భర్తల్లో ఇన్ని రకాలుంటారా ?

Sharing is Caring...

Husbands…………………………………………………

భర్తల్లో పలు రకాల భర్తలుంటారు. ఒక్కోరిదీ ఒక్కో టైపు ..ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. వారి గురించి, వారి లక్షణాల గురించి ప్రభు గారు చక్కగా వివరించారు. సరదాగా చదువుకోండి. 
1..లేలేత భర్తలు
భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం.. భార్య చూపు తగిలితే చాలనుకోవడం.. ” అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”, అనుకోవడం..భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం..అసలు సృష్టిలో భార్య, తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం… అన్నీ పనులూ వచ్చని చెప్పడం.

తమ జీవితంలో సంఘటనలన్నీ,అడిగినా అడక్క పోయినా స్వచ్ఛందంగా,అమాయకంగా ఉన్నది ఉన్నట్టు భార్యకు చెప్పేసుకోవడం..కొన్ని బలహీన క్షణాల్లో ..భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్ధానాలు చేయడం.. ఈ దశ పెళ్ళైన పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది..!

2..దోర’భర్తలు:
పదహార్రోజులంత ఉత్సాహం ఉండదు కానీ,కొంత పచ్చి మిగిలుంటుంది…. “అన్నీ చెప్పేసామే..కొన్ని దాచ వలిసిందే “అని అలోచిస్తూ ఉండడం..పర్లేదులే పరాయిది కాదు కదా కట్టుకున్న భార్యేగా అర్థం చేసుకుంటుందిలే , అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు” అని నమ్మకంగా ఉండటం.. కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం.

భార్యని చీటికి మాటికి సినిమా-షికార్లకి తిప్పడం.. అడక్క పోయినా చీరలు -నగలు కొనిస్తూ ఉండడం.. భార్యకి చిన్న గాయం అవడానికి కొన్ని క్షణాల ముందు నుండే కంగారు దిగులు..కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకోవడం.. విలవిల్లాడిపోవడం.. భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడ్డం.. భార్య పని చేస్తుంటే లాక్కుని ‘నే చేస్తాలే’ అనడం.. తనని పని చేయనివ్వక పోవడం…ఈ స్థితి పెళ్ళైన ఆర్నెల వరకూ ఉంటుంది..!
3…వగరు భర్తలు

అన్నీ అనవసరంగా చెప్పేసాం అని దిగులు పెరగడం..ఆఫీస్ అయి పోయిన వెంటనే స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం.. ఉద్యోగం చేసి ఇంటి పనులూ చేయడం నా వల్ల కాదు “అని అనుకోవడం.. అప్పుడప్పడూ మాట మాట పెరిగి,మళ్ళీ సర్దుకు పోవడం.. కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అనే విపరీత ఆలోచనలు రావడం..

బైటకి తిప్పడం తగ్గించడం భార్య ఏదైనా కొనమని చెప్తేనే కొనడం..భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకి చూపిస్తూ తిరిగితే “ఏదైనా మందు వేసుకో “ఎంత సేపని అలా పనిచేస్తూ ఉంటావ్”అని పేపర్ చదవుతూ రెండు వేళ్ళతో పేపర్ వొంచి ..నిర్లిప్తతగా చెప్పడం.. కానీ భార్య వల’పు’ వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చెయ్యాల్లే కాస్త ,పాపం తను ఒక్కతే కష్టం కదా చేసుకోవడం..అని భావించడం.. ఈదశ పెళ్ళైన ఆర్నెల్ల నుండి మెదటి సంవత్సరం వరకూ ఉంటుంది..!

4..పండిన భర్తలు:

భార్యకి తన విషయాలు అన్నీ చెప్పడం తప్పని నిర్థారించుకోవడం..భార్యతో కాస్త ముభావంగా ఉండడం… ముక్తసరిగా మాట్లాడ్డం..భార్యని ఖశ్చితంగా అదపులో పెట్టాలి,లేకపోతే కష్టం అని నిర్ణయించుకోవడం.. ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసూరుమంటూ ఇంటికి రావడం రావడం తోనే భార్య సంధించే,“ఎందుకు లేటైంది?

ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళారా..?….” లాంటి ప్రశ్నలు .. తట్టుకోలేక కోప్పడ్డం (ఇది మొదటి స్వచ్ఛమైన కోపం) ఏమనుకుంటోందో నేనంటే??’ అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం.. ఇంట్లో పని నేను చెయ్యను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసు కుంటుంది..అయినా ఆడవాళ్ళ పని మనం చేయడమేంటి..? అని  నిశ్చయించుకోవడం..ఈదశ మొదటి సంత్సరం దాటాకా ఆర్నెల్లు ఉంటుంది..! 

మరి కొన్ని రకాల భర్తల గురించి మరో సారి తెలుసుకుందాం.

R.V. ప్రభు గారి సౌజన్యంతో 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!