ఆయన మారువేషాలు వేయని సినిమాల్లో ఇదొకటి !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi …………………..

సూపర్ హిట్ అయిన అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను  ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ ఈ ఎదురీత. ఎన్టీఆర్ ,వాణిశ్రీ లు ముఖ్యపాత్రల్లో నటించారు. 

హిందీ ,బెంగాలీ లోనూ ఉత్తమ కుమార్ , షర్మిలా టాగోర్ హీరో హీరోయిన్లు. 1978 లో తమిళంలో త్యాగం అనే టైటిల్ తో శివాజీ గణేశన్ , లక్ష్మిలతో తీశారు.  అదే సంవత్సరంలో మళయాళంలో ఇత ఒరు మనుషన్ టైటిల్ తో మధు , షీలాలతో వచ్చింది . అన్ని భాషల్లోనూ కమర్షియల్ గా కూడా సక్సెస్ అయిన మంచి సినిమా. ఇదే టైటిల్ తో 1963 లో కాంతారావు , కృష్ణకుమారి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా వచ్చింది. రెండూ వేర్వేరు కధలు .

సినిమా ఎక్కువ భాగం గోదావరి లంక గ్రామాల ప్రాంతంలో తీసారు. NTR , వాణిశ్రీ , జయసుధ , సత్యనారాయణ , జగ్గయ్య , కాంతారావు , ముక్కామల , బాలకృష్ణ ప్రభృతులు నటించారు.   రీమేక్ చిత్రాలు తీయడంలో సిద్ధ హస్తుడైన  v మధుసూదనరావు దర్శకులు. సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు చాలా బాగుంటాయి..హిట్టయ్యాయి కూడా. 

శ్రీశ్రీ వ్రాసిన ఎదురీతకు అంతం లేదా పాట చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . వేటూరి వ్రాసిన ఒక సారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంత బుగ్గ డ్యూయెట్ చాలా బాగుంటుంది . జయసుధ వేసే బాలరాజు బంగారు సామీ పాటతో వేసే గ్రూప్ డాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పాటను కొసరాజు వ్రాసారు. యస్ జానకి పాడింది .

కధానాయకుడు సినిమాలో జయలలిత డాన్స్ ‘ఏమయ్యా రామయ్యా’ గుర్తుకు వస్తుంది . జయసుధ చాలా చలాకీగా నటించింది . జయసుధకు గుర్తింపు తెచ్చిన పాత్ర . టైటిల్సుతో వచ్చే వేటూరి వ్రాసిన గోదావరి వరదల్లో రాదారి పడవల్లె పాట శ్రావ్యంగా ఉంటుంది . NTR మీద మరో పాట తాగితే ఉయ్యాలా ఊగితే జంపాలా కూడా బాగుంటుంది. ఈ సినిమాకు సత్యానంద్ సంభాషణలు అందించారు. వి.యస్.ఆర్.స్వామి  కెమెరా పనితనం గురించి చెప్పనక్కర్లేదు. 

ఈ సినిమాలో NTR పాత్రను మలచటంలో దర్శకుడు గందరగోళ పడ్డాడేమో  అనిపిస్తుంది . జమీందారు కొడుకు మొరటోడిగా కాసేపు , హుందాగా కాసేపు మాట్లాడతాడు.తాగనప్పుడు కూడా ఈ తేడా కనిపిస్తుంది.  ఆ పాత్రను మలచటంలో ఉన్న inconsistency తో సంబంధం లేకుండా NTR బాగా నటించారు . ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే .

వాణిశ్రీని చాలా అందంగా చూపారు. నటన పరంగా ఆమెకూ కొట్టిన పిండే. అతి ఆత్మాభిమానం, టెక్కు , వగైరాల పాత్ర . సత్యనారాయణ తన నటనా ప్రభంజనాన్ని కొనసాగించారు . ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర పోలీసు ఆఫీసర్ జగ్గయ్యది . సహాయ పాత్రలో ఆయన్ని మించినవారు ఎవరున్నారు ! చక్కగా నటించారు. 

పాతాళభైరవి నేస్తం అంజిగాడు ఈ సినిమాలో NTR కి నేస్తంగా నటించారు. అతనితో పాటు సారధి . ప్రేక్షకులకు NTR అంటే సూపర్ హీరో . ఆ హీరోని మరీ నిస్సహాయుడిగా చూపితే జనానికి ఒప్పదు . ఈ సినిమాలో ఆయన పాత్ర కాస్త అలాగే ఉంటుంది . బహుశా ఈ సినిమా బాగా ఆడకపోవటానికి అది కూడా కారణమయి ఉండవచ్చు.

పైగా NTR మార్కు మారువేషాలు లేని సినిమా కూడా. అయినప్పటికీ సినిమా చూడవచ్చు. యూట్యూబులో ఉంది . తరచూ టివి చానళ్ళలో వస్తూ ఉంటుంది . ఈమధ్యనే ఏదో చానల్లో చూసా . వాణిశ్రీ , NTR , జయసుధ అభిమానులు తప్పక చూడతగ్గ feel good movie . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . సినిమా చూసేందుకు టైం లేకపోతే పాటల వీడియోలను చూడండి . 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!