డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Comedy thriller…….

మలయాళంలో విజయం సాధించిన ‘భరతనాట్యం 2: మోహినీయాట్టం’  ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. 2024లో వచ్చిన ‘భరతనాట్యం’ సినిమాకు సీక్వెల్‌గా ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ను తీశారు.

కథేంటంటే?

భరతన్ నాయర్ చనిపోయిన తర్వాత అతని పెద్ద కొడుకు శశి (సైజూ కురుప్) పై కుటుంబ బాధ్యతలు పడతాయి. తన తండ్రికి ఉన్న రెండో భార్య (రుక్మిణి), ఆమె కొడుకును వారి సొంతూరు అయిన శ్రీకందపురంలో సెటిల్ చేయడానికి శశి తన కుటుంబంతో కలిసి వెళ్తాడు.

కానీ అక్కడ గోవిందరాజన్ (సూరజ్ వెంజరమూడు) అనే వ్యక్తి ఎంటరై, గతంలో భరతన్ నాయర్ చేసిన కొన్ని అక్రమాలను బయటపెడతానని, రూ.75 లక్షలు ఇవ్వాలని శశి కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా గోవిందరాజన్ చనిపోతాడు. అతగాడి  మృతదేహాన్ని దాచడానికి ఆ కుటుంబం చేసిన ప్రయత్నాలే ఈ సినిమా కథ.

ఒక సీరియస్ క్రైమ్ చుట్టూ తిరిగే కథను దర్శకుడు కృష్ణదాస్ మురళి అత్యంత హాస్యభరితంగా మలిచారు. కథాగమనంలో కొన్నిచోట్ల చిన్నపాటి లాజిక్ లోపాలు ఉన్నప్పటికీ సినిమా బోర్ కొట్టదు. కొన్ని మలుపులు (Twists) ప్రేక్షకులు ముందే ఊహించేలా ఉంటాయి.అయితే కామెడీ ఫ్లో వల్ల వాటిని పెద్దగా పట్టించు కోవాల్సిన అవసరం ఉండదు.

సాధారణంగా అందరూ భయపడే, బాధపడే, లేదా సీరియస్‌గా భావించే చేదు నిజాలను కామెడీగా చూపించే  శైలి లో సినిమా నడుస్తుంది (డార్క్ కామెడీ ) దర్శక రచయితలు సన్నివేశ కల్పనపై బాగా కసరత్తు చేశారు. తెలుగు వెర్షన్ డైలాగులు కూడా బాగున్నాయి.  ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా, ఉత్కంఠను కలిగిస్తూనే నాన్‌స్టాప్‌గా నవ్వించడమే ఈ డార్క్ కామెడీ సినిమా ప్రత్యేకత.

గోవిందరాజన్ (సూరజ్ వెంజరమూడు) ఎంట్రీ సీన్ బాగుంటుంది. విలక్షణమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ క్యారెక్టర్‌లో సూరజ్ నటన అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రధాన పాత్ర సూరజ్ దే. ఆపాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. సూరజ్ శశి కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్ చేసే సీన్లు, భార్యతో, మేనల్లుడితో మాట్లాడే సీన్లు ఆకట్టుకుంటాయి.

గోవిందరాజన్ పాత్రను చంపే సన్నివేశాలు తమాషాగా ఉంటాయి.  సినిమాలో అసలు గుట్టు విడిపోయే ‘మోహిని ఈశ్వరి’ ట్విస్ట్ సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే ‘ఎలక్ట్రానిక్ కిలి’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ సీన్ బిల్డప్ థ్రిల్ ఇస్తుంది.

రాపర్ బేబీ జీన్ (సుభాష్)  అభిరామ్ రాధాకృష్ణన్ క్యారెక్టర్ల మధ్య జరిగే క్లాష్, క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ సినిమాను రేసీగా మారుస్తుంది. “ఇనీషియల్స్ స్పష్టంగా చెప్పి ప్రార్థించు” అనే డైలాగ్ బాగా పేలింది. 
శశి పాత్రలో సైజూ కురుప్ నటన, విలక్షణమైన విలనిజంతో సూరజ్ వెంజరమూడు నటన సినిమాకు ప్రాణం పోశాయి.

బేబీ జీన్, జగదీష్, కళారంజని తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.బబ్లూ అజు (Bablu Aju) సినిమాటోగ్రఫీ కామెడీ, సస్పెన్స్ మూడ్‌ని తన విజువల్స్,  విభిన్నమైన కెమెరా యాంగిల్స్ ద్వారా అద్భుతంగా స్క్రీన్‌పై ఆవిష్కరించారు.

‘ఎలక్ట్రానిక్ కిలి’ (Electronic Kili) ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. కథలోని క్రైమ్ ఎలిమెంట్స్‌కు, హాస్యానికి తగినట్టుగా ఆయన ఇచ్చిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ఇది.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!