ఊహించని ట్విస్టులతో సాగే ‘మర్డర్ మిస్టరీ’ మూవీ !!

Sharing is Caring...

Lots of twists……..

‘కన్నై నంబాతే’ (Kannai Nambathey) అంటే ‘నీ కళ్లను నమ్మవద్దు’ అని అర్థం. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్, ప్రసన్న, భూమిక చావ్లా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు ము. మారన్ దర్శకత్వం వహించారు. 

కథ ఏమిటంటే ?

కథానాయకుడు అరుల్ (ఉదయనిధి స్టాలిన్) చెన్నైలో అద్దె ఇల్లు వెతుకుతూ, సోము (ప్రసన్న) అనే వ్యక్తితో రూమ్‌మేట్‌గా చేరతాడు. ఒక రాత్రి వైన్ షాప్ దగ్గర ఒక చిన్న ప్రమాదాన్ని చూసిన అరుల్, అక్కడ ఒంటరిగా ఉన్న ఒక మహిళకు (భూమిక చావ్లా) సహాయం చేసి ఆమెను కారులో ఇంటి దగ్గర దింపడానికి నిశ్చయించుకుంటాడు.

కానీ, ఆ తర్వాతి రోజే ఆ మహిళ కారు డిక్కీలో శవమై కనిపిస్తుంది. అసలు ఆ మహిళ ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఈ మర్డర్ మిస్టరీలో అరుల్ ఎలా ఇరుక్కున్నాడు? దీని వెనుక ఉన్న బ్లాక్‌మెయిల్ గ్యాంగ్ నెట్‌వర్క్ ఏంటి? అనే ప్రశ్నల చుట్టూ కథ తిరుగుతుంది..

సినిమా ప్రారంభమైన 15-20 నిమిషాలకే అసలు కథలోకి వెళ్తుంది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగే క్రైమ్ సీన్లు ప్రేక్షకుడిలో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే భూమిక చావ్లా పాత్ర సినిమాకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్.

సినిమా ఎక్కువగా వర్షం పడే రాత్రి వేళల్లో జరుగుతుంది. సిద్ధు కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM)  జలంధర్ వాసన్ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ మూడ్‌ని బాగా ఎలివేట్ చేశాయి. ప్రతి 10 నిమిషాలకోసారి ఒక కొత్త ట్విస్ట్‌ను తీసుకురావాలని దర్శకుడు ప్రయత్నించడం వల్ల సినిమా క్లిష్టంగా మారిపోతుంది. కొన్ని చోట్ల ట్విస్ట్‌లు ఊహించని విధంగా ఉన్నా, మరికొన్ని చోట్ల అవి కథను మరింత గందరగోళంలోకి నెట్టేస్తాయి.

కొన్ని క్రైమ్ సీన్లు కేవలం ప్రధాన పాత్రల సౌకర్యం కోసం చాలా సులభంగా జరిగిపోయినట్లు చూపిస్తారు. కారు గన్‌షాట్‌తో పల్టీ కొట్టడం వంటి కొన్ని యాక్షన్ సీన్లు అంతగా ఆకట్టుకోవు.సినిమాలో ఒక పాత్ర కేవలం హీరోని వెంబడిస్తూ, అతను శవాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలన్నింటినీ ఫోటోలు తీస్తూ ఉంటుంది.

ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు,పాత్రల వివరణలు సినిమా వేగాన్ని తగ్గించాయి.
లీడ్ రోల్‌లో ఉదయనిధి స్టాలిన్ ఒక సాధారణ యువకుడిగా, చిక్కుల్లో పడ్డ వ్యక్తిగా చక్కగా నటించారు.  ప్రసన్న, శ్రీకాంత్ తమ నటనతో ఆకట్టుకున్నారు.   

ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.కోవిడ్ లాక్‌డౌన్, హీరో ఉదయనిధి స్టాలిన్ రాజకీయ బిజీ వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా సంవత్సరాలు ఆలస్యమైంది. ఇది కూడా సినిమాపై హైప్ తగ్గడానికి ఒక కారణమైంది.

సినిమా బడ్జెట్  రూ. 30 కోట్లు కాగా, థియేటర్లలో కేవలం రూ. 5 కోట్లు కూడా దాటలేకపోవడంతో నిర్మాతలు థియేట్రికల్ పరంగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ డిజిటల్ హక్కుల అమ్మకం ద్వారా నిర్మాతలకు కొంతవరకు ఆర్థిక ఉపశమనం లభించింది. యూట్యూబ్ లో కూడా సినిమా ఉందిఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!