ఏ పనులు చేసినా య‌జ్ఞోప‌వీతాన్నివీడని ఆత్రేయ !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………………….. Never left the tradition.

డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు.వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు చిల్లరదేవుళ్లు నవలను సినిమాగా తీసీ అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు.పైన  మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు.

ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు ఎందుకొచ్చారంటే..1972 అగస్ట్ నెల్లో విడుదలైన కన్నతల్లి సినిమా పాటల గురించి మాట్లాడడానికి వెళ్లారు.నిజానికి ఈ ఫొటో తీసినది 1970 డిసెంబర్ లో.
71 చివరికన్నా సినిమా పూర్తై ఉండాలి.మరి ఎందుకంత ఆలస్యం గా విడుదలైందో?

ఇక పోతే ఈ ఫొటోలో ఆత్రేయ గారి య‌జ్ఞోప‌వీత‌ము కనిపిస్తోంది చూశారూ…. అది చూడగానే నాకో విషయం గుర్తొచ్చింది. బాపు రమణలు వంశ‌వృక్షం తీసి ఆత్రేయకి ప్రీవ్యూ చూపించారు.
ఎలా ఉందంటే … “రమణా ఒరిజినల్ భైరప్ప నవలలో పాత్రలన్నీ శైవ మతస్తులు కదా… తెలుగులో మా నిలువు నామాలుగా మార్చేశావేంట”ని నిలదీశారట. దీంతో రమణగారు మన “సుగతి” ఇంతే అనేశారు.

ఆత్రేయ తో బాపు రమణలు పనిచేసింది ఒక్క ‘పెళ్లీడు పిల్లల’కే. దుక్కిపాటి మధుసూధనరావు గారి సినిమా కావడంతో ఆత్రేయ అనివార్యంగా వచ్చేశారు.ఓ పాట కాస్త మార్చాలని బాపు అంటే ఆత్రేయ  కసురుకున్నారట. దీంతో అలాగే ఉంచి చిత్రీకరణ కానిచ్చేశారట బాపు.

ఆత్రేయ రాసిన పాటల్లో ఆయన వ్యక్తిగత జీవితం కనిపిస్తుంది… ఆత్రేయ జీవితంలో ప్రేమ వైఫల్యం ఉంది. తను ప్రేమించిన అమ్మాయి సగోత్రీకురాలు కావడంతో పెళ్లి చేసుకోలేక పోయాడు. కోడెనాగు చిత్రంలో కథ విందువా నా కథ విందువా పాటలో ..’అన్న’ అను మాటతో అన్ని తుంచేశావు అని రాసిన దగ్గర ఆత్రేయ ప్రేమ వైఫల్యం గురించే చెప్పినట్టు అనిపిస్తుంది.

మోడ్రన్ గా కనిపించినా …కారులో షికారుకెళ్లే లాంటి పాటలు రాసినా …కమ్యూనిస్టు వి.మధుసూధనరావుతో స్నేహం చేసినా హరిపురుషోత్తమరావుతో కలసి తిరిగినా …అందాకా ఎందుకు మందు కొట్టినా…కాట్రగడ్డ మురారి అన్నట్టు అధర్మపత్ని దగ్గరకు వెళ్లినా..య‌జ్ఞోప‌వీతాన్ని వీడలేదు.
సంప్రదాయాన్నీ వదలలేదు.

చివరి రోజుల్లో అన్నమయ్య తీయడానికి చాలా కష్టపడ్డాడు పాపం. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆత్రేయ అన్నమయ్య కోసం పద్దెనిమిది పాటలు రాసి మహదేవన్ చేత స్వరాలూ సిద్ధం చేయించారు. కానీ ఎందుకో బ్రేక్ పడింది. తమాషా ఏమిటంటే ఆత్రేయ శిష్యుడు భారవి రాఘవేంద్రరావు తీసిన అన్నమయ్యకు స్క్రిప్ట్ సమకూర్చారు.  అది తెరకెక్కి సూపర్ హిట్ అయింది.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!