Stolen Girl …..
‘స్టోలెన్ గర్ల్’ (2025) నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. జేమ్స్ కెంట్ దర్శకత్వం వహించారు.హాలీవుడ్ ప్రముఖ నటి కేట్ బెకిన్సేల్ (Kate Beckinsale) స్కాట్ ఈస్ట్‌వుడ్ (Scott Eastwood) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
కథాంశం ఏమిటంటే ?
ఓహియోలో నివసించే మౌరీన్ డ్యాబ్బగ్ (కేట్ బెకిన్సేల్) విడాకులు తీసుకున్న ఒంటరి తల్లి. తన నాలుగేళ్ల చిన్నారి కూతురు అమినా, రోగిష్టి తండ్రితో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె మాజీ భర్త కరీం (అర్విన్ కనానియన్) కూతురు అమినాను కిడ్నాప్ చేసి మిడిల్ ఈస్ట్ (లెబనాన్) దేశానికి పారిపోతాడు.
తన బిడ్డ ను వెతుకుతూ పదేళ్లకు పైగా మౌరీన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఆ సమయంలో అంతర్జాతీయంగా కిడ్నాప్ అయిన పిల్లలను రక్షించడంలో నిపుణుడైన రోబేసన్ (స్కాట్ ఈస్ట్‌వుడ్) అనే మాజీ మెరైన్ ఆఫీసర్ ఆమెకు పరిచయమవుతాడు.
వీరిద్దరూ కలిసి లెబనాన్‌లోని ప్రమాదకరమైన అంతర్జాతీయ గూఢచర్య ముఠాలు, సీఐఏ (CIA) లతో పోరాడి ఆ చిన్నారిని ఎలా రక్షించారు అనేదే ఈ సినిమా కథ.
కూతురు దూరమైన తల్లిగా మానసిక వేదనను పండిస్తూనే,మరోవైపు యాక్షన్ థ్రిల్లర్ మోడ్‌లోకి మారే పాత్రలో కేట్ బెకిన్సేల్ బాగా నటించారు.సినిమా ప్రథమార్ధంలో ఒక తల్లి పడే తపన, చట్టపరమైన ఇబ్బందులు, పిల్లల కస్టడీ చుట్టూ తిరిగే రాజకీయాలను చాలా ఉద్వేగభరితంగా చూపించారు.మిగతా నటులు కూడా బాగానే చేశారు.
సినిమా స్టోరీ పాయింట్ బలంగా ఉన్నప్పటికీ, దర్శకుడు దీనిని ఒక సాధారణ బి-గ్రేడ్ యాక్షన్ థ్రిల్లర్‌లా మార్చేశాడని విమర్శలు వచ్చాయి. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు చాలా హడావిడిగా సాగుతాయి. కథలోని లూప్‌హోల్స్ (లాజిక్ లేని సీన్లు) పేలవమైన ఎడిటింగ్ సినిమా ఫ్లో ను దెబ్బతీశాయి.
గూఢచర్యం, అంతర్జాతీయ క్రైమ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ, ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ ఇందులో లోపించింది. ‘స్టోలెన్ గర్ల్’ ఒక అద్భుతమైన ఎమోషనల్ డ్రామా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ మేకింగ్ వల్ల యావరేజ్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. కేట్ బెకిన్సేల్ నటన కోసం చూడవచ్చు .
అంతర్జాతీయ కిడ్నాప్ కేసులను డీల్ చేసే నిపుణుడిగా స్కాట్ ఈస్ట్‌వుడ్ మౌరీన్ కోసం ఒక పక్కా ప్లాన్ (Rescue Operation) డిజైన్ చేసే సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. మౌరీన్, రోబేసన్లు రహస్యంగా లెబనాన్ దేశ సరిహద్దుల్లోకి చొరబడే సీక్వెన్స్, అక్కడ స్థానిక ముఠాల నుండి ఎదురయ్యే చెక్‌పోస్ట్ తనిఖీల సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మౌరీన్ తన కూతురిని లెబనాన్‌లో ఒక రహస్య ప్రదేశంలో కలుసుకునే సీన్ సినిమాలో అత్యంత భావోద్వేగభరితమైన సన్నివేశం.లెబనాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ,విలన్ మనుషుల నుండి తప్పించుకుంటూ, సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి కార్లలో జరిగే చివరి చేజింగ్ యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది.
మౌరీన్ కు ఎదురయ్యే అతిపెద్ద షాక్ ఏంటంటే.. పదేళ్ల కాలంలో అమినా తన తండ్రి కరీం చెప్పిన అబద్ధాల వల్ల, తన తల్లి మౌరీన్ చిన్నప్పుడే తనను వదిలేసి వెళ్ళిపోయిందని నమ్ముతుంది. తనను రక్షించడానికి వచ్చిన సొంత తల్లిని చూసి అమినా గుర్తుపట్టకపోగా, ఆమెతో రావడానికి నిరాకరిస్తుంది. తర్వాత ఆ తల్లి ఏం చేసిందో స్క్రీన్ మీద చూడాల్సిందే.
ఈ సినిమాకు టియో డెల్గాడో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. కథలోని విభిన్న వాతావరణాలను దృశ్య రూపంలో చూపించడంలో కెమెరా వర్క్ కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో వచ్చే కార్ చేజింగ్ సీన్స్,రెస్క్యూ ఆపరేషన్ సమయంలో కెమెరాను స్థిరంగా ఉంచకుండా ‘హ్యాండ్‌హెల్డ్’ పద్ధతిలో కదిలిస్తూ చిత్రీకరించారు. ఇది ప్రేక్షకుడికి తానే స్వయంగా ఆ యుద్ధ వాతావరణంలో ఉన్నామా అనే ఉత్కంఠను కలిగిస్తుంది.
తల్లిగా కేట్ బెకిన్సేల్ ముఖంలో కనిపించే బాధ, నిరాశ, ఆరాటాన్ని చూపించడానికి ఎక్కువ క్లోజప్ షాట్స్‌ను ఉపయోగించారు. ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ కంపోజర్ సామ్ ఎవింగ్ సంగీతాన్ని అందించారు. సినిమా ద్వితీయార్థంలో బార్డర్ దాటేటప్పుడు, శత్రువుల నుండి తప్పించుకునే ప్రతి సీన్ వెనుక సామ్ ఎవింగ్ అందించిన బీజీఎమ్ ప్రేక్షకుడిలో ‘ఇప్పుడు ఏం జరుగుతుందో’ అనే ఉత్కంఠ ను రేపుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

