Dr.Vangala Ramakrishna ……………………..
మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజ స్తంభం … ఆ వెంటనే నందికేశ్వరుడు కనపడతాడు. శివునికి ఎదురుగా కూర్చుని ప్రథమ దర్శనమందించే నందికేశ్వరుని దర్శించుకున్నాకే శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది.
వృషభ రూపుడైన నందికి శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా లభించింది? ఆయన కొమ్ముల మధ్య నుండి నేరుగా లింగదర్శనం చేసుకునే శృంగదర్శన సంప్రదాయం ఎలా ఏర్పడింది? అనే విషయాలు తెలుసుకుందాం.
ఒకానొకప్పుడు శిలాద మహర్షి శివుని కోసం ఘోరతపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఆనందంతో పొంగిపోయిన శిలాదుడు ‘నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు అయిన కొడుకు కావాలి’ అన్నాడు. “నాలాంటి వాడు వేరొకడు లేడు కనుక నేనే నీకొడుకుగా వస్తాను” అన్నాడు…
తన మహిమతో ‘ఆది వృషభము’ను సృష్టించి దానికి ‘ధర్మము’ అని పేరు పెట్టాడు. శివాలయంలో బాలశివుడిగా నిలిచి ధర్మరక్షణ చేసేందుకు శిలాదుడికి అయోనిజుడిగా జన్మించమన్నాడు శివుడు. బాలశివుని రాకను సుగమం చేసేందుకు శిలాదుడు యజ్ఞం చేశాడు. అగ్నిగుండం నుంచి చంద్రరేఖవంటి కిరీటం, వజ్రకవచం ధరించి మెరిసిపోతూ ఒక మూర్తి దర్శనమిచ్చాడు.
తెల్లని శరీరం మీద భస్మ రేఖలతో, నాలుగు భుజాలతో బాలశివుడిలా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూడగానే శిలాదుడు ఆనందంతో పొంగిపోయాడు. దర్శన మాత్రంతోనే ఆనందమిచ్చే ఆ బాలశివుని నందీ అని పిలిచాడు. అప్పటి నుంచి ధర్ముడు కాస్తా నంది అయ్యాడు.
భాషావాదులు నంది అనేది తమిళ పదమంటారు. “నన్” అనే మూల శబ్దం నుంచి “నందు” అనే పదం పుట్టిందనీ, అదే వ్యవహారంలో నందిగా మారిందని అంటారు. నంది అంటే పెరగడం, వృద్ధి చెందడం, కనిపించడం అని అర్ధాలు చెబుతారు.
ఇక సంస్కృతంలో “నంది” అన్న పదానికి “సంతోషం, ఆనందం, సంతృప్తి” అనే అర్ధాలున్నాయి. శివుని సన్నిధిలో వీటిని పుష్కలంగా పొందేవాడు కనుక శివుని నందిగా, పార్వతి ప్రేమాభిమానాలు పొందినవాడు కనుక వాల్లభ్యానందిగా సార్థకనామధేయుడయ్యాడు.
అలాగే వ్యవహారంలో స్థిరపడ్డాడు. అయిదు సంవత్సరాల వయసులోనే నంది వేదవేదాంగ పండితుడయ్యాడు. ఒకరోజు మిత్రావరుణులు అనే రుషులు శిలాద మహర్షి ఆశ్రమానికి వచ్చి నందిని చూశారు. “అతను జ్ఞానం చేత చిరంజీవి అవుతాడు కానీ శరీరం చేత కాడు. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపొయింది” అని చెప్పి వెళ్ళిపోయారు.
శోకించే శిలాదునికి నంది ధైర్యం చెప్పి పరమశివుని కోసం కోటి సంవత్సరాలు తపస్సు చేశాడు.
శంకరుడు ప్రత్యక్షమై “నీవు ఎప్పటికీ చిరంజీవివే “ అని ఆశీర్వదించాడు. నందీశ్వరుడు పూర్ణాయుష్కు డయ్యాడు. ఎప్పుడూ నిన్ను చూస్తూ, సేవిస్తూ ఉండే వరమిమ్మన్నాడు నంది. అనుగ్రహించాడు శివుడు. మరో రెండు కోట్ల సంవత్సరాలు తపస్సుచేసే భాగ్యాన్ని ప్రసాదించమన్నాడు. అనుగ్రహించాడు శివుడు.
తన మెడలో ఉన్న బంగారు పద్మ హారాన్ని నంది మెడలో వేశాడు. ఆ మాల మెడలో పడగానే నందికి మూడవకన్ను అయిదు ముఖాలు, పది భుజాలు వచ్చాయి. ఈవిధంగా నంది శివునితో సమానమైన ఆకారంతో వెలుగొంది నందికేశ్వరు డయ్యాడు.
ఆయన వాస్తవరూపం వృషభం కనుక శివాలయాలలో వృషభాకారంలో దర్శనమిస్తాడు. ప్రమద గణాధిపతి హోదాలో నంది కైలాస సంరక్షకుడయ్యాడు. శివానుగ్రహం అంతటితో ఆగలేదు. నందికి శివుడు కామరూపత్వాన్ని వరంగా ఇచ్చాడు. అందుకే నంది మనకు 1) ప్రమద గణాధిపతిగా, 2) చేపగా, 3) ఋషిగా, 4) ఎద్దుగా 5) మృదంగ విద్వాంసుడిగా వివిధ ఆకారాలలో కనబడతాడు.
అమ్మ పార్వతి పుత్రప్రేమతో నందీశ్వరుని అక్కున చేర్చుకుంది. శివుడు తన జటాజూటంలో వున్న గంగాజలం పిల్లవాడి శిరసున చల్లాడు. అవి నందీశ్వరుని నుండి జాలువారి ‘త్రిశ్రోట, జటోదక, స్వర్ణోదక, జంబూనది, వృషధ్వని’ అనే అయిదు నదులుగా ప్రవహించాయి.
ఈ అయిదు నదులూ ప్రవహించే మధ్యప్రదేశంలో పరమేశ్వరుడు శివలింగం ఒకటి ప్రతిష్ఠించాడు. ఆ అయిదు నదులలో స్నానం చేసి అక్కడి శివలింగమును ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.