ఆ పార్క్ లో రాత్రివేళ ఆత్మల అరుపులు !!

Sharing is Caring...

This is the place where one lakh soldiers died…..

ఆ పార్కులో రాత్రిళ్ళు ఆత్మల అరుపులు,ఏడుపులు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు.ఆ పార్క్ హర్యానాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉంది. దాని పేరు కాలా అంబ్ పార్క్. 1761లో మూడవ పానిపట్ యుద్ధం జరిగిన ప్రదేశం ఇది. మరాఠా సామ్రాజ్యానికి ,అఫ్గాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి మధ్య జరిగిన ఘోర యుద్ధంలో సుమారు లక్ష మంది వరకు సైనికులు మరణించారని చరిత్ర చెబుతోంది.

రాత్రిళ్ళు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మలు ఇప్పటికీ అక్కడ తిరుగుతుంటాయని స్థానికుల నమ్మకం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో యుద్ధం చేస్తున్నట్లుగా అరుపులు, గుర్రాల సకిలింతలు, సైనికుల ఏడుపులు వినిపిస్తాయని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం దీనిని ఒక పార్కుగా మార్చింది.

యుద్ధ వీరులకు నివాళులు అర్పించేందుకు,  చరిత్రను తెలుసుకునేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ పార్క్ ను చీకటి పడకముందే సందర్శించి వెళుతుంటారు. నాటి యుద్ధంలో జరిగిన భారీ రక్తపాతం వల్ల అక్కడున్న ఒక మామిడి చెట్టు ఆ రక్తానినంతా పీల్చుకుని, అది కాసే పండ్లు నలుపు రంగులోకి మారేవని స్థానికులు నమ్ముతారు. అందుకే దీనిని ‘కాలా అంబ్’ (నల్లని మామిడి) అని పిలుస్తారు. ప్రస్తుతం ఆ చెట్టు లేకపోయినప్పటికీ, అక్కడ ఒక స్మారక చిహ్నం ఉంది.

మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠా సైన్యానికి సదాశివరావు భావు సర్వసైన్యాధ్యక్షుడిగా నాయకత్వం వహించారు.పేష్వా బాలాజీ బాజీరావు సోదరుడైన రఘునాథరావు స్థానంలో ఈయన పోరాట బాధ్యతలు చేపట్టారు.

భావు అప్పటికే ఉదయగిరి యుద్ధంలో నిజాంను ఓడించి మంచి పేరు తెచ్చుకున్నారు. పానిపట్‌లో కూడా అత్యుత్తమ ఫిరంగి దళాన్ని (Artillery) ఉపయోగించారు.యుద్ధంలో మరాఠాలు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఆయన వెనకడుగు వేయకుండా స్వయంగా శత్రువుల మధ్యలోకి దూకి పోరాడి వీరమరణం పొందారు.

పార్క్ కి కొంచెం దూరంలో మొదటి పానిపట్ యుద్ధం (1526) జరిగిన ప్రదేశంలో ఇబ్రహీం లోఢీ సమాధి  ఉంది. మొఘల్ చక్రవర్తి బాబర్ చేతిలో ఓడిపోయిన ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోఢీ ఇక్కడే ఖననం చేయబడ్డారు. మూడవ పానిపట్ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, కవచాలు,  మరాఠా, అఫ్గాన్ సైనికులు వాడిన  వస్తువులను ఇక్కడి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించినందుకు గుర్తుగా బాబర్ తన భార్య కాబూలీ బేగం పేరు మీద ఇక్కడే కాబూలీ బాగ్ మసీదు  ని నిర్మించారు.సాలార్ గంజ్ గేట్… పానిపట్ నడిబొడ్డున ఉన్న ఈ పురాతన ద్వారం అప్పటి వాస్తుశిల్పకళకు నిదర్శనం.

బౌలీ … ఇది లోఢీ కాలం నాటి పురాతన బావి, ఇది అప్పటి నీటి పారుదల వ్యవస్థను తెలియజేస్తుంది.పానిపట్ వెళ్ళినపుడు ఈ పార్క్ చూసి  రండి. పానిపట్ నగరానికి చాలా దగ్గరలో ఈ కాలా అంబ్ పార్క్ ఉంది. పానిపట్ సిటీ సెంటర్ నుండి ఇది సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.బస్సులు,ఆటోలు దొరుకుతాయి.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!