A different kind of actor…………..
‘జైలర్’ సినిమాలో విలన్ పాత్ర మామూలు విలన్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. మహా క్రూరం గా వ్యవహరిస్తుంటాడు. ఆ క్యారెక్టర్ ను దర్శక రచయితలు అలా వెరైటీగా మలిచారు. నటుడు వినాయకన్ ఆ విలన్ వర్మ పాత్రలో ఇమిడిపోయారు.
వినాయకన్ కళ్ళలో ఒక రకమైన క్రూరత్వం, అదే సమయంలో ఒక నిశ్శబ్దం కనిపిస్తాయి. అతను కేవలం కళ్ళతోనే ఎదుటివారిని భయపెట్టగలడు. జైలర్ సినిమాలో అతను కళ్ళు పెద్దవి చేసి చూసే విధానం బాగుంటుంది.
అతని ముఖంలో ఉండే ఆ క్రూరమైన నవ్వు, వింతైన హావభావాలు అతని పాత్రలకు ఒక ‘సైకో’ విలన్ ఇమేజ్‌ని ఇస్తాయి. అతను నవ్వినా కూడా అది వెటకారంగా, భయంకరంగా అనిపిస్తుంది. వినాయకన్ నటనలో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. అతను తన పాత్రల్లో ఒక రకమైన ‘రా’ ఎనర్జీని చూపిస్తాడు, ఇది అతని ప్రత్యేకత.
వర్మ పాత్ర ఈ ‘జైలర్’సినిమాకు అతిపెద్ద బలం. రజనీకాంత్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి ధీటైన ప్రతి నాయకుడిగా వినాయకన్ అద్భుతంగా నటించారు. వర్మ పాత్ర కేవలం మామూలు విలన్ లా కాకుండా, ఒక రకమైన సైకోటిక్ విలనీని ప్రదర్శిస్తుంది.
వినాయకన్ తన కళ్ళతో, విచిత్రమైన నవ్వుతో, బాడీ లాంగ్వేజ్‌తో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ముఖ్యంగా శత్రువులను చంపి యాసిడ్ డ్రమ్ములలో వేసేటప్పుడు ఆయన చూపించే క్రూరత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వర్మ పాత్రను దర్శకుడు ఆవిధంగా పరిచయం చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు ఏ నటుడైనా తేలిపోయే అవకాశం ఉంటుంది. కానీ వినాయకన్ తనదైన స్టైల్ లో హై-ఎనర్జీతో వర్మ పాత్రను నిలబెట్టారు. ఆయన నడక, కూర్చునే విధానం, ఆ నవ్వు పాత్రలోని కిరాతకత్వాన్ని బాగా ఎలివేట్ చేశాయి. డబ్బింగ్ విషయంలో కూడా ఆయన గొంతులోని బేస్ ఆ పాత్రకు ఒక రకమైన ‘రా’ (Raw) అప్పీల్‌ను ఇచ్చింది.
ఒకవైపు భయంకరమైన హంతకుడిగా కనిపిస్తూనే, క్లైమాక్స్ కి వచ్చేసరికి తన ఓటమిని గ్రహించినప్పుడు ఆయన ముఖంలో కనిపించే అసహాయత, చిరాకు కూడా చాలా సహజంగా ఉన్నాయి.సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ వర్మ పాత్ర గురించి మాట్లాడుకునేలా వినాయకన్ తన నటనతో మాయ చేశారు.
మలయాళంలో మంచి నటుడిగా గుర్తింపు ఉన్న ఆయనకు, ఈ సినిమా సౌత్ ఇండియా లెవల్లో భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది.సినిమా అంతటా రజనీ .. వర్మ పాత్ర మధ్య జరిగే ఫోన్ కాల్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. రజనీకాంత్ చాలా ప్రశాంతంగా మాట్లాడుతూనే వర్మకు చుక్కలు చూపిస్తుంటే, వర్మ చిరాకు పడుతూ, అరుస్తూ చేసే యాక్టింగ్ ఈ ఇద్దరి మధ్య ఉన్న ‘కాంట్రాస్ట్’ (భిన్నత్వం)ను బాగా ఎలివేట్ చేసింది.
క్లైమాక్స్‌లో వర్మ తన ఆఫీసులో కూర్చుని సీసీటీవీ కెమెరాల్లో తన మనుషులు చనిపోవడం చూస్తూ షాక్ అయ్యే సీన్. రజనీకాంత్ గన్ పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే, వర్మ భయం,ఓటమి కలగలిసిన ముఖంతో చూసే ఆ క్షణాలు అద్భుతంగా పండాయి.
సినిమాలో ఎక్కడైతే వర్మ పైచేయి సాధిస్తున్నాడని అనిపిస్తుందో, అక్కడ ‘హుకుం’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రజనీ ఇచ్చే ఎలివేషన్లు వర్మ పాత్రను మరింత క్రూరంగా మార్చడానికి తోడ్పడ్డాయి. మొత్తం మీద వినాయకన్ తనదైన శైలిలో నటించి పాత్రను రక్తి కట్టించాడు.
ఇక వినాయకన్ గురించి చెప్పుకోవాలంటే ….. తన విభిన్నమైన నటనతో, ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేరళలోని కొచ్చిలో జన్మించిన వినాయకన్ బాల్యం ఆర్థిక ఇబ్బందుల మధ్య గడిచింది. ఆయన మొదట నృత్యంపై ఆసక్తితో ‘బ్లాక్ మెర్క్యురీ’ అనే బృందాన్ని ఏర్పాటు చేసి, నిప్పుతో చేసే నృత్య ప్రదర్శనలు (Fire Dance) ఇచ్చేవారు.
2002లో వచ్చిన ‘స్టాప్ వైలెన్స్’, 2006లో వచ్చిన ‘చింతామణి కొలకేస్’ వంటి మలయాళ చిత్రాల్లో హాస్య, సహాయక పాత్రల ద్వారా ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. 2016లో వచ్చిన ‘కమ్మట్టిపాడం’ చిత్రం వినాయకన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో అణగారిన వర్గానికి చెందిన ‘గంగ’ అనే పాత్రలో ఆయన అద్భుతమైన నటనను కనబరిచి, కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
ఈ పాత్రలో ఆయన చూపిన భావోద్వేగాలు, సహజమైన నటన అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఆ తర్వాత ‘ఈ.మా.యౌ’ (Ee.Ma.Yau.), ‘తొట్టప్పన్’ వంటి చిత్రాల్లో శక్తివంతమైన పాత్రలు పోషించి, సంక్లిష్టమైన పాత్రలకు ప్రాణం పోయగల నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.ఇక జైలర్ ఆ తర్వాత వచ్చిన సినిమాలు తెలిసినవే.
వినాయకన్ కెరీర్‌లో విజయాలతో పాటు కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి..2023లో కాంగ్రెస్ నేత ఉమెన్ చాందీ మరణం తర్వాత, ప్రజలు ఆయన కోసం సంతాపం తెలపడాన్ని ప్రశ్నిస్తూ వినాయకన్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇది తీవ్ర దుమారం రేపింది.
ఆయన వ్యాఖ్యలు అగౌరవంగా ఉన్నాయని భావించిన రాజకీయ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.సెప్టెంబర్ 2024లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మద్యం మత్తులో విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

