తెలుగు రాష్ట్రాల్లోని 35 గిరిజన తెగల్లో అత్యంత ప్రాచీనమైన, దుర్భర దుస్థితిలో ఉన్న తెగ చెంచులు. వీరు ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు. భవిష్యత్తులో సంభవించే విపత్తులను ముందుగానే పసిగట్టగల సమర్థులు. ప్రకృతి పరిరక్షకులు చెంచులు.
ఆహార సేకరణ ప్రధాన వృత్తిగా, మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని నల్లమల అటవీప్రాంతంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా జీవిస్తున్నారు. ఈ తెగలకు మిగతా జన సమూహాలతో గానీ, ఇతర గిరిజన తెగలతో కానీ దగ్గరి పోలికలు లేవు.
వీరి మనస్తత్వాలు. అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృతి భిన్నమైనవి. ఈ రోజు గడిస్తే చాలు రేపటి రోజు దేవుడెరుగు అనే తత్వం, మనువాద సంస్కృతి, పితృస్వామిక అజమాయిషి. నాగరిక సమాజపు పోకడలు ఏమాత్రం కనిపించని చెంచు సమాజంలో -స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వడం జరిగింది. భాగస్వామి ఎంపికలో స్త్రీకి పూర్తి స్వేచ్ఛ కల్పించిన గిరిజన తెగ చెంచులు. అయితే బాల్య వివాహాలు వారి అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యాయి. .
కాలుష్యమెరుగని ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న చెంచులు ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మతల్లో బాల్య వివాహాల ఆచారం ముఖ్యమైంది. బాల్య వివాహాలు ఆదిమ తెగలైన చెంచులలో విపరీతంగా జరుగుతున్నాయి.
వరకట్న బాధలు, పెళ్లిళ్ల ఖర్చులు, హంగు ఆర్భాటాలు లేకపోయినప్పటికీ నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులుండే 46 మండలాల్లో బైర్లూటి నుంచి అప్పాపూర్ వరకు అన్ని చెంచు గ్రామాల్లో దాదాపు ఇదే పరిస్థితి. అందుబాటులో ఉన్న బడిలో ఐదవ తరగతి వరకు మాత్రమే చదువు సాగించిన అమ్మాయికి పదకొండు, అబ్బాయికి పదమూడు సంవత్సరాల వయసొచ్చే టప్పటికి పెళ్లిళ్ళు జరుపుతున్నారు.
చెంచు తెగలలో అబ్బాయికి 13 సంవత్సరాలు, అమ్మాయికి 11 సంవత్సరాలు వయసొచ్చిందంటే, తమను తాము స్వతంత్రులుగా భావించుకుంటారు. తమపై తల్లిదండ్రుల అజమాయిషీ ఏమాత్రం సహించని వీరు ఇష్టపడ్డ వ్యక్తితో కలిసి వెళ్ళిపోతారు. సహజీవనం చేస్తారు. ఇది చెంచు సమాజానికి ఆమోదయోగ్యమే. ఈ విషయమై తల్లి తండ్రి ఏమాత్రం అభ్యంతరం తెలుపరు.
ఒకవేళ ఎవరైనా అలా అభ్యంతరం పెడితే వారికి బంధువులు ఆశ్రయం కల్పించి దన్నుగా నిలుస్తారు. వారిని ఒకింటివారిని చేస్తారు. చెంచుల సాంప్రదాయాల ప్రకారం మామకోడలు ఒకే కప్పుకింద నిద్రించకూడదనే ఆంక్ష ఆచారంలో ఉన్నందున కొడుక్కి కోడలిని కట్టబెట్టిన మరునాడే వేరు కాపురం పెట్టిస్తారు.
ఇక అప్పట్నుంచి తన కుటుంబ బాధ్యతలను తనే మోయాల్సి ఉంటుంది. పెద్దలు కొంతమేర సహాయ సహకారాలు అందించినా కుటుంబ వ్యవహారాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరు. కోడలితో మాట్లాడే సాహసం అసలు చేయరు. ఇక ఏమాత్రం పరిణతి చెందని వయసులో భార్య భర్త హెూదా పొందిన ఆ బాల బాలికల కష్టాలు వర్ణనాతీతం.
బతుకు తెరువు ఉండదు. ఉండటానికి ఇల్లు ఉండదు. తినడానికి తిండి ఉండదు. చదువు మధ్యలో మానేయడంవల్ల సమాజ పోకడలు తెలియవు. సమాజంలో ఏ విధంగా బతకాలో ఏమాత్రం అవగాహన ఉండదు.మూఢనమ్మకాలు, ముడి సాంప్రదాయాల మధ్య రకరకాల అపోహలతో అనామకులుగా అత్యంత దీనావస్థలో బతుకులీడుస్తున్నారు.
తిండిలేక పౌష్టికాహార లోపం, రక్తహీనత, మలేరియా, టైఫాయిడ్. కామెర్లు, టిబి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. గర్భంలోనే సరిగా ఎదగని బిడ్డలు పుట్టడం. మాతా శిశుమరణాలు, పరిశుభ్రత తెలియక వివిధ రకాల జబ్బులు, అనేక అంటువ్యాధులు, సుఖరోగాల బారిన పడుతున్నారు. 13 ఏళ్ళకే పెళ్ళిళ్లు జరగడం వల్ల 35 ఏళ్ళకే ముసలితనం ఛాయలు కనిపిస్తాయి. మరికొందరు అతి చిన్న వయసులోనే భర్తలను కోల్పోవడం నల్లమల ప్రాంతంలో సర్వసాధారణమైంది.
చెంచులకు పౌష్టికాహార కొరత తీర్చి బాలింతలను పరిపుష్టి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహార కేంద్రాలు వివిధ కారణాల రీత్యా చెంచుల దరిచేరడం లేదు. ఏజెన్సీలో ఉన్న వైద్య సేవలు ప్రభుత్వ లెక్కలు చూపించుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయి.
సకల సమస్యలకు పరిష్కారానికి మూలమైన విద్య, ఇతరత్రా అనేక సామాజిక కారణాలు అలాగే ముఖ్యంగా బాల్య వివాహాల మూలంగా చెంచుల దరిచేరలేదు. నిజాం కాలంలో బ్రిటిష్ వారు అమ్రాబాద్, మన్ననూర్ చెంచుగూడేల్లో కర్నూల్ జిల్లా బైరూట్లలో ప్రత్యేకంగా పాఠశాలను 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు.
అయినప్పటికీ వారి అక్షరాస్యత 26 శాతం దాటలేదు. ప్రస్తుతం ఆ పాఠశాలలు పిల్లలు లేక వెలవెల బోతున్నాయి. చెంచుల సగటు ఆయు: ప్రమాణం 40 -50 సంవత్సరాలంటే నమ్మశక్యం కాని విషయం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చెంచుల జనాభా అంతరిస్తోందని ఒకవైపు ప్రభుత్వం వారికి కుటుంబ నియంత్రణ నుంచి మినహాయించినప్పటికీ జనాభా వృద్ధి తిరోగమనంలో ఉంది.
వేల యేళ్ల చరిత్ర కలిగిన చెంచు జనాభా యాభై వేలు దాటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. చెంచుల ”సమగ్రాభివృద్ధికై” ప్రత్యేకంగా శ్రీశైలం కేంద్రంగా 1978 లో ఏర్పాటు చేసిన ఐటిడిఏ ఈ దిశగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే విమర్శలున్నాయి.
వివిధ పథకాలు రూపొందించి వాటిని అమలుపరచటంలో శ్రద్ధచూపే ప్రభుత్వాలు వారిని సామాజికంగా అభివృద్ధి పరిచి ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా చెంచులను ‘మూర్ఖులుగా ‘ ‘సోమరులుగా’ ముద్రవేసి అవమానపరచడం శోచనీయం. చెంచుజాతి మనుగడకు వారి అస్థిత్వానికి ప్రశ్నార్థకంగా మారుతున్న బాల్యవివాహ దురాచారానికి అడ్డుకట్ట వేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
కొంతమంది ఐటిడిఏ అధికారులు చెంచుల్లో నెలకొని ఉన్న ఈ దురాచారాలను మూఢనమ్మకాల నుంచి చైతన్య పరిచేందుకు కళాజాత లాంటి కార్యక్రమాల ద్వారా కొంతమేర కృషి చేసినప్పటికీ అధికారుల బదిలీల తో అది సాధ్యపడలేదు. ఫలితం పరిస్థితి యధాతథం. బాల్యవివాహాలు దాని దుష్ప్రభావాలను సవివరంగా చెంచులకు చేరవేయడంలో, ఉపన్యాసాలు, మీటింగుల కంటే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తాయి.
చెంచుల్లో నెలకొన్న ఈ సామాజిక రుగ్మతలను ముఖ్యంగా బాల్యవివాహాలను తొలగించే చర్యలు చేపట్టనంతకాలం “బంగారుతల్లి’, ‘పూర్ణశక్తి’ లాంటి పథకాలు కమిషన్లు, పాలసీలు, చట్టాలు ఎన్ని తెచ్చినా నిధులు ఖర్చు తప్ప ఫలితం మాత్రం శూన్యం. ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారం, కాసింత సేవా దృక్పథం, నిబద్ధతతో ముందుకెళ్తూ అత్యంత స్వల్ప జనాభా కలిగి పర్యావరణ పరిరక్షకులైన చెంచులు నశించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఎంతైనా ఉంది.
—-B.RAMESH