Sense control ……….
సౌభరి ముని హిందూ పురాణాలలో, ముఖ్యంగా శ్రీమద్భాగవతం (9వ స్కంధం) లో ప్రస్తావించబడిన ఒక గొప్ప తపస్వి. ఇంద్రియ నిగ్రహం ఎంతటి వారికైనా అవసరమని చెప్పే ఆయన కథ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది.
ఆయన యమునా నది జలాల లోపల ఉండి కఠోరమైన తపస్సు చేసేవారు. తన శరీరాన్ని, మనస్సును పూర్తిగా నియంత్రించగలిగిన శక్తి ఆయనకు ఉండేది.ఒకరోజు నీటిలో తపస్సు చేసుకుంటున్న సమయంలో, రెండు చేపలు జంటగా ఆడుకోవడం చూసి ఆయన మనస్సు చలించింది.
ఆ దృశ్యం ఆయనలో ప్రాపంచిక సుఖాల పట్ల కోరికను కలిగించింది.తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు.తన కోరిక తీర్చుకోవడానికి ఆయన సూర్యవంశపు రాజైన మాంధాత దగ్గరకు వెళ్లి ఆయన కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకుంటానని అడిగాడు.
ఆయన కోరిక విని మాంధాత రాజు తొలుత కొంత ఆందోళన పడ్డాడు. సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు. ఇతని కోరికని నేరుగా నిరాకరిస్తే, శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. ఎటూ తోచని పరిస్థితిలో రాజు ఒక నిమిషం ఆలోచించాడు.
తర్వాత “ఓ పుణ్యపురుషా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను తీసుకొస్తాను,వారిలో ఎవరు తమరిని ఇష్టపడతారో ఆమె మీ భార్య అవుతుంది” అన్నాడు. రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు.
సౌభరికి రాజు ఉద్దేశ్యం పూర్తిగా అర్ధమైంది. తను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగ శక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం కు వెళ్ళినప్పుడు, ఆ యాభై మంది రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్దుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది.
ఇప్పుడు,తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్త ని పంచుకోవటంలో తమలో తాము తగవు పడతారేమో ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగ శక్తి ని ఉపయోగించాడు. రాజు భయాన్నితొలగించటానికి అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు.
ఈ విధంగా కొన్నివేల సంవత్సరములు గడచి పోయాయి.సౌభరికి ప్రతి భార్య తో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారైందట. చాలా కాలం సుఖ భోగాలు అనుభవించిన తర్వాత, ఆయనకు ఇంద్రియ సుఖాల పట్ల విరక్తి కలిగింది. భౌతిక సుఖాలు మనిషిని ఎప్పటికీ తృప్తి పరచలేవని ఆయన గ్రహించారు. “ఒక చేప జంటను చూసి నా వేల ఏళ్ల తపస్సును పాడు చేసుకున్నాను” అని పశ్చాత్తాపపడి, తిరిగి వనానికి వెళ్లి కఠిన తపస్సు చేసి ముక్తిని పొందారు.
ఆయన తన యోగశక్తితో శారీరక సుఖాలను పొందగలిగారు కానీ, ఆ సమయంలో ఆయనకు భగవంతుడితో ఉన్న ఆధ్యాత్మిక బంధం తెగిపోయింది.సాధించిన శక్తులు కోల్పోయారు.శక్తులు అనేవి మనస్సు యొక్క ఏకాగ్రత (Focus) మీద ఆధారపడి ఉంటాయి. ఇంద్రియ సుఖాల వైపు మనసు మళ్లితే, ఆ ఏకాగ్రత దెబ్బతింటుంది. ఫలితంగా శక్తులను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోయి సామాన్య మానవుడిలా మిగిలిపోయారు.
నీతి: ఎంతటి జ్ఞానియైనా ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనం తప్పదని సౌభరి ముని కథ హెచ్చరిస్తుంది.

