మాయమైన మణిరత్నం మార్క్ !!

Sharing is Caring...

Gangster drama…..

థగ్ లైఫ్ (Thug Life) ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ. ప్రముఖ నటుడు కమల్ హాసన్ – ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. 2025 లో విడుదలైంది. Netflix లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. 

కథ ఏమిటంటే?

ఢిల్లీ అండర్ వరల్డ్ మాఫియా డాన్ రంగరాయ శక్తిరాజ్ (కమల్ హాసన్), అతని సోదరుడు మాణిక్యం కలిసి ఒక గ్యాంగ్ నడిపిస్తుంటారు. చిన్నతనంలో ఒక గ్యాంగ్ వార్ నుండి కాపాడిన అమరన్‌ను (శింబు) కమల్ తన సొంత కొడుకులా పెంచుతాడు. కాలక్రమేణా శత్రువులు పెరగడం, కమల్ పై హత్యాయత్నం జరగడం, ఆ నమ్మకద్రోహం వెనుక ఎవరున్నారనే కోణంలో ఈ ప్రతీకార కథ సాగుతుంది.

వృద్ధుడైన మాఫియా డాన్‌గా కమల్ హాసన్ తన అసాధారణ నటనతో వన్‌మెన్ షో చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో చూపించిన తీవ్రత , గంభీరమైన డైలాగ్ డెలివరీ ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 
శింబు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడి పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటూ, తన మార్క్ స్వాగ్ , హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతమైన ఎనర్జీని చూపించారు.

ప్రథమార్ధంలో వచ్చే అతని గ్యాంగ్‌స్టర్ లుక్,  యాక్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. కమల్ హాసన్ భార్యగా నటించిన అభిరామి తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ, చాలా పరిణతి చెందిన నటనను కనబరిచారు. కమల్, అభిరామిల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ఆకట్టుకుంటాయి. 

మలయాళ వర్సటైల్ యాక్టర్ జోజు జార్జ్ తన రగ్గడ్, విలక్షణమైన గ్యాంగ్‌స్టర్ నటనతో ఉన్నంతలో మంచి ఇంప్రెషన్ వేశారు. నాజర్ కూడా పాత్ర పరిథిలో బాగానే నటించాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ల (త్రిష, ఐశ్వర్య లక్ష్మి(చంద్ర) పాత్రలు పరిమితంగా ఉండిపోయాయి.మిగతా నటీ నటులు అంతా బాగానే చేసారు. 

మణిరత్నం సినిమాల్లో మహిళా పాత్రలకు మంచి ప్రాధాన్యత, ప్రత్యేకమైన డెప్త్ ఉంటుంది. కానీ ‘థగ్ లైఫ్’లో త్రిష పోషించిన ‘ఇంద్రాణి’ పాత్ర చాలా నామమాత్రంగా సాగుతుంది. కథనంలో ఈ పాత్రకు తగినంత ప్రాముఖ్యత దక్కలేదు.  కమల్ హాసన్, శింబుల మధ్య నడిచే డామినేటింగ్ కథలో త్రిషకు కేవలం పరిమితమైన సీన్లు మాత్రమే దక్కాయి. ప్రధాన కథా గతిని మార్చేయడంలో ఈ పాత్ర ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ప్రేక్షకులు ఆమె నుంచి ఆశించిన స్థాయి బలమైన భావోద్వేగాలు లేదా కీలకమైన మలుపులు ఈ పాత్రలో పండలేదు.త్రిష తన వంతుగా నటనలో న్యాయం చేసినా సరైన స్క్రిప్ట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆమె పాత్ర హైలైట్ కాలేకపోయింది.  

సినిమా మొదలయ్యే మొదటి పది నిమిషాలు దర్శకుడు మణిరత్నం తన మార్క్ మేకింగ్‌తో కథను ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రేక్షకులను నేరుగా కథలోకి తీసుకెళ్లేలా ఈ ఓపెనింగ్ సీన్స్ డిజైన్ చేశారు.తర్వాత ఆయన మార్క్ కనబడదు. 

ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ శింబు మధ్య వచ్చే సీన్స్, వారిద్దరి బాండింగ్‌ను ఎలివేట్ చేసే సన్నివేశాలు  బాగుంటాయి.  ముఖ్యంగా శింబు సోదరి విషయంలో కమల్ ఇచ్చే ఒక ప్రామిస్ సీన్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. భార్యాభర్తలుగా నటించిన కమల్ హాసన్, అభిరామిల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ డ్రామా సీన్స్ చాలా మెచ్యూర్డ్‌గా, హృదయానికి హత్తుకునేలా సాగుతాయి. 

నాయకుడు’ లాంటి క్లాసిక్ తర్వాత ఈ దిగ్గజ ద్వయం నుంచి వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేక పోయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచి, ప్రపంచవ్యాప్తంగా కేవలం సుమారు ₹93 నుండి ₹98 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి కమర్షియల్ డిజాస్టర్‌గా మిగిలింది. 

కథ కాగితంపై శక్తివంతంగా అనిపించినా, దాన్ని తెరకెక్కించడంలో తడబడ్డారు. ‘నాయకుడు’ లాంటి చిత్రాల్లో కనిపించే హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో మిస్ అయ్యాయి. పాత్రల ప్రవర్తనకు, వాటి ప్రతీకారానికి తగిన బలమైన కారణాలు సరిగా చూపించలేదు. సినిమా నడిపిన విధానం చివరికి వచ్చేసరికి గాడి తప్పింది.

అసలు ప్రేక్షకుడికి ఒక సంతృప్తికరమైన ముగింపు ఇవ్వకుండా, గందరగోళంగా క్లైమాక్స్ ముగించారు.సినిమా పరాజయానికి దాని నిడివి (Runtime) కూడా ఒక ప్రధాన మైనస్ పాయింట్‌గా మారింది.రన్‌టైమ్ దాదాపు 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాలు). కథలో దమ్మున్నప్పుడు ఈ నిడివి పెద్దగా అనిపించదు కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం సుదీర్ఘమైన రన్‌టైమ్ ప్రేక్షకులకు పెద్ద పరీక్షగా నిలిచింది. 

సినిమా ప్రారంభం ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత కథనం నత్తనడకన సాగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థం లో వచ్చే పలు సన్నివేశాలు సాగదీసినట్లు ఉండి, ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. రెండు గంటలకు కుదిస్తే బాగుండేది. కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నాయి. ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన ఎమోషన్స్ కానీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కానీ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్.   

రవి కె. చంద్రన్ అందించిన విజువల్స్, కెమెరా పనితనం ఉన్నతంగా ఉంది. ఏ.ఆర్. రెహ్మాన్ నేపథ్య సంగీతం సినిమాకు కొంత ప్లస్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఇంటెన్స్ డ్రామా సీన్స్‌లలో ఏ.ఆర్. రెహ్మాన్ ఇచ్చిన బిజీఎం (BGM) ఆయా సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఆసక్తి ఉన్నవారు సినిమా చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!