మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ !!

Sharing is Caring...

Commercial action movie……

‘భీమా’ 2024 నాటి సినిమా ఇది ..కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు కాస్త సోషియో-ఫాంటసీ (అతీంద్రియ/దైవిక) అంశాలను జోడించి ఈ సినిమాను రూపొందించారు. గోపీచంద్ హీరోగా నటించారు. కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వం వహించారు.  

కథ ఏమిటంటే ?

కర్ణాటక సరిహద్దుల్లోని పరశురామ క్షేత్రంలో ఒక పురాతనమైన శివాలయం ఉంటుంది. అక్కడ స్థానిక విలన్ భవానీ (ముఖేష్ తివారి) అరాచకాలు చేస్తూ, పిల్లల అక్రమ రవాణా సాగిస్తుంటాడు. ఆ ఊరికి SI గా వస్తాడు భీమా (గోపీచంద్). రౌడీ పోలీస్ అయిన భీమా, విలన్ సామ్రాజ్యాన్ని ఎలా అణచివేశాడు? అసలు ఆ మూసి ఉన్న గుడికి, అక్కడ జరిగే కొన్ని వింత సంఘటనలకు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలోకి ‘రామా’ (గోపీచంద్ మరో పాత్ర) ఎలా వచ్చాడు? అనేదే సినిమా కథ.

పోలీస్ ఆఫీసర్ ‘భీమా’గా గోపీచంద్ తనదైన మాస్ మేనరిజం, డైలాగ్ డెలివరీతో బాగానే చేసాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఫైట్‌లో ఆయన ఎనర్జీ  అభిమానులకు బాగా నచ్చుతుంది. యాక్షన్ పరంగా సినిమా బాగున్నా, కథ, కథనం  పాత కాలపు ఫార్ములాతో సాగుతాయి. ఫస్టాఫ్‌లో వచ్చే గోపీచంద్ – మాళవిక శర్మల లవ్ ట్రాక్ విసుగు తెప్పిస్తుంది.

సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ లాంటి నటులు ఉన్నప్పటికీ కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.నరేష్ కామెడీ మరీ ముతక కామెడీగా సాగింది. రామ ను ప్రేమించిన అమ్మాయి పాత్ర మరీ దూకుడుగా ఉంటుంది. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, లు వారి పరిథిలో  వారు బాగానే చేశారు. 

డ్యూయెల్ రోల్ లో గోపి చంద్ బాగా చేసినా అన్నదమ్ముల (రామ – భీమ) మధ్య ఉండే బాండింగ్‌ను దర్శకుడు బలంగా చూపించలేకపోయాడు. దీనివల్ల సెకండాఫ్‌లో ఎమోషన్ సరిగ్గా పండలేదు. నాజర్ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. మనీష్ తివారీ ని అంతగా ఉపయోగించుకోలేకపోయారు.

ముగింపులో ఆత్మలు, సంజీవని అంటూ కథను ఎటు పడితే అటు తిప్పడం వల్ల సాధారణ ప్రేక్షకుడు కాస్త గందరగోళానికి గురవుతాడు.అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్యాంకర్ల లో దాచి తరలిస్తున్న పిల్లలను రక్షించి వారిని అడవి నుంచి సముద్రతీరానికి చేర్చే సీన్స్ బాగా తెర కెక్కాయి. ఫైట్స్ కూడా బాగుంటాయి.

కథపై సరైన కసరత్తు జరగలేదు. చాలా చోట్ల లాజిక్ కన్పించదు. సినిమా చివరి ముప్పై నిమిషాలు బాగుంటుంది. కొత్తదనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో సినిమా హిట్ కాలేదు.రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్, యాక్షన్ బ్లాక్స్ చాలా హెవీగా, మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి.

రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ కొన్ని యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్ల కు బలాన్ని చేకూర్చింది.  స్వామి జె. గౌడ సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. సినిమాకు ప్రధాన బలం కెమెరా పనితనమే. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే, ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.

‘భీమా’ కేవలం మాస్ యాక్షన్ ప్రియులను, గోపీచంద్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. కొత్తదనం ఆశించకుండా కేవలం భారీ ఫైట్లు, గోపీచంద్ ఎలివేషన్స్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారు చూడ వచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!