Subramanyam Dogiparthi …………………………
చందమామను చూపిస్తూ చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. అక్కడ ఓ ముసలమ్మ రాట్నంతో నూలు వడుకుతున్నదని.ఈ సినిమా కధ కూడా ఆ ముసలమ్మ పేదరాశి పెద్దమ్మదే. ఈ సినిమాలో మహా శివుడు పేదరాశి పెద్దమ్మ ఆజన్మ బ్రహ్మచర్యానికి , త్యాగానికి ముగ్ధుడై చంద్రలోకంలో నివసించే వరాన్ని ప్రసాదిస్తారు.
పేదరాశి పెద్దమ్మ కధలు , కాశీ మజిలీ కధలు , అరేబియన్ నైట్స్ కధలు , తెనాలి రామకృష్ణుడు, బీర్బల్ కధలు , పరోపకారి పాపన్న కధలు పిల్లలకు చెప్పేవాళ్ళు. కాలక్షేపంతో పాటు సంస్కారం,నీతి, బంధాలు, అనుబంధాలు, పది మంది శ్రేయస్సు కోరడం వంటివి బుర్రల్లోకి ఎక్కేవి.
1968లో విడుదలైన ఈ సినిమాలో నిర్మలమ్మ పేదరాశి పెద్దమ్మగా నటించింది. చందమామలో ఉండే ముసలమ్మ కథగా చిత్రం కథ సాగుతుంది. కాంతారావుతో పాటు రామకృష్ణ హీరోలు గా నటించారు. రామకృష్ణ చిత్ర నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నారు.
సుమారు 800 సినిమాల్లో నటించిన మలయాళీ నటి శ్రీవిద్యకు తెలుగులో మొదటి సినిమా ఇదే . పింజల సుబ్బారావు P.S.R . పిక్చర్స్ బేనర్ పై నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు గిడుతూరి సూర్యం.మంత్రాలు, మాయలు,తంత్రాలు, కుతంత్రాలు, నాగలోకం, పాతాళం వంటి వినోదాత్మక మసాలా దినుసులు చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చూసే చిన్న వయసులో భలే భలే వింత కోరికలు అమాయకంగా కలిగేవి నాకు . అలాంటి మంత్రాలు నాకూ ఉంటే ఎంత బాగుండు అని అనుకునేవాడిని.
సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ఇదియే అందాల మానవ సీమ ఇలయే ప్రేమికుల మురిపాల , ఓహోహో ఓ జవరాలా నా సుమబాల , కులుకు నడకల చినదానా తళుకుబెళుకుల నెరజాణ , వీరులమంటే వీరులం రణశూరులమంటే పాటలు బాగుంటాయి . శివ మనో రంజనీ వరపాణీ స్వరరాణీ కనవే జననీ పాటను బాల మురళీకృష్ణ పాడారు.గొప్పగా ఉంటుంది.ఓ జలకాలలోన పులకించి పోనా అనే జలకాలాటల పాట , గులాబీ బుగ్గలున్న వన్నెలాడి నేనే చలాకీ కన్నులున్న పాటలు హుషారుగా ఉంటాయి.
బాల సుబ్రహ్మణ్యం క్రమక్రమంగా నిలదొక్కుకుంటున్న రోజులు . పి బి శ్రీనివాసుని రీప్లేస్ చేయటం ప్రారంభించారు. కె యస్ రెడ్డి నృత్య దర్శకత్వంలో నృత్యాలు బాగుంటాయి . ముఖ్యంగా శ్రీవిద్య , మరొక నటితో నృత్యించే నృత్యం బాగుంటుంది.
కృష్ణకుమారి, విజయలలిత, నిర్మలమ్మ , రాజసులోచన,రాజనాల , మిక్కిలినేని , ప్రభాకరరెడ్డి , బాలకృష్ణ , రామచంద్రరావు , సచ్చు ప్రభృతులు నటించారు. మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలస్ లో చూసా . ఈమధ్య కూడా టి వి లో వచ్చింది. కాలక్షేపం సినిమా . మంచినే కానీ చెడును చెప్పని సినిమా . యూట్యూబులో ఉంది . టైం ఉన్నప్పుడు చూడవచ్చు .