Autobiography ………..
సూపర్ స్టార్ రజనీ కాంత్ జీవిత చరిత్ర పై ఇప్పటికే నాలుగు పుస్తకాలు వెలువడ్డాయి. ఇపుడు రజనీకాంత్ తన ఆత్మకథను (Autobiography) స్వయంగా రాస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ అధికారికంగా ఆ మధ్య ధృవీకరించారు.
రజనీకాంత్ ప్రతిరోజూ దాదాపు రెండు గంటల సమయాన్ని ఈ పుస్తకం రాయడానికి కేటాయిస్తున్నారు.ఈ ఆత్మకథ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆత్మకథను 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.నిజ జీవితంలో మౌనంగా ఉండే రజనీకాంత్, తన మనసులోని మాటలను ఈ పుస్తకం ద్వారా అభిమానులతో పంచుకోబోతున్నారు.
రజనీకాంత్ రాస్తున్నఆత్మకథలో ఆయన జీవితంలోని అత్యంత కీలకమైన మలుపులను, ముఖ్యంగా తన వ్యక్తిత్వాన్ని మలిచిన ప్రారంభ దశాబ్దాల గురించి, తనను నడిపించిన ఆధ్యాత్మిక శక్తుల గురించి లోతుగా ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.
1950 – 1973 మధ్య బెంగళూరులో గడిచిన తన చిన్నతనం, తల్లిని కోల్పోయిన బాధ, బస్ కండక్టర్‌గా పనిచేసిన కాలం గురించి ఆయన ఎక్కువగా రాస్తున్నారు. ముఖ్యంగా తన స్నేహితుడు రాజ్ బహదూర్ ప్రోత్సాహంతో చెన్నైకి వచ్చి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ఆ రోజులను (1973) ఆయన హృద్యంగా వివరిస్తున్నారట.
1975 – 1980 మధ్య కె. బాలచందర్ ‘అపూర్వ రాగంగల్’ (1975)తో మొదలైన ప్రయాణం, విలన్ నుండి హీరోగా మారిన ఆ ఐదేళ్ల కాలాన్ని ఆయన ఒక కీలక ఘట్టంగా చూస్తున్నారు. 1990 – 2000 మధ్య ‘బాషా’ వంటి సినిమాలతో శిఖరాగ్రానికి చేరినప్పుడు, తన మనసులో కలిగిన శూన్యం, ఆధ్యాత్మికత వైపు మళ్లిన కాలాన్ని (ముఖ్యంగా 1999-2002 ‘బాబా’ సినిమా సమయం) ఆయన విస్తృతంగా చర్చిస్తున్నారు.
ఈ ఆత్మకథలో ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు ప్రధాన గురువుల గురించి ప్రత్యేక అధ్యాయాలు ఉండబోతున్నాయి.
మహావతార్ బాబాజీ: హిమాలయాల్లో ఉండే ఈ సిద్ధుడిని రజనీకాంత్ తన పరమ గురువుగా భావిస్తారు. బాబాజీ నుంచి ఆయన పొందిన ‘క్రియా యోగ’ సందేశాల గురించి ఇందులో ప్రస్తావించనున్నారు.
శ్రీ రాఘవేంద్ర స్వామి: తన చిన్నతనం నుండి తనకు అండగా నిలిచిన దైవంగా రాఘవేంద్రుడిని ఆయన నమ్ముతారు. తన 100వ సినిమాను ఆయనకే అంకితం చేయడానికి గల కారణాలను ఆయన వివరిస్తున్నారు.
స్వామి దయానంద సరస్వతి: వేదాంత పరమైన సందేహాలను నివృత్తి చేసిన గురువుగా ఆయన గురించి ప్రస్తావిస్తున్నారు. అలాగే సచ్చిదానంద సరస్వతి, రమణ మహర్షి బోధనల ప్రభావం గురించి కూడా రాస్తున్నారు.
ఇక తాను ప్రారంభించాలనుకున్న రాజకీయ పార్టీ గురించి ఆధ్యాత్మిక రాజకీయాల గురించి ఇందులో ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. రజనీకాంత్ తన ఆత్మకథలో సినిమా విజయాల కంటే, ఒక సాదాసీదా శివాజీ రావు గైక్వాడ్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌గా మారే క్రమంలో పడిన మానసిక సంఘర్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.
తన ఆత్మకథకు ఇంకా అధికారికంగా ఎటువంటి టైటిల్‌ను ఖరారు చేయలేదు. అయితే, చిత్ర పరిశ్రమలో, ఆయన సన్నిహిత వర్గాల్లో కొన్ని ఆసక్తికరమైన పేర్లు ప్రచారంలో ఉన్నాయి.“ద జర్నీ” (The Journey) ఒక సాధారణ బస్ కండక్టర్ నుండి గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణాన్ని సూచిస్తూ ఈ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.అలాగే “నిజల్ నిజం” “హిమాలయన్ స్టోరీ” అనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
బహుశా పుస్తకం పూర్తయ్యే సమయానికి తన ఆధ్యాత్మిక గురువుల సూచనల మేరకు లేదా తన మనసుకి నచ్చిన ఒక సింపుల్ అండ్ పవర్‌ఫుల్ పేరును ఆయన ప్రకటిస్తారు. ఆయన అభిమానులు మాత్రం దీనికి “తలైవా” (Thalaiva) లేదా “సూపర్ స్టార్” అనే పేర్లు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, రజనీకాంత్ స్వభావం ప్రకారం ఆయన చాలా వినమ్రంగా ఉండే టైటిల్‌నే ఎంచుకునే అవకాశం ఉంది.
రజనీకాంత్ అమితాబ్ బచ్చన్‌ను తన “గురువు”గా , పెద్దన్నగా భావిస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న 40 ఏళ్ల అనుబంధం దృష్ట్యా, అమితాబ్ ఈ పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక గ్లోబల్ స్టార్‌గా రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తొలుత తమిళంతో పాటు, ఇంగ్లీష్లో ఈ ఆత్మకథ విడుదలవుతుంది. ఆయనకు భారీగా అభిమానులు ఉన్న తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో అనువదించి విడుదల చేస్తారు.రజనీకాంత్‌కు జపాన్‌లో ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, దీనిని జపనీస్ భాషలోకి కూడా అనువదించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అలాగే ఫ్రెంచ్, చైనీస్ భాషల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. 2026 చివరలో రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12) సందర్భంగా దీనిని గ్రాండ్‌గా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రజనీ అభిమానులు ఈ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నారు.
రజనీకాంత్ జీవిత విశేషాలతో నాలుగు పుస్తకాలు వచ్చాయి. 1.Rajinikanth: The Definitive Biography: దీనిని నమన్ రామచంద్రన్ రాశారు. ఇది రజనీకాంత్ బాల్యం నుండి స్టార్‌డమ్ వరకు పూర్తి వివరాలను అందిస్తుంది.
2.The Name is Rajinikanth: దీనిని గాయత్రి శ్రీకాంత్ రాశారు. ఇది రజనీకాంత్ గురించి వచ్చిన మొదటి జీవిత చరిత్రలలో ఒకటి.
3.Rajini’s Mantras: దీనిని పి.సి. బాలసుబ్రమణియన్ రాశారు. రజనీకాంత్ జీవిత పాఠాలు, ఆయన మేనేజ్‌మెంట్ శైలి గురించి ఇది వివరిస్తుంది.
4.Rajinikanth: A Life: ప్రసిద్ధ రచయిత్రి వాసంతి ఈ పుస్తకాన్ని రచించారు.

