ఆ కంపెనీ ఇన్వెస్టర్లను మోసం చేసిందా ?

Sharing is Caring...

One of the accounting scandals……

ప్రముఖ జ్యువెలరీ, గోల్డ్ రిఫైనరీ సంస్థ ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’ (Rajesh Exports) దాదాపు ₹15.15 lakh కోట్లకు పైగా బూటకపు ఆదాయాన్ని చూపించి ఇన్వెస్టర్లను, సాధారణ జనాలను మోసం చేసిందని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గుర్తించింది. భారత కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అకౌంటింగ్ కుంభకోణాలలో ఒకటిగా నిలిచింది.  

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ స్విట్జర్లాండ్‌కు చెందిన ‘వాల్కంబి’ (Valcambi) అనే అనుబంధ కంపెనీని కలిగి ఉంది. గత ఐదేళ్లలో (FY21 – FY25) తమ గ్రూప్ మొత్తం ఆదాయంలో 97% నుండి 99% ఆదాయం ఈ స్విస్ అనుబంధ కంపెనీ ద్వారానే వచ్చిందని చూపిస్తూ వచ్చారు.

సెబీ లోతైన దర్యాప్తు చేసినప్పుడు ఆ స్విస్ కంపెనీకి చెందిన అసలైన స్వతంత్ర ఆర్థిక నివేదికలలో ఆ స్థాయి ఆదాయం ఎక్కడా కనిపించలేదు. అంటే, కేవలం కాగితాల మీద, అకౌంటింగ్ పుస్తకాలలో మాత్రమే భారీ లావాదేవీలు ఉన్నట్లు సృష్టించారు.బంగారం వాస్తవ లావాదేవీల విలువను, అసలు సంపాదనను తప్పుగా చూపిస్తూ అకౌంట్ల మార్పిడి జరిగిందని, దాదాపు 99% విదేశీ ఆదాయం కేవలం భ్రమ అని సెబీ తేల్చింది. 

కంపెనీకి చెందిన నిధులను (దాదాపు ₹7.4 కోట్లు) ప్రమోటర్ రాజేష్ మెహతా వ్యక్తిగత ట్రేడింగ్ ఖాతాలకు మళ్లించి, వ్యక్తిగత లాభాల కోసం వాడుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం బయటపడటంతో స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు పాతాళానికి పడిపోయి లోయర్ సర్క్యూట్ తాకాయి.

దీనివల్ల సాధారణ పెట్టుబడిదారుల సొమ్ము దాదాపు ₹12,725 కోట్లకు పైగా కరిగిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థ  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కు ఈ కంపెనీలో దాదాపు 10.10% వాటా ఉంది. సాధారణ ప్రజలు ఎల్ఐసీ లో దాచుకున్న సొమ్ములో దాదాపు ₹1,600 కోట్లకు పైగా పెట్టుబడి ఈ స్కామ్ కారణంగా నష్టపోయింది. 

ఈ భారీ మోసాన్ని నిర్ధారించిన తర్వాత, సెబీ 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీతో పాటు దాని ప్రమోటర్, సీఈవో రాజేష్ మెహతాను స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా తక్షణమే నిషేధించింది. 

కంపెనీ  వివరణ

సెబీ ఆదేశాలపై కంపెనీ స్పందిస్తూ… తమ గ్రూప్ ఆదాయంలో ఎలాంటి తప్పుడు లెక్కలు లేవని, సెబీ చెప్పినవన్నీ కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమేనని కొట్టిపారేసింది. దర్యాప్తు సంస్థల పరిశోధనకు, తమ లెక్కల విధానానికి మధ్య ఉన్న ‘కమ్యూనికేషన్ గ్యాప్’ వల్లే ఈ అయోమయం నెలకొందని, తాము అమాయకులమని కంపెనీ యజమాన్యం వాదిస్తోంది.

ప్రస్తుతం ఈ స్కామ్‌పై సెబీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.సెబీ ఈ కంపెనీ ప్రమోటర్ రాజేష్ మెహతాను స్టాక్ మార్కెట్ నుండి నిషేధించడంతో, ఇన్వెస్టర్లలో నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. మార్కెట్ విశ్లేషకులు, టెక్నికల్ ఇండికేటర్లు ప్రస్తుతం ఈ స్టాక్‌ను “స్ట్రాంగ్ సెల్” (Strong Sell) కేటగిరీలో ఉంచారు, అంటే కొత్తగా ఎవరూ ఈ షేర్లను కొనవద్దని సూచిస్తున్నారు.

జూన్ 5, 2026 ట్రేడింగ్ సెషన్‌లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ధర వరుసగా రెండో రోజు కూడా 5% లోయర్ సర్క్యూట్ తాకి ₹98.73 వద్ద ముగిసింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!