‘జాతీయ సమైక్యత’ ఆవశ్యకతను చాటే సినిమా !!

Sharing is Caring...

A film that promotes brotherhood…………………..

ఈ సినిమా గురించి Mallam Ramesh గారు దాదాపు ఏడాదిన్నర నుండి రెగ్యులర్ గా ఫేస్బుక్ లో పోస్ట్ లుపెడుతూనే ఉన్నారు.సాధారణంగా చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు అంటే ఉండే అపనమ్మకంతో ఆ ఏముంటుందిలే అని లైట్ తీసుకున్నాను.

కానీ పోదాం లే,చాలా రోజులు నుండి సార్ ఫేస్బుక్ లో పెడ్తున్నాడు కదా. తెలిసిన సార్. శుక్రవారం నాడే చూస్తే ఆ సినిమా నటులను కూడా కలవచ్చు కదా అని ఫస్ట్ రోజు ఫస్ట్ షో కి వెళ్ళాను. కాకపోతే సినిమా ఎలాగో బాగుండదులే.. అనే నెగటివ్ ఇంప్రెషన్ తోనే వెళ్ళాను. అనుకున్నట్టే అక్కడ కిషోర్ దాస్ గారిని, యశ్ పాల్ గారిని కలిసి ఫోటో లు దిగడం జరిగింది. మల్లం రమేష్ గారిని కూడా కలిసి ఫోటో దిగాను.

ఇక సినిమా విషయానికి వస్తే .. నేను ఎంత నెగటివ్ తో పోయానో అంత పాజిటివ్ ఇంప్రెషన్ కలిగింది. సినిమా.టైటిల్స్ పడ్డప్పుడు వచ్చే వాయిస్ ఓవర్ తో  ఓ పెద్ద సినిమా చూడబోతున్నాం అన్న ఫీలింగ్ తెచ్చింది.ఇక “ఏడ ఉన్నాడో వాడు ఎప్పుడస్తాడో యమ్మా ” పాట వింటుంటే అసలు ఇదేందీ మూవీ ఇంత మంచిగా ఉంది అనిపించింది.

ఉన్న మూడు పాటలు .. నేపథ్య సంగీతం రెండూ కూడా శ్రీ చరణ్ అర్జున్ అదర గొట్టేసారు . లాస్ట్ లో జండా పాట విన్నప్పుడు రోమాలు నిక్కబోడుచుకునే ఫీల్ ఉంది. ఆ సాహిత్యం కూడా సుద్దాల అశోక్ తేజ  గొప్పగా రాసారు.

ఇక సినిమాలో హైలైట్ ల విషయానికి వస్తే సాధారణంగా ఈ సినిమా ట్రైలర్చూ సిన వాళ్లకు ఇది కూడా కాశ్మిర్ పైల్స్, రజాకార్ల సినిమా లాగా ముస్లిం లను తప్పుగా చూపెట్టే సినిమా అనిపిస్తుంది.

కానీ ఈ సినిమాలో హీరోలే ముస్లిం లు. ఈ దేశం మీద హిందువులకే కాదు, ముస్లిం లకు కూడా అంతే ప్రేమ ఉంది అని చూపించిన సినిమా. క్లైమాక్స్ లో డైలాగ్ లకు చప్పట్లు పడతాయి. నాకు తెలిసి ముస్లిం పాత్రలను ఇంత పాజిటివ్ గా చూపించిన తెలుగు సినిమా ఇదే అనుకుంటా.

“దేశం జోలికి … దేశ ప్రజల జోలికి ఎవరు వచ్చినా మట్టిలో కలిపేస్తాం ” ఇది సుమన్ డైలాగ్. అదే సినిమా కథ అనుకోవచ్చు. కొందరి స్వార్థం కోసం హిందూ,ముస్లిం ల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అని గుర్తు చేసే సినిమా ఇది.

సినిమాలో కమ్యూనిస్ట్ ల గురించి, ఫేస్బుక్ లో ఫేక్ వీరుల గురించి చూపించిన  తీరు బట్టీ అసలు కమ్యూనిస్ట్ లు చేస్తున్న తప్పు ఏంటో వాళ్ళు అర్ధం చేసుకునేలా తీసాడు దర్శకుడు. అలాగే అన్ని మతాలలోనూ మంచి చెడు ఉంది అని చెప్పేందుకు క్రిస్టియన్,బౌద్ధ మతాల పూజారుల పాత్రలను ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు.

సినిమా నాకు అంతగా నచ్చడానికి కారణం క్లైమాక్స్. ముస్లిం పాత్రలను క్లైమాక్స్ లో హీరో లుగా చూపించడం. అది అస్సలు ఊహకు అందని విషయం. ఎందుకంటె ట్రైలర్ లో  యాంటీ ముస్లిం సినిమా అనుకున్న మూవీ.. ఒక్కసారిగా పాజిటివ్ మూవీగా మారిపోవడం థ్రిల్ ఇచ్చింది.  మొత్తంగా కృష్ణవంశీ గారి ఖడ్గం సినిమా చూస్తే ఒక భారతీయుడుగా ఎంత ఆనంద పడతామో, ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా అంతే ఆనందంలో ఉంటాం.

ఇక ఇంకో హైలై ట్ … చాలా మంది నటులు మనకు తెలిసిన సీరియల్, సినిమా, టీవీ నటులు కావడం . మల్లం రమేష్ గారు తక్కువ బడ్జెట్ లో తీసినా కూడా వీళ్లందరి సహకారం వల్ల సినిమా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. ముఖ్యం గా సుమన్ గారి ఎంట్రీ, ఇంటర్వెల్ bang చాలా బాగుంది.

ఫైనల్ గా  చెప్పాలనుకుంది ఏంటంటే హిందూ ముస్లిం భాయి భాయి అన్న సూత్రికరణ చేస్తూ వచ్చిన మరొక మంచి చిత్రం “వందేభారత్ “. T కృష్ణ ,మాదాల రంగారావు, R నారాయణ మూర్తి ఏ విధంగానైతే జనాల్లో చైతన్యం కోసం, ఎన్నో కష్టాలు పడి మంచి మంచి సినిమాలను అందించారో.. అదే మార్గం లో మల్లం రమేష్ గారు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎవరినో కించపరిచాలనే దుర్బుద్ధి లేకుండా కేవలం జనాల్లో సోదరభావము, జాతీయ సమైక్యత పెంపొందించడం కోసం అనేక కష్టాలకోర్చి తీసిన మంచి సినిమా “వందేభారత్”.

————  Vamshi Krishna Parimala

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!