Not everyone will like this movie……
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఈ ‘పుజు’ ( ‘పురుగు’ అని అర్థం). ఇదొక సైకలాజికల్ సోషల్ డ్రామా మూవీ. కొత్త దర్శకురాలు రథీనా పీటీ రూపొందించిన ఈ చిత్రం SonyLIV లో తెలుగు డబ్బింగ్తో అందుబాటులో ఉంది.
కథా నేపథ్యం
కుట్టన్ (మమ్ముట్టి) ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. భార్య చనిపోవడంతో తన చిన్నకొడుకు కిచ్చుతో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తుంటాడు.కుట్టన్ తీవ్రమైన కుల అహంకారం, అనుమానపు జబ్బు ఉన్న వ్యక్తి. క్రమశిక్షణ పేరుతో కొడుకును అనుక్షణం భయపెడుతూ కఠినమైన బంధనాల మధ్య పెంచుతాడు.
మరోవైపు, అతని చెల్లెలు భారతి (పార్వతి తిరువోతు) తక్కువ కులానికి చెందిన ఒక నాటక కళాకారుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కుట్టన్ వారిద్దరినీ తీవ్రంగా అసహ్యించుకుంటాడు. అదే సమయంలో, తన పాత పోలీస్ వృత్తి వల్ల శత్రువులైన ఎవరో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే భయం కుట్టన్ను వేధిస్తూ ఉంటుంది.
అసలు కుట్టన్ను చంపాలనుకుంటుంది ఎవరు? కుల పిచ్చి ఒక వ్యక్తిని, అతని కుటుంబాన్నిఎలా దెబ్బ తీసింది ? అనేదే మిగిలిన కథ.
మమ్ముట్టి పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జీవించారనే చెప్పాలి. కళ్లలోనే భయం, క్రూరత్వం, అహంకారం అన్నీ పలికించారు. అయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్లలో ఇదొకటి. సినిమా చాలా నిదానంగా సాగుతుంది. ప్రతి సీన్లో ఒక తెలియని భయం, టెన్షన్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి.తండ్రి-కొడుకుల మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి.
మమ్ముట్టి తర్వాత ఆ స్థాయిలో అత్యంత ప్రతిభావంతంగా నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు మాస్టర్ వాసుదేవ్ సజీష్ మారార్ . సినిమాలో మమ్ముట్టి కొడుకు ‘కిచ్చు’ పాత్రను వాసుదేవ్ పోషించారు.
ఈ చిన్నారి నటన సినిమాకు ఒక ప్రధాన ఆకర్షణ. తండ్రి ధోరణితో నలిగిపోయే కొడుకుగా ఇతను అద్భుతంగా నటించాడు. తండ్రిని చూసి భయపడటం, లోపల ద్వేషాన్ని పెంచుకోవడం, తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకోవడం వంటి హావభావాలను చాలా సహజంగా పలికించాడు.
మమ్ముట్టి చెల్లెలి పాత్రలో పార్వతి చాలా పరిణతి చెందిన నటనను కనబరిచింది. అగ్రకులానికి చెందిన అన్నను ఎదిరించి, తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ధైర్యంగా బతికే స్త్రీగా ఆమె పాత్ర సామాజిక కోణాన్ని బలంగా చూపిస్తుంది. పార్వతి భర్తగా, నాటక కళాకారుడిగా నటించిన అప్పుణ్ణి ఆచారి నటన కూడా చాలా బాగుంది.
సమాజంలోని కులవివక్ష, అట్టడుగు వర్గాలపై జరిగే దాడులు, అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తిలోని కపటత్వాన్ని దర్శకురాలు చాలా సూటిగా చూపించారు. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని థ్రిల్లర్ మూడ్ను ఎలివేట్ చేసింది.
సాధారణ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్లలాగా ఇందులో వేగం ఉండదు. కేవలం పాత్రల మనస్తత్వాల చుట్టూ తిరిగే స్లో-బర్నర్ డ్రామా ఇది. సినిమా ముగింపు కొంతమంది ప్రేక్షకులకు అంతగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. కథలోని కొన్ని ఉపకథలు (Subplots) తేలిపోయినట్లు అనిపిస్తాయి.
సెకండాఫ్ కొంత సాగతీతగా అనిపిస్తుంది..‘పుజు’ అంటే మురికిలో పాకే పురుగు అని అర్థం. ఒక మనిషి మనసులో ఉండే కుల అహంకారం, ద్వేషం ఆ మనిషిని లోపల ఎలా పురుగులా తొలిచేస్తాయో చూపించే ప్రయోగాత్మక చిత్రమిది.
సీరియస్ డ్రామాలు, సైకలాజికల్ థ్రిల్లర్లు, సమాజంలోని చేదు నిజాలను చూపించే ‘సమాంతర సినిమాలను’ (Parallel Cinema) ఇష్టపడే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఒక ‘అద్భుతమైన ప్రయోగం’ గా అభివర్ణించారు. మాస్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా నచ్చదు.

