Bharadwaja Rangavajhala…………………………….
విజయావారి మాయాబజార్ సినిమాకి మొదట అనుకున్న కృష్ణుడు ‘సిఎస్ఆర్’. అయితే సినిమా అనుకున్న తర్వాత చాలా కాలానికి గానీ కార్యరూపం దాల్చలేదు. దీనికి నిర్మాత దర్శకుల మధ్య ఉన్న గ్యాపు కారణం. అది తొలగి సినిమా మొదలెట్టే సమయానికి … సిఎస్ఆర్ శకుని అయ్యి .. కృష్ణుడుగా ‘ఎన్టీఆర్’ను అనుకున్నారు కె.వి.రెడ్డి.
ఠాఠ్ కృష్ణుడేషం నేను కట్టేది లేదని ఎన్టోడు భీష్మించుకుని కూర్చున్నాడు అరే ఏమయిందిర అయ్యా … ఎందుకంత నారాజవుతవ్ వేషమే కదా వేయరాదే అని ఎందరు చెప్పినా ఎన్టీఆర్ వినడం లేదట.
విషయం ఏమిటంటే అంతకు ముందు ఆయన ‘సొంతవూరు’ అనే సినిమాలో కృష్ణుడుగా కనిపిస్తే జనం తెరలు చింపేశారన్నమాట… దాంతో మనకెందుకొచ్చిన గొడవని దూరంగా ఉందామనుకున్నాడు పాపం.
విషయం కె.వి.రెడ్డికి తెల్సింది. వార్నీ … ఇదిరా విషయం అని ‘రామారావు’ని పిల్చి ….అబ్బాయి నువ్వు ఆందోళన పడకు … నీ గెటప్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని ధైర్యం చెప్పారట.ఆఫ్ క్రౌను పెట్టడం వల్ల మనోడు బాలేడుగానీండీ … ఫుల్లు క్రౌను పెడితే బావుంటాడని మాధవపెద్ది గోఖలే తో కలసి కూర్చున్న కె.వి బుర్రకి తట్టింది.
అలా మొత్తానికి మొత్తం కృష్ణుడి గెటప్ అంతా ఎలా ఉండాలో డిజైన్ చేసిచ్చాడు గోఖలే. ఆ ప్రకారం అన్నగారికి మేకప్ వేసి డైలాగుల ప్రాక్టీసుకు పింగళి సమక్షంలో రిహార్సల్స్ వేశారు. డైలాగు చెప్తూ చేతులు విసిరే అలవాటున్న రామారావుకి ఎన్ని సార్లు చెప్పినా మానడం లేదు.
దీంతో పింగళి … ఇలా కాదుగానీ ఈ కృష్ణుడి చేతిలో కంటిన్యూగా వేణువు పెట్టేయండన్నారట. తర్వాత ‘బాబూ రామారావూ … డైలాగ్ చెప్పేటప్పుడు చేతులు ఊపాలనిపిస్తే ఈ వేణువును ఒక చేత్తో పట్టుకుని రెండో చేతి మీద కొట్టుకుంటూ మాట్లాడు … అదో స్టైలనుకుంటారు ఆడియన్సు’ అని పింగళి చిట్కా చెప్పారు. అన్నగారు వాకే అనేయడం తో కృష్ణుడు రడీ అయ్యాడు.
అప్పుడు కె.వికి మరో ఆలోచన వచ్చింది. రామారావులో కాన్ఫిడెన్సు నింపాల్సిన అవసరం ఉందనుకున్నారు. అతనికి కాన్ఫిడెన్సు కుదరకపోతే ఏ క్షణంలో అయినా సినిమా తిరగబడొచ్చనేది ఆయన ఆందోళన. దీంతో ఒక స్కీమాలోచించారు … స్టూడియో సిబ్బంది అందరినీ సమావేశపరచి రామారావు మేకప్ వేసుకుని శ్రీ కృష్ణుడి గెటప్ లో ఎవరికి కన్పించినా ఓ దణ్ణం పెట్టాలని చెప్పారు. అందరూ ‘సరే ‘అన్నారు.
అలాగే యూనిట్ నూ సమావేశపరచి ఇదే విషయం చెప్పారు. వారూ ‘ఓకే ‘అన్నారు. రామారావు మేకప్ వేసుకుని శ్రీ కృష్ణుడు గెటప్ లో రూం నుంచీ బయటకు వచ్చింది లగాయతూ … అందరూ దణ్ణం పెడుతూనే ఉన్నారు. దీంతో అన్నగారిలో కాన్ఫిడెన్సు మొలిచి మొక్కై మానై మహా వృక్షమై పోయింది.
తనను తాను నిజంగానే శ్రీ కృష్ణుడిలా ఉన్నాననుకున్నారు. సినిమా రిలీజయ్యాక సినిమా చూసిన ఆబాలగోపాలం కూడా అదే అన్నారు. దీంతో ఆయన శ్రీ కృష్ణుడి అంశ తానేమో అని అనుమానపడే దాకా వెళ్లిపోయారు. అలా తయారైన మాయాబజార్ పేఎఎఎఎఎఎఎద్ద హిట్టైపోవడంతో అన్నగారి కాన్ఫిడెన్సు అంబరాన్నంటింది.
అది ఆయనతో ఎన్నెన్నో విన్యాసాలు చేయించింది. ఎవరూ అధిగమించ, సాహసించని ఎత్తులూ చూపించింది. ఎవరూ ఊహించని పాతాళాలూ చూపించింది. అయినా ఆయన ఇబ్బంది పడలేదు.రామారావు ఊపిరి తీసినంత కాలం కె.వి రెడ్డి నింపిన కాన్ఫిడెన్సు వదల్లేదు.