‘వద్దంటే వెళ్ళింది మంగళగిరి’ కి !!

Sharing is Caring...

She could not excel in politics …………………………..

నటి జమున సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నించారు. హేమాహేమీలున్న రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదు. అయితే ఆవిషయం జమున లేటుగా తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందుగా జమున 80 వ దశకం మొదట్లోనే  నాటి ప్రధాని ఇందిరా గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అంత చురుగ్గా వ్యవహరించలేదు.

1982లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు రాజకీయంగా జమున ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ ను  ఢీ కొనే విధంగా మాట్లాడటం ..  రాజకీయం గా  విభేదించడం నాటి చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. 83లో జమున పరిమితంగా ఎన్నికల ప్రచారం చేశారు.  ఇక ఎన్టీఆర్ కేవలం 9 నెలల ప్రచారం తోనే అధికారం లోకి వచ్చారు.

అయితే 1985 లో ఆయన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. నాటి ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్ ను ఎదుర్కొనేందుకు జమునను రంగం లోకి దించే ప్రయత్నాలు చేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కి జమున గురించి వివరించి… ఆయన  ద్వారా రాజకీయాల్లోకి రావాలని చెప్పించారు.  అలా రాజీవ్  కోరిక మేరకు జమున కాంగ్రెస్ పార్టీ తరపున  ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు.

అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇందిరా గాంధీ హత్య తాలూకు సానుభూతి ఉన్నప్పటికీ దాన్ని కాంగ్రెస్ నేతలు సొమ్ము చేసుకోలేకపోయారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జమున 1985 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానంలో  కాంగ్రెస్ అభ్యర్థిగా  పోటీ చేశారు. అప్పట్లో మంగళగిరి స్థానం వద్దు .. మరో స్థానం నుంచి పోటీ చేయమని సన్నిహితులు సూచించారు.

అయితే జమున మొండి తనంతో అక్కడి నుంచే పోటీ చేసి పరాభవం పాలయ్యారు. నాటి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ M s s కోటేశ్వరరావు బరిలోకి దిగారు. అప్పటికే కోటేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే. స్థానికుడు కూడా. జమున సభలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ … కుల సమీకరణాల తేడా.. స్థానికత తదితర కారణాల వల్ల  ఆమె  ఓడిపోయారు.

అయితే కోటేశ్వర రావు కి గట్టి పోటీయే ఇచ్చారు. నాటి ఎన్నికల్లో కోటేశ్వర రావు కి 43,584 ఓట్లు రాగా జమున కు 39,915 ఓట్లు వచ్చాయి.కేవలం 3,669 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంతకు ముందు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కంటే జమున కు ఎక్కువ ఓట్లు రావడం విశేషం.

అప్పట్లో అందరూ ‘వద్దంటే వెళ్ళింది మంగళగిరి’ కి అంటూ జమునను ఆట పట్టించారు. పత్రికలు కూడా అదే హెడ్డింగ్ తో మొదటి పేజీ వార్తా కథనాలు రాశాయి. ఆ ఓటమి తో జమున రాజకీయాలకు స్వస్తి పలకలేదు.  89 ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

నాటి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి చుండ్రు శ్రీహరి పై 58,322 ఓట్ల ఆధిక్యత తో ఎంపీగా గెలుపొందారు. జమున ఓడించడానికి తెలుగు దేశం పార్టీ విశేష కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత 1991 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో జమున రాజమండ్రి నుంచే పోటీ చేశారు. అయితే  రెండో సారి టీడీపీ అభ్యర్థి k v r చౌదరి చేతిలో 62,009 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరినప్పటికీ  పరిమిత ప్రచారం చేశారు. అనంతరం క్రియా శీల రాజకీయాలకు దూరం గా ఉన్నారు.  అదండీ జమున రాజకీయాల కథ.

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!