రష్యా సరిహద్దుల్లో నాటో విస్తరణను అడ్డుకునేందుకు గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న పుతిన్ యుద్ధం ఎపుడు ఆపుతారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తన సైన్యం ఊహించినట్టుగా దూసుకెళ్లలేక పోవడంతో అసహనంతో ఉన్న పుతిన్ తన అమ్ములపొదిలోని విధ్వంసక అస్త్రాలను ఉక్రెయిన్ నగరాలపై విసురుతున్నాడు.
అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితి తెచ్చుకోవద్దని పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు జారీ చేసాడు. గతంలో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు,సిరియాలో ప్రభుత్వ వ్యతిరేకశక్తులపై దాడుల సందర్భంలో విచక్షణారహితంగా బాంబులు కురిపించి నియంతలను మరిపించాడు.
అప్పట్లో పుతిన్ వ్యవహార శైలి చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్య పోయింది. అప్పటి నుంచే పుతిన్‌ను సద్దామ్ హుస్సేన్, గడాఫీ, హిట్లర్ వంటి నియంతలతో పోలుస్తుంటారు.పుతిన్ ప్రవర్తన, ప్రకటనలు, వ్యవహార శైలిని బట్టి ఆయనను 21వ శతాబ్దపు హిట్లర్ అని చెప్పుకోవచ్చని నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ ఇటీవల CNNలో చెప్పారు.
ప్రస్తుతం రష్యా దాడులను చూస్తుంటే నాజీల మెరుపు దాడులు గుర్తుకొస్తాయని విశ్లేషకులు అంటున్నారు. పొరుగు దేశంపై దాడి చేయడం , పౌరులను టార్గెట్ చేయడం .. నగరాలను నాశనం చేయడం వంటి చర్యలు నాజీ సైన్యాల క్రూరత్వాన్ని మరిపించేలా ఉన్నాయని చెబుతున్నారు.
ప్రస్తుత సైనిక చర్య నేపథ్యంలో హిట్లర్‌తో పోలుస్తూ ఉక్రెయిన్ వాసులు మీమ్స్‌ను పోస్టు చేశారు. పుతిన్‌ను ఇలా నియంతలతో పోల్చేందుకు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. పుతిన్ లుక్స్ లో ఎక్కడా భావోద్వేగాలు కనిపించవని .. ఆ చూపులు క్రూరత్వాన్ని సూచిస్తాయనే వారు కూడా ఉన్నారు.
సోవియట్ యూనియన్ను తిరిగి నిర్మించాలన్నదే పుతిన్ కోరిక అని .. పలుమార్లు ఇది అతని మాటల్లో బయట పడిందని నిపుణులు చెబుతున్నారు. సోవియట్ పతనాన్ని పుతిన్ 20వ శతాబ్దపు అతిపెద్ద భౌగోళిక రాజకీయ విపత్తుగా చాలాకాలం క్రితం అభివర్ణించాడు. ఆనాటి గందరగోళ పరిస్థితుల మధ్య పుతిన్ తన స్థాయిని వేగంగా పెంచుకున్నాడు.
రష్యా తయారు చేసిన కరోనా టీకాకు స్పుత్నిక్ అని పేరుపెట్టడం ఆయన ఆశయానికి నిదర్శనంగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆ పేరుతో 1950ల్లో సోవియట్ యూనియన్ శాటిలైట్ ని కూడా రూపొందించింది . అలాగే 2015 లో ఒక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ను రష్యా కిరీటంలో రత్నంగా పుతిన్ అభివర్ణించాడు. తన పదవీకాలంలోనే ఉక్రెయిన్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడని చెబుతున్నారు.ఆ కోరికతోనే యుద్ధం మొదలు పెట్టారని అంటున్నారు. ఇక హిట్లర్ బతికి ఉంటే పుతిన్ ని ప్రశంసించి తనకో వారసుడు ఉన్నాడని గర్వ పడేవాడేమో.