కనక వర్షం కురిపించిన మూవీ !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ………………………………….

A movie that attracts female audience ……………………………………

‘కార్తీకదీపం’ సినిమాను 26 లక్షల బడ్జెటుతో తీశారు.1979 లో రిలీజైన ఈ సినిమా 50 రోజుల్లో60 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దర్శకుడు సెంటిమెంటల్..రొమాంటిక్ సినిమా గా తెరకెక్కించారు. శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఇది. బహుశా ANR కు ,శోభన్ బాబుకు ఉన్నన్ని 1+2 సినిమాలు మరే హీరోకి లేవేమో ! శోభన్ బాబుకు ఫిలిం ఫేర్ బెస్ట్ ఏక్టర్ అవార్డుని తెచ్చిపెట్టింది .

ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి అదృష్టవంతుడు.ఆయన వ్రాసిన కధలు , నిర్మించిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి .ఈ కార్తీకదీపం కధను కూడా ఆయనే వ్రాసారు. ఆయన ఆస్థాన దర్శకుడు లక్ష్మీ దీపకే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. శోభన్ బాబు జోడీగా శ్రీదేవి నటించిన మొదటి సినిమా ఇది. ఆ తర్వాత మరో ఏడు సినిమాలలో నటించింది.

శారదతో మొత్తం 18 సినిమాల్లో శోభన్ జోడీగా నటించాడు.అందరికన్నా ఎక్కువ వాణిశ్రీ తోనే చేసాడు. ఆ ఇద్దరూ 28 సినిమాల్లో జంటగా నటించారు.ఈ సినిమాకంటే ముందు  వచ్చిన ‘బంగారు చెల్లెలు’ సినిమాలో చెల్లెలుగా నటించిన శ్రీదేవి ఇందులో జోడీగా నటించటం విశేషం.. మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు.

ఈ సినిమా వీర హిట్ అవటానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన ‘ఆరనీకుమా ఈ దీపం ..కార్తీకదీపం’ పాట. సినిమాకు అది ఐకానిక్ సాంగ్. సుశీలమ్మ , జానకిలు పాడారు . కార్తీక మాసమంటేనే మహిళలకు ఎంతో ప్రియమైన మాసం. ఇంక ఆ కార్తీకదీపం పాటను మెచ్చుకోకుండా ఉంటారా !

రెండోది శ్రీదేవి సుమంగళిగా చనిపోవటం,భర్త అంత్యక్రియలను ధర్మపత్ని సమక్షంలో చేయటం. చెప్పేముంది . మహిళలందరూ థియేటర్లలో కన్నీళ్లు పెట్టిన వాళ్ళే . ఆరోజుల్లో మహిళలు నేటి మహిళల్లాగా కర్కశులు కాదు కదా ! ఈ రెండింటి వలనే ఈ సినిమా సూపర్ హిట్ అయింది .

ముగ్గురు శోభన్ బాబులూ ఇరగతీసారు. ఒకరు శారదతో , మరొకరు శ్రీదేవితో , కొడుకు శోభన్ బాబు గీతతో చలాకీగా, హుషారుగా బాగా నటించారు , డాన్సులు చేసారు. సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . ‘నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకూ జతగా మసలే వరమే నన్ను పొందనీ’ . ‘ఆరనీకుమా ఈ దీపం’ పాట తర్వాత వీర హిట్టయిన పాట ఇది . శ్రీదేవి ఖవాలీ పాట చాలా బాగుంటుంది. మువ్వలేమో నేడేమో నాలోన మ్రోగించేను మోహనగీతం.శ్రీదేవి డాన్స్ కూడా ఆకట్టుకునే రీతిలో సాగుతుంది.

మరో పాట’ ఓ మాట..అహ తెలుసు..అది కాదు..ఇంకేమిటీ..చెబితే చాలదు’ శోభన్ బాబు శారదల మీద . పాత జోడీయే కదా ! కెమిస్ట్రీ బాగానే పండింది.  ఇంకో పాట ‘చిలకమ్మ పలికింది’ చాలా శ్రావ్యంగా ఉంటుంది.. శోభన్ బాబు గీతల మీద ‘చూడ చక్కనిదానా చూపు బిత్తరదానా నీ మిసమిసలు ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతుంది’ హుషారుగా , స్పీడు స్పీడుగా  ఉంటుంది. వెరశి అన్ని పాటలూ హిట్టే.. 

శారద , శ్రీదేవిలు ఘర్షణ పడే సీన్లో శ్రీదేవి శారదకు ధీటుగా నిలబడి నటించింది . ప్రేమాభిషేకం సినిమాలో జయసుధ గుర్తుకొస్తుంది . Of course . ప్రేమాభిషేకం దీని తర్వాత వచ్చిన సినిమా అనుకోండి. మద్దిపట్ల సూరి డైలాగులు సన్నివేశాలకు బలాన్ని చేకూర్చాయి . సినిమా అంతా రిచ్ గా ఉంటుంది. ఆనాటి మధ్య తరగతి, దిగువ తరగతి ప్రేక్షకుల కలలుగా భారీ బంగళాలు , పడవ కార్లు ఉంటాయి .

ప్రభాకరరెడ్డి , రాజబాబు , రమాప్రభ , అల్లు రామలింగయ్య , రవికాంత్ , శుభ , సూర్యకాంతం , మాడా , ఝాన్సీ , కె వి చలం , గిరిజ ఇతర పాత్రల్లో నటించారు .12 సెంటర్లలో వంద రోజులు ఆడింది . విజయవాడ కల్యాణ చక్రవర్తి థియేటర్లో వంద రోజుల ఫంక్షన్ జరిగింది. NTR ముఖ్య అతిధి.

1980 లో హిందీలోకి ‘మాంగ్ భరో సజనా’ టైటిలుతో రీమేక్ అయింది. తాతినేని రామారావు దర్శకుడు . జితేంద్ర , రేఖ , మౌసమీ ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు .1985 లో తమిళంలోకి ‘కర్పూరదీపం’ టైటిలుతో రీమేక్ అయింది . శివకుమార్,సుజాత,అంబికలు నటించారు.

1987 లో కన్నడంలోకి ‘సౌభాగ్య లక్ష్మి’ టైటిలుతో రీమేక్ అయింది. విష్ణువర్ధన్ , లక్ష్మి , రాధ నటించారు . బహుశా ఈ సినిమా చూడని మహిళ ఉండదు. మగ పురుషులు కూడా చూసే ఉంటారు . ఎవరయినా చూడనివారు ఉంటే యూట్యూబులో తప్పక చూడండి . An entertaining , musical hit movie . శోభన్ బాబు అభిమానులు అయితే ఎన్ని సార్లు అయినా చూడొచ్చు .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!