లూసిఫర్ 2–యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Lucifer 2…….

‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan – ). ఇదొక భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్.. 2019 నాటి ఇండస్ట్రీ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా ఇది .మోహన్ లాల్  కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా. మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో  హాలీవుడ్  స్థాయిలో నిర్మించిన సినిమా ఇది.

‘లూసిఫర్’ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే ‘ఎంపురాన్’ కథ ప్రారంభమవుతుంది. మొదటి భాగంలో కేరళ రాజకీయాలను శాసించిన స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) వెనుక ఉన్న అంతర్జాతీయ మాఫియా డాన్ ‘ఖురేషి అబ్రహం ‘ గుర్తింపును రివీల్ చేశారు.

ఈ సీక్వెల్‌లో కథ కేరళ దాటి అంతర్జాతీయ స్థాయికి (ఇరాన్, యూకే, యూఎస్ఏ) మారుతుంది. ఒకవైపు గ్లోబల్ డ్రగ్ కార్టెల్స్, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను నడుపుతున్న ఖురేషి.. మరోవైపు కేరళ రాజకీయాలను లొంగదీసుకోవాలని చూస్తున్న తీవ్రవాద నేత బాల్‌రాజ్ పటేల్ అలియాస్ బాబా బజరంగి (అభిమన్యు సింగ్) నుండి తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలా తిరిగి వచ్చాడు? అలాగే ఖురేషికి కుడిభుజంగా ఉండే జాయెద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్ గతం ఏమిటి? అనే కోణంలో కథ సాగుతుంది.

దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. లొకేషన్లు, హెలికాప్టర్లు, లగ్జరీ కార్లు, భారీ యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్‌ను గుర్తుచేస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే పృథ్వీరాజ్ ఆరిజిన్ స్టోరీ, 2002 నాటి మత ఘర్షణల బ్యాక్‌డ్రాప్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు థ్రిల్ కలిగిస్తాయి.
ఖురేషి అబ్రహంగా మోహన్ లాల్ క్లాస్, మాస్ లుక్, ఆయన నడిచివచ్చే స్లో-మోషన్ షాట్లు అభిమానులకు కను విందు చేస్తాయి.

మొదటి భాగంలో ఉన్న కేరళ పొలిటికల్ డ్రామా, మైండ్ గేమ్స్ ఈ సినిమాలో తక్కువయ్యాయి. కథ ఎక్కువగా అంతర్జాతీయ డ్రగ్స్, గూఢచర్య ముఠాల చుట్టూ తిరగడం వల్ల ‘లూసిఫర్’ ఒరిజినల్ ఫ్లేవర్ కొంత మిస్ అయింది. పీపుల్స్ లీడర్ అయిన  స్టీఫెన్  నెడుంపల్లి లోకల్ అవతార్ కంటే ఇంటర్నేషనల్ డాన్ ఖురేషి పాత్రపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల కొందరికి కనెక్ట్ కాకపోవచ్చు. 

సినిమా ఫస్ట్ హాఫ్‌లో 2002 నాటి మత ఘర్షణల బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పసివాడిగా ఉన్న జాయెద్‌ను ఖురేషి అబ్రహం ఎలా దత్తత తీసుకున్నాడు, అతనికి కుడిభుజంగా ఎలా మార్చుకున్నాడు అనే యాక్షన్ ఎపిసోడ్లు విపరీతమైన థ్రిల్‌ను ఇస్తాయి.హింస ఎక్కువగా ఉంది.  

కథ కేరళ నుండి ఇంటర్నేషనల్ లొకేషన్లకు మారినప్పుడు.. బ్రిటన్, ఇరాన్ లలో ఖురేషి అబ్రహం ను పరిచయం చేసే లగ్జరీ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రైవేట్ జెట్ విమానాలు, భారీ యాట్‌లు, వందలాది మంది బాడీగార్డుల నడుమ మోహన్ లాల్ నడిచివచ్చే ఒక్కో స్లో-మోషన్ ఫ్రేమ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.

అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో ఖురేషి గ్యాంగ్ జరిపే గన్‌ఫైట్, ఛేజింగ్ సీన్స్, హెలికాప్టర్ బ్లాస్టింగ్స్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలను తలపిస్తాయి.బాల్‌రాజ్ పటేల్ పాత్ర కేరళలోని రాజకీయ నాయకులను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి వేసే ఎత్తుగడలు, అతని క్రూరమైన నటన సెకండ్ హాఫ్‌లో డ్రామాను బాగా రక్తికట్టిస్తాయి.

మొదటి భాగం లాగే ఈ సినిమాలో కూడా మంజు వారియర్ తన నటనతో మెప్పించారు. రాజకీయ ఒత్తిళ్లు, చుట్టూ ఉన్న శత్రువుల మధ్య ఆమె తన ఉనికిని కాపాడుకోవడానికి పడే తపన, ఖురేషి పట్ల ఆమె చూపించే విధేయతకు సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

మోహన్ లాల్ ఆమెను రక్షించే సన్నివేశాలు,మంజును పోలీసులు హ్యాండ్ కప్స్ వేసి తీసుకెళ్లే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జతిన్ రామ్‌దాస్ గా టోవినో థామస్ బాగా నటించారు.మోహన్ లాల్  టోవినో థామస్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లే సీన్స్ బాగుంటాయి.  సినిమా ముగింపులో వచ్చే 20 నిమిషాల సుదీర్ఘమైన క్లైమాక్స్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.

ఒక సురక్షితమైన మిలిటరీ బేస్ క్యాంప్ లాంటి ప్రదేశంలో ఖురేషి సైన్యానికి, విలన్ ముఠాకు మధ్య జరిగే క్లైమాక్స్ యుద్ధం, ఊహించని మలుపులతో  ముగుస్తుంది.దీపక్ దేవ్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.ఈ సినిమా జియో హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!