మితి మీరిన అప్పులే కొంప ముంచాయా ?

Sharing is Caring...

అక్కడ లీటర్‌ పెట్రోల్ ధర 283 రూపాయలు.. లీటర్ డీజిల్‌ ధర 220.రూ. కిలో చికెన్ వెయ్యి రూపాయలు .. కప్పు టీ 100 రూ .. మాత్రమే.. వామ్మో ఏమిటీ రేట్లు ? ఎక్కడ అనుకుంటున్నారా ? ఇండియాలో కాదు లెండి.. మన పక్కనే ఉన్న శ్రీలంకలో..

శ్రీలంక దారుణమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోయింది.. ఫలితంగా ముందెన్నడూ ఎరుగని  విద్యుత్ కోత‌లు .. నిత్యావ‌సర వ‌స్తువుల కొర‌త‌.. చుక్కలను తాకిన  పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. నిండుకున్న విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు.. ఈ పరిణామాలతో శ్రీలంకలో  గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. 1948 నుంచి దేశంలో ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్నిఎపుడు ఎదుర్కోలేద‌ని శ్రీలంక  ప్రభుత్వఅధికారులు వాపోతున్నారు.

దిగుమతులకు కూడా డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ప్రభుత్వం ఆహార వస్తువులు సహ అనేక నిత్యావసర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. ఊహించని ఈ ఆర్థిక సంక్షోభంతో 2.20 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక ఉక్కిరిబిక్కిరవుతోంది.

2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక 4 బిలియన్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అది 90 శాతం పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి .గతంలో జరిగిన ఉగ్ర దాడులు, కరోనా సంక్షోభం, ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసందర్భ నిర్ణయాలు ఆ దేశానికి ఇప్పుడు తీవ్రమైన ముప్పుగా మారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. ప్రెసిడెంట్ విధానాల వల్లనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని  ప్రజలు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. అధ్యక్షుడు రాజపక్స పదవిలో నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థను ఆయన దిగజార్చారనే  విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఆర్థిక సంక్షోభం కారణంగా రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకుంది. ఏ వస్తువు కొందామన్నా ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 275  రూ.. కి  పడిపోయింది. దీంతో లంక ప్రజలు తీవ్ర ఇబ‍్బందులు ఎదుర్కొంటున్నారు.

శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే ప్రస్తుతం సంక్షోభం ఏర్పడిందని .. తొందరపాటు నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. సేంద్రియ సాగు ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పించకుండా గత ఏడాది నూరు శాతం సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ఏక పక్షంగా నిర్ణయించింది.

కీలకమైన రసాయన ఎరువుల దిగుమతులను నిషేధించింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు హెచ్చరించినా పట్టించుకోలేదు. ప్రపంచంలో నూరు శాతం సేంద్రియ సాగు చేపట్టిన ఏకైక దేశంగా పేరు తెచ్చుకోవాలన్న అతృతతో తీసుకున్న ఈ నిర్ణయం మొదటికే మోసం తెచ్చింది. కూరగాయ పంటలకు కూడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నిరుడు సెప్టెంబరు నాటికి దిగుబడులు క్షీణించాయి.

మళ్లీ పాత పద్ధతులకు మళ్లినా.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో మెల్లగా ఆహార కొరత ఏర్పడింది. బియ్యం, కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. చివరకు నూరు శాతం సేంద్రియ సాగు లక్ష్యాన్ని ఉపసంహరించుకున్నది.ముందే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ  ఆహార కొరత ఏర్పడేది కాదు.

దేశంలోని మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌కు చైనా నుంచి ఇష్టమొచ్చిన రీతిలో తెచ్చుకున్న అప్పులు  త‌డిసి మోపెడ‌య్యాయి. ఫ‌లితంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పతనమైంది. విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు అడుగంటిపోయాయి.ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో శ్రీ‌లంక‌ను ఆదుకునేందుకు చైనా నిరాక‌రించింది. క‌రోనా మ‌హ‌మ్మారితో ప‌ర్యాట‌క రంగం దెబ్బ తిన్నందున శ్రీ‌లంక‌కు ఇచ్చిన రుణాల‌ను రీషెడ్యూల్ చేయ‌డానికి చైనా స‌సేమిరా అన్నదన్న వార్త‌లొచ్చాయి.

ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న అన్ని పరిస్థితులకు కారణం అప్పులే అని చెప్పుకోవచ్చు. ఆదాయం  లేకపోవడం, వేరే దేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడం.. వడ్డీలు కట్టలేక పోవడం వంటి కారణాలే ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి సాయం తీసుకోకూడదని మొండి పట్టుదలకు పొయింది. అలాగే శ్రీలంక క్రెడిట్ రేటింగ్ ను ఐఎంఎఫ్ తగ్గించడమూ జరిగింది.ఫలితంగా క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఇంటర్నేషనల్ సావరిన్ బాండ్లను తీస్కోవడానికి వీల్లేకుండాపోయింది.

అప్పుల విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం కూడా శ్రీలంకను ఇబ్బందుల్లోకి నెట్టింది.. ఒక్క చైనాకే 500 కోట్ల డాలర్ల మేర శ్రీలంక అప్పులను చెల్లించాల్సి ఉంది.  ఈ అప్పులను తిరిగి కట్టలేక కీలకమైన హంబన్ తోటా పోర్టును 2018లో 99  ఏళ్లకు చైనాకు లీజుకిచ్చేసింది.

ఇక తాజా పరిస్థితులను సరి దిద్దటానికి శ్రీలంక మళ్లీ అప్పులనే నమ్ముకుంది. విదేశీ మారక నిల్వ లు వేగంగా కరిగిపోవడం ప్రస్తుత దుస్థితికి మరో కారణం. ఇప్పటికైనా తన విధానాలను సమీక్షించుకుని ఆర్ధిక వేత్తల, నిపుణుల సలహాలు తీసుకుని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక  నిర్ణయాలు తీసుకుంటే కొన్నాళ్ల కైనా ఈ ఉపద్రవం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా విపక్షాలతో కూడా చర్చించి ముందుకు సాగాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!