ఈ చైల్డ్ హీరో కి మంచి ఆఫర్లు !!

Sharing is Caring...

Child Hero ……………..

‘బత్తా’ (Baththa) సినిమాలో శబరి పాత్రలో నటించిన తొమ్మిదేళ్ల బాలనటుడు సాయి పృథ్వీరాజ్ నటన కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. నటుడు విజయ్ సేతుపతి మనస్ఫూర్తిగా  ఆ పిల్లవాడిని ప్రశంసించారు. ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా “ఈ సినిమాకు నేను కాదు, ఆ అబ్బాయే అసలైన హీరో” అని ప్రకటించారు.

‘బత్తా’ సినిమా కథ మొత్తం అతని పాత్ర చుట్టూనే నడుస్తుందని చాలా గొప్పగా చెప్పారు. ఒక స్టార్ హీరో అయి ఉండి, బాల నటుడికి క్రెడిట్ ఇస్తూ ఆయన మాట్లాడటం మీడియాలో హైలైట్ అయింది.

షూటింగ్ సమయంలో విజయ్ సేతుపతి కావాలనే సాయి పృథ్వీరాజ్‌తో ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం దూరం మెయింటైన్ చేశారట. ఎందుకంటే, సినిమాలో ఆ పిల్లాడు రౌడీ అయిన బత్తాను చూసి నిజంగా భయపడాలి. ఆ భయం విజువల్స్‌లో సహజంగా కనిపించడం కోసమే విజయ్ సేతుపతి సెట్స్‌లో ఆ పిల్లాడికి దూరంగా ఉన్నట్లు, ఆ తర్వాత అతనికి నటనలో ఎంతో గైడెన్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి.

సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత విజయ్ సేతుపతి ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకుని అప్యాయంగా మాట్లాడటమే కాకుండా.. “సినిమాలతో పాటు చదువు చాలా ముఖ్యం, బాగా చదువుకోవాలి” అని సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని సాయి పృథ్వీరాజ్ తన ఇంటర్వ్యూలలో స్వయంగా వెల్లడించాడు. 

సినిమా విడుదలయ్యాక విజయ్ సేతుపతి నటన కంటే కూడా పిల్లాడి నటన అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా ఆ పిల్లాడు భయపడుతూ నత్తిగా మాట్లాడే సీన్లలో జీవించాడని, ఈ నటనకు ఖచ్చితంగా ‘జాతీయ అవార్డు’ (National Award) వస్తుందని విమర్శకులు కూడా ప్రశంసించారు.

బత్తా’  సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న మాస్టర్ సాయి పృథ్వీరాజ్ సినిమాలో ‘అత్యంత సహజమైన నటనతో ప్రేక్షకులు, విమర్శకుల మనసులు గెలుచుకున్నాడు. తమిళనాడులోని రాణిపేటలో ఉన్న ‘జికె వరల్డ్ స్కూల్’ లో సాయి పృథ్వీరాజ్  మూడో తరగతి చదువుతున్నాడు.

ఇతని అక్క ‘కయల్’ (Kayal) కూడా నటి.. ఆమె విజయ్ ఆంటోనీ నటించిన ‘మార్గాన్’ చిత్రంలో నటించింది. నటనతో పాటు ఫుట్‌బాల్ ఆడటం, డ్యాన్స్ క్లాసులకు వెళ్లడం ఇతనికి ఇష్టం. 

సాయి పృథ్వీరాజ్ చలనచిత్ర ప్రవేశం చాలా ఆసక్తికరంగా జరిగింది.ఇతను యాక్టింగ్ క్లాసులకేమీ వెళ్ళలేదు  తన అక్క కయల్ ‘బత్తా’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు, సాయి ఆమెతో పాటు వెళ్లాడు.ఎత్తు సరిపోకపోవడంతో అక్క ఎంపిక కాలేదు, కానీ అక్కడి ఆడిషన్ టీమ్ చిన్నవాడైన సాయిని గమనించి, టెస్ట్ చేసి ‘శబరి’ పాత్రకు ఎంపిక చేశారు. తన అక్క దగ్గరే ఇంట్లో నటనకు సంబంధించిన బేసిక్స్ నేర్చుకున్నాడు. 

ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమా చూసి, సాయి పృథ్వీరాజ్ అద్భుతంగా నటించాడని, ఈ నటనకు గానూ అతను ‘జాతీయ అవార్డు’ అందుకోవడానికి అర్హుడని ప్రత్యేకంగా ప్రశంసించారు. తమిళ అగ్ర హీరో విజయ్ (Thalapathy Vijay) సాయి పృథ్వీరాజ్‌కు అత్యంత ఇష్టమైన నటుడు.. రోల్ మోడల్.

సాయి పృథ్వీరాజ్‌కు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా, ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న D56 చిత్రంలో సాయి ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. చదువును, సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ చిన్న వయసులోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో సాయి దూసుకుపోతున్నాడు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!