భండారు శ్రీనివాసరావు …………………………….
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు అంటుండే వారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా, రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు ఉండదని.మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం.
వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. ఇప్పటికీ పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్నదాన పథకాలు అమలు అవుతున్న మాట నిజమే. అయితే వాటిపై ఓ అపప్రధ వుంది.
పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయని. ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా ఊరిలోని దేవాలయాలే ఈ పని చూసుకునేవి.
నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది. గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే.
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే. ఊరివారు తలచుకుంటే, ప్రభుత్వ సాయం తోడు అయితే అన్నానికి మొహం వాచే వారంటూ ఏ వూరిలో మిగలరు.