Youthful drama ……..
‘అమీర్ లోగ్’ (Ameer Log) హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సగటు యువత జీవితాలను, వారి స్నేహాన్ని సహజంగా ఆవిష్కరిస్తూ వచ్చిన ఒక యూత్ ఫుల్ డ్రామా సినిమా. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏమిటంటే ?
హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని ఒక సాధారణ బస్తీకి చెందిన శ్రీను (హరి మున్నంగి), రఫీక్ (మనోజ్), మల్లేష్ (శశిధర్) ముగ్గురూ ప్రాణస్నేహితులు. ఎటువంటి బాధ్యతలు లేకుండా, ఏ పనిపాటా చేయకుండా క్రికెట్ ఆడటం, గొడవలు పడటం, చాయ్ తాగుతూ తిరగడమే వీరి దినచర్య.
ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి గీత (వేద జలంధర్) ఆ గొడవలకు దూరంగా ఉండాలని చెబుతూ , శ్రీనుని తన కంపెనీలో బాయ్ గా పనిలో పెడుతుంది. అక్కడి నుంచి అతనిలో మార్పు వస్తుంది. ఒక రోజు కంపెనీ ఎంప్లాయిస్ తో క్రికెట్ బెట్ కడతాడు శ్రీను. ఆటలో ఓడిపోవడంతో దావత్ ఇస్తానని మాటిచ్చి బస్తీ అంతా పెద్దగా భావించే ఛాఛా (విశ్వేందర్ రెడ్డి) చేసిన బిర్యానీ తో దావత్ ఇస్తాడు.
అప్పుడే గీత లవర్ రవి (రావణ్ నిట్టూరు) పరిచయమవుతాడు. అతని సారధ్యంలో ఈ ముగ్గురు స్నేహితులు ‘కిరాక్ బిర్యానీ’ (Kiraak Biryani) పేరిట హోటల్ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆ బిర్యానీ వ్యాపారంలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ.
సినిమాకు అతిపెద్ద బలం దాని సహజత్వం. పాతబస్తీ కల్చర్, అక్కడి యువత మాట్లాడే దక్కనీ-తెలుగు-హిందీ స్లాంగ్ డైలాగులు చాలా సహజంగా, వినోదాత్మకంగా ఉన్నాయి. శ్రీను, రఫీక్, మల్లేష్ పాత్రల్లో నటించిన హరి మున్నంగి, మనోజ్, శశిధర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. వారి ముగ్గురి మధ్య కెమిస్ట్రీ, బస్తీ కుర్రాళ్ల బాడీ లాంగ్వేజ్ చాలా రియలిస్టిక్‌గా ఉంది.
ఛాఛా పాత్రలో విశ్వేందర్ రెడ్డి నటన కూడా మెప్పిస్తుంది. వేద జలంధర్, రావణ్ నిట్టూరులు బాగా చేశారు. మిగిలిన నటీనటులు కూడా వారి పరిధి మేరకు నటించారు. అందరి దగ్గర నుంచి దర్శకుడు మంచి నటననే రాబట్టారు. ఎలాంటి బలవంతపు కామెడీ ట్రాకులు లేకుండా, స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణల ద్వారా పుట్టే సహజమైన హాస్యం బాగా పండింది.
సాంగ్స్ బాగున్నాయి. సినిమా రన్‌టైమ్ (2 గంటల 20 నిమిషాలు) కథకు కాస్త ఎక్కువే అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తుంది. నిడివి తగ్గిస్తే బాగుండేది. కథలో ఎలాంటి పెద్ద ట్విస్టులు గానీ, హై-డ్రామా ఎలిమెంట్స్ గానీ లేవు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే మాస్ ఆడియన్స్‌కు ఈ కథ చాలా సాధారణంగా అనిపించవచ్చు.
దర్శకుడు కథ,కథనం పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. చిన్న సినిమాలకు కథ,కథనమే బలం. ఈ సింపుల్ కథలో కూడా ట్విస్ట్స్ పెట్టవచ్చు. కథనం ఊహించేలా సాగుతుంది. స్మరన్ సాయి అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పాతబస్తీ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో చక్కగా ఉపయోగపడ్డాయి.
ఉన్నంతలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సలిగంటి విజయ్ కుమార్ వ్యవహరించారు.భారీ గ్లామర్ హంగులు లేకపోయినప్పటికీ, కథకు కావలసిన పాతబస్తీ వాతావరణాన్ని చక్కగా క్యాప్చర్ చేశారు.పాతబస్తీలోని ఇరుకైన గల్లీలు, పాత ఇళ్లు, చాయ్ హోటళ్లు, స్థానిక బస్తీ వాతావరణాన్ని ఎటువంటి కృత్రిమ సెట్టింగులు లేకుండా చాలా సహజంగా కెమెరాలో బంధించారు. ఇది ప్రేక్షకుడికి నిజమైన పాతబస్తీలో తిరుగుతున్న అనుభూతిని కలిగిస్తుంది.
నటీనటుల హావభావాలను, వారి మధ్య సాగే సంభాషణలను పట్టుకోవడానికి కెమెరా మూవ్మెంట్స్ చాలా సింపుల్‌గా, కథా గమనానికి ఇబ్బంది లేకుండా సాగాయి.చాలామంది కి ఈ సినిమా బాల్య స్మృతులను గుర్తు చేస్తుంది.
అమీర్ లోగ్’ భారీ హంగులు లేని,నిజాయితీతో కూడిన ప్రయత్నం. హైదరాబాదీ సంస్కృతి, బిర్యానీ నేటివిటీ, స్లో-బర్న్ ఫ్రెండ్షిప్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

