A weak narrative ……..
కల్వన్’ (Kalvan) ఇదొక తమిళ సినిమా.. జి.వి. ప్రకాష్ కుమార్, ఇవానా, దర్శకుడు, నటుడు భారతీరాజా ప్రధాన పాత్రల్లో, పి.వి. శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కల్వన్ అంటే తెలుగులో దొంగ అని అర్ధం. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే?
సత్యమంగళం అడవి సరిహద్దు ప్రాంతంలో కెంబన్ (జి.వి. ప్రకాష్), సూరి (ధీనా) అనే ఇద్దరు చిన్నపాటి దొంగలు ఉంటారు. కెంబన్, బాలమణి (ఇవానా) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే అటవీ శాఖలో ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాలి, దానికి 2 లక్షల రూపాయల లంచం అవసరమవుతుంది.
ఈ క్రమంలో, అడవిలో ఏనుగు దాడి చేసి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో నష్టపరిహారం వస్తుందని తెలుస్తుంది. దాంతో కెంబన్ ఒక వృద్ధాశ్రమం నుండి ఒక ముసలాయనను (భారతీరాజా) తెచ్చి, అడవి ఏనుగు చేత అతన్ని ప్రమాదవశాత్తు చంపించి ఆ డబ్బు కొట్టేయాలని ఒక ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కెంబన్ ప్లాన్ పారిందా? లేదా అనేది మిగతా కథ..
భారతీరాజా తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన పాత్ర, ఎమోషన్స్ కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. అమాయకంగా ఉంటూనే, కథానాయకుడు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలియకుండా ఆయన చూపించే ప్రేమాభిమానాల సీన్స్ సినిమాకు కాస్త బలాన్నిచ్చాయి.
నష్టపరిహారం డబ్బుల కోసం అడవి ఏనుగు చేత తాతను చంపించాలని హీరో ప్లాన్ వేసే సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనుషుల్లోని స్వార్థాన్ని, డబ్బు కోసం ఎంతకైనా తెగించే నైజాన్ని ఈ సన్నివేశం చక్కగా చూపిస్తుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జి.వి. ప్రకాష్ బాగా నటించారు. ధీనా కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. హీరోయిన్ ఇవానా నర్స్ పాత్రలో బాగా ఇమిడిపోయింది.
సత్యమంగళం అటవీ ప్రాంతాన్ని కెమెరామెన్ (దర్శకుడు పి.వి. శంకరే సినిమాటోగ్రాఫర్) చాలా సహజంగా, అందంగా చూపించారు. దట్టమైన అడవి నేపథ్యంలో వచ్చే ఏనుగుల విజువల్స్, చేజింగ్ సీన్స్ సినిమాలో అత్యంత ఆకట్టుకునే అంశం. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ చాలా సహజంగా ఉండి, కొన్ని చోట్ల ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతాయి.
సినిమా కథనం నెమ్మదిగా సాగుతుంది. కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ, దాన్ని తెరపై చూపించిన విధానం చాలా నెమ్మదిగా, సాగదీసినట్టు ఉంటుంది. తాతను చంపాలనే ప్లాన్ నుండి అతనిపై ప్రేమ కలగడం అనే పాయింట్‌లో ప్రేక్షకుడికి సరిగ్గా ఎమోషన్ కనెక్ట్ అవ్వదు.
నాటకీయత ఎక్కువైపోయింది.కథతో కనెక్ట్ చేసే భావోద్వేగ సన్నివేశాలు లేవు. ఉన్న ఒకటి అరా సరిగ్గా పండలేదు.బలహీనమైన కథనం కారణంగా సినిమా బోరింగ్‌గా మారుతుంది. కథ,కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా బాగా వచ్చేది.
ఊళ్లోకి వచ్చిన ఏనుగును చూసి ప్రజలు భయపడుతున్న సమయం లో భారతీ రాజా ముందు కొచ్చి దాన్ని డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే పులి విషయం లో తెగువ చూపి పాప ను రక్షించే సీన్ బాగుంటుంది. అప్పుడే అందరికి తెలుస్తుంది భారతీ రాజా గతంలో సర్కస్ లో పని చేసిన విషయం. ఊరంతా ఆయనను అభినందిస్తారు. ఆయా సన్నివేశాలు బాగున్నాయి.
ఒక థ్రిల్లర్ లేదా అడ్వెంచర్ డ్రామాలో ఉండాల్సిన ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ సినిమాలో కరువయ్యాయి. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. భారతీ రాజా అభిమానులు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా.

