ఆగిన గుండెను మళ్ళీ పని పనిచేయించిన డాక్టర్!!

Sharing is Caring...

A stopped heart can be revived with CPR

డాక్టర్ యనమదల మురళీకృష్ణ ……………………………………….

జూలై 7, 8 తేదీలలో చెన్నైలో జరుగుతున్న క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ కాన్ఫరెన్స్ (CIDSCON 2023) లో పాల్గొన్నాను. 9వ తేదీ ఆదివారం రోజు కుటుంబంతో పాండిచ్చేరి లోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాను. ఆరోవిల్లి ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మేము తిరుగుతున్నాం. దగ్గరలో ఉన్న వ్యాన్ లో డ్రైవరు పక్క సీట్లో కూర్చున్న పెద్దాయన ముందుకు వాలిపోయారు.

ఇటీవల కాలంలో గుండి ఆగిపోవడం గురించి, దానిని మళ్లీ పని చేయించడానికి చెయ్యాల్సిన సిపిఆర్ ప్రక్రియ గురించి ప్రజల్లో అవగాహన బాగానే పెరిగింది. ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేస్తూ, సిపిఆర్ తెలిసిన వారు ఎవరైనా రండి అంటూ వేడుకుంటున్నారు. పరుగున అక్కడికి చేరుకున్నాను. ఆయన్ని చూసాక గుండె పనిచేయడం నిలిచిపోయింది ( కార్డియాక్ అరెస్ట్) అనే విషయం అర్థమైంది.

ఆగిపోయిన గుండెను తిరిగి పనిచేయించడానికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) అనే ప్రక్రియను చేయాలి. దీనికోసం, కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి ఛాతీ మధ్య భాగంలో అరచేతితో బలంగా అదిమి వదలాలి. ఇది వేగంగా సెకండ్ కు రెండుసార్లు చొప్పున చెయ్యాలి. కుర్చీలో కూర్చుని వాలిపోయిన వారిని వెనక్కి వాల్చి చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.

గట్టిగా అదిమిన ప్రతిసారీ గుండె నుండి రక్తం మెదడుతో సహా అన్ని శరీర భాగాలకు చేరాలి. కేవలం పడుకోబెట్టి మాత్రమే ఈ ప్రక్రియను చేయాలి. చుట్టూ ఎండ తప్ప, నీడ ప్రదేశం లేదు. అందువల్ల, కూలిపోయిన పెద్దాయనను నేల మీద పడుకోబెట్టి సీపీఆర్ చేసే అవకాశం లేదు. పెద్దాయన కాళ్ళను వాన్ యొక్క డోర్ నుంచి బయటకు వచ్చేటట్టు చేసి, తల స్టీరింగ్ వైపుకి పెట్టించాను. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడంతో, డ్రైవర్ వైపు నుంచి ఆయన తలను అల్లుడు పట్టుకున్నారు. మరో బంధువు కాళ్ళను పట్టుకున్నారు. ఛాతి, వీపు భాగం మాత్రమే కారు సీటు మీద వుంది.

పేషంటు సన్నగా, పొడవుగా ఉండడంతో మరీ బలంగా కాకుండా, ఒక మోస్తరు బలంతో ఛాతీని అదిమి వదులుతున్నాను. దాదాపు రెండు నిముషాల సిపిఆర్ తర్వాత పేషంటులో కదలిక మొదలైంది. మరో నిమిషంలో, పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. అప్పుడు ఛాతీని ఆదమడం ఆపాను. మరో నిమిషంలోనే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. టాయిలెట్ కి వెళ్తానని చెప్పారు.

అయితే అప్పుడే గుండెను తిరిగి ప్రాణానికి తేవడం వల్ల, పూర్తిస్థాయిలో కాకుండా బలహీనంగానే కొట్టుకుంటుంది. ఆయనను కూర్చో పెడితే రక్తపోటు పడిపోయి, మెదడుకి రక్తం అందక మళ్ళీ కూలిపోయే అవకాశం ఉంది. అందుకే ఏమీ ఫర్వాలేదు బట్టల్లో కానిచ్చేయండి, ఎవరూ మీ గురించి చెడ్డగా అనుకోరు అని చెప్పాను. కానీ ఆయన మూత్రం చేయలేదు.

సిపిఆర్ జరుగుతుండగానే ఎవరో అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. 20 నిమిషాలలో అంబులెన్స్ రావడంతో, ఆయనను పాండిచ్చేరిలోని జిప్మర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించారు. పేషెంట్ తోనే మాట్లాడి ఆయన పేరు అనిరుధ్ దాస్ అని తెలుసుకున్నాను. 

సిపిఆర్ జరుగుతున్నంత సేపూ చుట్టుపక్కల వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీయడం వంటివి చేయకుండా ప్రశాంతంగా ఉన్నారు. నేను కూడా, అక్కడ పేషంట్ ని రక్షించే విషయం తప్ప ఫోటో గురించి ఎంత మాత్రం ఆలోచించలేదు. ఏ విషయంలోనూ, ప్రత్యేకించి ఇలాంటి విషయాలలో ముందే సంబరపడి పోకూడదు అనేది నా అభిప్రాయం.

పేషంట్ తేరుకొన్న తర్వాత నేను లంచ్ చేసి, హోటల్ కి వెళ్లి కొంచెంసేపు ఆగి… సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిప్మర్ ఎమర్జెన్సీ విభాగానికి వెళ్లాను. పేషంట్ కి త్వరగా వైద్య సహాయం అందడంతో వేగిరం కోలుకున్నారు. మమ్మల్ని చూసి పేషెంట్ అనిరుధ్ దాస్ (71), ఆయన కుమార్తె అనీషా దాస్, అల్లుడు అభినవ్, కుటుంబ మిత్రుడు ఎంతో సంతోషించారు.

అనిరుధ్ రిటైర్డ్ ఉద్యోగి, కోల్ కతా భవానీపూర్ ప్రాంతంలో వుంటారు. కుటుంబంతో ప్రఖ్యాత స్థలాలను చూస్తూ వస్తున్న క్రమంలో ఈ ఆపద ఎదురైంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన సందర్భంలో ఎంత త్వరగా సీపీఆర్ చేస్తే పేషంట్ తిరిగి బతికే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. సకాలంలో డాక్టర్ మురళీకృష్ణ తగిన వైద్య సహాయం అందించడం వల్ల, ఏ ఇతర సమస్యా లేకుండా పేషంట్ పూర్తిగా కోలుకొన్నారని జిప్మర్ ఎమర్జన్సీ విభాగంలోని వైద్యుడు డాక్టర్ ఎస్. సురేంద్ర అన్నారు.

వైద్యులే కాకుండా ఎవరైనా ఈ సీపీఆర్ చెయ్యవచ్చును. యూ ట్యూబ్ లో అనేక వీడియోలు వున్నాయి. ప్రతి ఒక్కరూ సీపీఆర్ ప్రక్రియ నేర్చుకోవాలి. విలువైన ప్రాణాలను నిలిపిన వారు కాగలరు.
నా జీవితంలో ఇది రెండో విజయవంతమైన సీపీఆర్. 2011 లో మా నాన్న యనమదల రామకృష్ణ ఇంజక్షన్ వికటించి కార్డియాక్ అరెస్ట్ కి గురైన సందర్భంలో నా హాస్పిటల్ లోనే ఆయన్ని పునరుజ్జీవింప చేయగలిగాను. అయితే, అప్పుడు కొన్ని అత్యవసర మందులు అందుబాటులో ఉండినవి. అలా బతికి బయటపడ్డ తర్వాత మా నాన్న రెండేళ్లు పైగా జీవించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!