ఆర్ధిక దిగ్బంధనమే అమెరికా వ్యూహమా ?

Sharing is Caring...

Huge losses for Iran……..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ పై  కాల్పుల విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.   ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించారు.అయితే ఈసారి ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట ముగింపు తేదీని ప్రకటించలేదు.

ఇరాన్ ప్రభుత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనను (Unified Proposal) సమర్పించి, దానిపై చర్చలు ముగిసే వరకు ఈ కాల్పుల విరమణ అమలులో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు . పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్,ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌లో తెలిపారు.

కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనం (Naval Blockade) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఇరాన్-అమెరికా యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ, ఇరాన్ మాత్రం ఈ దిగ్బంధనాన్ని “యుద్ధ ప్రక్రియ”గానే పరిగణిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

అమెరికా నౌకాదళం (US Navy) విధిస్తున్న ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊహించని స్థాయిలో భారీ నష్టం వాటిల్లుతోంది. తాజా అంచనాల ప్రకారం, ఈ నష్టం రోజురోజుకూ పెరుగుతోంది.ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ రోజుకు సుమారు $435 మిలియన్ల నుండి $500 మిలియన్ల (సుమారు ₹3,600 – ₹4,100 కోట్లు) వరకు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోంది.

ఇరాన్ ఎగుమతుల్లో ముఖ్యమైన ముడి చమురు (Crude Oil),  పెట్రోకెమికల్స్ రవాణా పూర్తిగా నిలిచి పోయింది. దీనివల్ల రోజూ సుమారు $276 మిలియన్ల ఎగుమతి ఆదాయాన్ని కోల్పోతోంది. ఇరాన్ రోజుకు సుమారు 1.5 నుండి 2 మిలియన్ల బారెళ్ల చమురును ఎగుమతి చేసేది, ఇప్పుడు అది దాదాపు సున్నాకి చేరుకుంది.

నెల రోజుల దిగ్బంధనం వల్ల ఇరాన్ $13 బిలియన్ల ఆదాయాన్ని కోల్పోతుందని అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఇరాన్ మౌలిక సదుపాయాలు,ఆర్థిక వ్యవస్థకు కలిగిన మొత్తం నష్టం సుమారు $270 బిలియన్ల నుండి $300 బిలియన్లకు చేరినట్లు ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.  

చమురు నిల్వ చేసే ట్యాంకులు నిండిపోవడంతో, ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోంది. దీనివల్ల చమురు బావులకు శాశ్వత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.విదేశీ మారకద్రవ్యం రాకపోవడంతో ఇరాన్ కరెన్సీ (Rial) విలువ దారుణంగా పడిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం 100% కంటే ఎక్కువగా పెరగడంతో సామాన్యుల జీవితం అతలాకుతలమవుతోంది.

అమెరికా ఈ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఇరాన్‌ను శాంతి చర్చలకు ఒత్తిడి చేస్తోంది, అయితే ఇరాన్ మాత్రం ఈ “ఆర్ధిక యుద్ధం” నుండి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను (ఉదాహరణకు చాబహార్ ఓడరేవు ద్వారా రహస్య ఎగుమతులు) వెతుకుతోంది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా, దేశం లోపల ప్రజల నుండి తిరుగుబాటు వచ్చేలా చేయడం ట్రంప్ వ్యూహం. డబ్బు లేకపోతే ఇరాన్ తన మిత్ర దేశాలకు (ప్రాక్సీ గ్రూపులకు) నిధులు ఇవ్వలేదని ఆయన నమ్మకం.

నేరుగా యుద్ధం చేసి అమెరికన్ సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం కంటే, ఆర్థికంగా దెబ్బతీయడం వల్ల తక్కువ నష్టంతో ఎక్కువ ఫలితం వస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే కాల్పుల విరమణను పొడిగిస్తూనే, ‘సముద్ర దిగ్బంధనాన్ని’ మాత్రం కొనసాగిస్తున్నారు.గతంలో ఉన్న అణు ఒప్పందం (JCPOA) కంటే అమెరికాకు మరింత లాభం చేకూర్చే, ఇరాన్ క్షిపణి వ్యవస్థను కూడా నియంత్రించే కొత్త ఒప్పందంపై సంతకం చేయించాలని ట్రంప్ ప్రయత్నం.

ఇరాన్ ఆర్థికంగా బాగా బలహీనపడినప్పుడే వారు అమెరికా చెప్పిన షరతులకు ఒప్పుకుంటారని ఆయన అంచనా. ప్రస్తుతం ఇరాన్ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న IRGC కి నిధులు అందకుండా చేయడం ద్వారా, వారి పట్టును తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు.

ట్రంప్ వ్యూహం కొంతవరకు పనిచేస్తోంది. ఇరాన్ ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడం, కరెన్సీ పడిపోవడంతో వారు చర్చలకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే, ఇరాన్ కూడా దీనిని “ఆర్థిక ఉగ్రవాదం” అని పిలుస్తూ, దిగ్బంధనం తొలగించకపోతే చర్చలు జరపబోమని పట్టుబడుతోంది. కొద్దీ రోజులు పోతే గానీ ఇరాన్ వైఖరి ఏమిటో తేలదు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!