తిసింది. డాగ్ స్క్వాడ్‌ కూపీ లాగలేకపోయింది. పరిసరాల్లో నివసిస్తున్న పలువురిని ప్రశ్నించి వదిలేశారు. 

ఈ హత్యలలో కామన్ పాయింట్ ఏమిటంటే … కిల్లర్ బాధితుల తలలు పెద్ద రాయితో పగలగొట్టారు. మృతులంతా నిరాశ్రయులు .. ఫుట్‌పాత్‌పై నివసించేవారు. వారు అర్ధరాత్రి తర్వాత లేదా తెల్లవారుజామున చంపబడ్డారు. బాధితులు నిద్రిస్తున్నప్పుడు వారి తలపై కనీసం 30 కిలోల బరువున్నరాయితో కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి మృతదేహాలను క్లెయిమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బాధితులు ఎవరో కూడా గుర్తించలేకపోయారు.

హౌరా బ్రిడ్జ్ ప్రక్కనే ఉన్న ప్రాంతంలో చాలా హత్యలు జరిగాయి. స్టోన్‌మ్యాన్‌ను ఎవరూ చూడలేదు, కానీ హంతకుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని కోల్ కత్తా పోలీసులు అనుమానించారు. 1989 చివరి నాటికి ఈ తరహా హత్యలు తగ్గి పోయాయి. అలాంటి హత్య మళ్ళీ 2003 లో జరిగింది.చనిపోయింది అందరూ నిరాశ్రయులు కాబట్టి పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపలేదనే విమర్శలు కూడా లేకపోలేదు.

కాగా ఇలాంటి తరహా హత్యలే బొంబాయి లో 1985 లో ప్రారంభమై, మూడేళ్ళ పాటు కొనసాగాయి. సియోన్ ..  కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో పన్నెండు హత్యలు జరిగాయి. నిర్జన ప్రదేశాల్లో నిద్రపోతున్న వారిని రాయితో కొట్టి చంపేశారు. ఒకతను మాత్రం స్టోన్ మ్యాన్ దాడుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. 1988 మధ్యలో హత్యలు అకస్మాత్తుగా ఆగి పోయాయి. కేసులు అపరిష్కృతంగానే ఉండి పోయాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హత్యలు జరిగాయి. ఈ ఘటనల ఆధారంగా ది స్టోన్ మ్యాన్ మర్డర్స్ , బైషే స్రబాన్ సినిమాలు కూడా రూపొందాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!