ఆ పార్టీలో చీలికలు కొత్తేమి కాదు !!

Sharing is Caring...

Another split ……….

అన్నాడీఎంకే (AIADMK) పార్టీ మరోసారి చీలిపోయింది. ఆపార్టీ కి చీలికలు కొత్త ఏమీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, మే 12, 2026న ఆ పార్టీ రెండు ముక్కలైంది.మొత్తం ఉన్న 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోయారు.

ప్రస్తుత పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి వైపు కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా నిలిచారు. సీనియర్ నాయకులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు చేరారు.

చీలికకు అసలు కారణం ఏంటి?

నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో వేలుమణి నేతృత్వంలోని మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రెబెల్ వర్గం… విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇక్కడి నుంచే గొడవలు మొదలైనాయి. 

రెబెల్స్ ఆరోపణల ప్రకారం.. పళనిస్వామి (EPS) తాను ముఖ్యమంత్రి కావడం కోసం  సాంప్రదాయ ప్రత్యర్థి అయిన డీఎంకే  తో లోపాయికారీ ఒప్పందానికి ప్రయత్నించారు. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పళనిస్వామిపై తిరుగుబాటు చేశారు.

ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ పళనిస్వామి వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తిరుగుబాటు వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీలో తిరుగుబాటు, చీలిక వార్తలపై  ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) తీవ్రంగా స్పందించారు.

తన నాయకత్వాన్ని సవాలు చేస్తూ వేలుమణి వర్గం విడిపోవడంపై ఆయన చట్టపరమైన, రాజకీయ వ్యూహాలతో ఎదురుదాడి ప్రారంభించారు.అసెంబ్లీ ప్రో-టెమ్ స్పీకర్‌కు పళనిస్వామి వర్గం ఒక లేఖను సమర్పించింది. పార్టీ బైలాస్  ప్రకారం.. ఎన్నికైన జనరల్ సెక్రటరీగా, శాసనసభా పక్ష నేతను నియమించే అధికారం కేవలం తనకు మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తమకు 27 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఒక డాక్యుమెంట్ను కూడా విడుదల చేశారు.

ఎన్నికల ఓటమిని సాకుగా చూపిస్తూ సీ.వీ. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి వంటి సీనియర్లు కావాలనే కుట్ర పూరితంగా ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టిస్తున్నారని పళనిస్వామి ఆరోపించారు.పార్టీ విప్‌ను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే…  రెబెల్ ఎమ్మెల్యేలపై అర్హత వేటు (Disqualification) వేయించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పళనిస్వామి వర్గం హెచ్చరిస్తోంది.

ప్రస్తుతానికి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో… అన్నాడీఎంకే లోని ఈ అంతర్గత పోరు ఇప్పుడు “నిజమైన అన్నాడీఎంకే ఎవరిది?” అనే లీగల్ బ్యాటిల్‌ వైపు మలుపు తిరిగింది. కాగా  జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో జరిగిన మూడో అతిపెద్ద చీలిక ఇది. దీనివల్ల పళనిస్వామి సొంత పార్టీలోనే మైనారిటీగా మిగిలిపోయారు.

తాజా చీలిక కంటే ముందు రెండు సార్లు చారిత్రాత్మకమైన పెద్ద చీలికలు 
1. మొదటి చీలిక (1987) – జానకి వర్సెస్ జయలలిత

1987 డిసెంబర్‌లో పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్  మరణించిన వెంటనే పార్టీ రెండుగా విడిపోయింది.ఒకటి ఎంజీఆర్ సతీమణి జానకి వర్గం కాగా రెండోది జయలలిత వర్గం.

ఎంజీఆర్ భార్య జానకి  కొద్దిరోజులు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసారు.ఈ క్రమంలోనే అప్పట్లో ఎన్నికల సంఘం పార్టీ గుర్తు ‘రెండాకులు’ (Two Leaves) ను కూడా ఫ్రీజ్ చేసింది. అయితే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత వర్గం మెజారిటీ స్థానాలు గెలవడంతో, జానకి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీ మళ్లీ జయలలిత నాయకత్వంలో ఒకటైంది.

2. రెండవ చీలిక (2017) – పన్నీర్‌సెల్వం వర్సెస్ శశికళ/పళనిస్వామి

2016 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జె. జయలలిత మరణం తర్వాత ఈ వివాదం మొదలైంది.అపుడు పన్నీర్‌సెల్వం ఒక వర్గం కాగా శశి కళ ది మరోవర్గం. అప్పటి ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం (OPS) శశికళ కుటుంబ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ‘ధర్మయుద్ధం’ ప్రకటించారు. జైలుకు వెళ్లే ముందు శశికళ.. ఎడప్పాడి పళనిస్వామి ని ముఖ్యమంత్రిని చేశారు.

కొన్ని నెలల పాటు విడివిడిగా ఉన్న ఈ రెండు వర్గాలు ఆ తర్వాత శశికళను పార్టీ నుంచి వెళ్లగొట్టి, EPS-OPS కలిసి ‘ద్వంద్వ నాయకత్వం’ (Dual Leadership) తో పార్టీని నడిపారు. అయితే, 2022 లో పళనిస్వామి ఒంటరిగా అధికారం చేజిక్కించుకుని OPS ను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించారు.

గతంలో జరిగిన ఈ రెండు చీలికలు జయలలిత, ఎంజీఆర్ ల మరణాల తర్వాత వారసత్వం కోసం జరిగాయి. కానీ, ప్రస్తుత చీలిక మాత్రం ఎన్నికల ఘోర పరాజయం, విజయ్ సర్కార్ కి మద్దతు పలికే విషయం లో జరిగింది.ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్ కి మద్దతు ప్రకటించారు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!