Sai Vamshi………..
‘బచా బాజీ’..అంటే పర్షియన్ భాషలో ‘చిన్నారుల నాటకం’ అని అర్థం. ఇది మామూలు అర్థం. అయితే అఫ్ఘానిస్థాన్‌లో ఓ అమానుషమైన పనికి పెట్టిన అందమైన పేరు ఇది. చాలామంది ఇతర దేశస్తులకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. అఫ్ఘాన్ చట్టం ఈ పనిని నిషేధించినా ఇంకా అక్కడక్కడా ఇవి జరుగుతూనే ఉన్నాయని సమాచారం.
అసలేమిటీ బచా బాజీ?
చిన్నపిల్లలు, యుక్తవయసులో ఉన్న మగవారి చేత అందరి మధ్యా పాట పాడుతూ నాట్యం చేయించడం, వారిని తమ ఇష్టానుసారం వాడుకోవడమే ఈ ‘బచా బాజీ’. ఒక రకంగా రికార్డింగ్ డ్యాన్స్‌ల వ్యవహారంలాగే ఉంటుంది. డ్యాన్స్ చేసే మగవారిని సెక్స్ కోసం వాడుకోవడం, వారిని లైంగికంగా వేధించడం వంటివీ జరుగుతుంటాయి.
ఒకానొక సమయంలో ఇలాంటి వారిని కొనడం, పోషించడం అఫ్ఘాన్‌లోని ధనవంతులు గొప్పతనంగా భావించేవారు. తమ అంతస్తుకు తగ్గట్టు చిన్నపిల్లల్ని కొనుక్కొని వారిని లైంగికంగా వాడుకునేవారు.
ఇదంతా ఎందుకు మొదలైంది అనేదాని గురించి అనేక రకాల కారణాలున్నాయి.
స్త్రీలు బయటకు రాకూడదు, అందరికీ ముఖం చూపించకూడదు అనే కఠినమైన నిబంధనల కారణంగా అక్కడ కొందరు తమ లైంగిక ఆసక్తిని పురుషుల మీదకు మళ్లించారని, ఆ కారణంగానే ఈ ‘బచా బాజీ’ మొదలైందని కొందరు అంటుంటారు. ఆటపాటల్లో ఆడవాళ్లని ప్రవేశపెట్టడం మతవిరుద్ధం కావడంతో ఆ స్థానాన్ని మగవారితో భర్తీ చేశారని, వారికే అమ్మాయిల బట్టలు వేసి, గజ్జెల కట్టి, వారు నాట్యం చేస్తుంటే చూసి సంతోషించేవారని అంటారు.
ఈ కారణంగా వందల మంది చిన్నారులు ‘బచా బాజీ’ బాధితులుగా మారారు. సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలు పెద్దగా అందుబాటులో లేని చాలామంది ఈ ‘బచా బాజీ’లకు అలవాటు పడేవారు. రాత్రంతా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ పని ఇష్టం లేక బాలలు, యువకులు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే వారిని బెదిరించడం, చంపడం కూడా జరిగేవి.
ఈ ‘బచా బాజీ’కి ఎటువంటి చిన్నారులు వస్తారు? అనాథలు, నిరుపేదలు, తల్లిదండ్రులు పట్టించుకోనివారు, వేరే పని దొరకనివారు వస్తుంటారు. డబ్బుల కోసం కొందరు తల్లిదండ్రుల తమ పిల్లల్ని ఇలా మారుస్తుంటారు. వారిని బలవంతంగా తెస్తుంటారు. వారిని పసిగట్టి ఈ రకంగా మార్చేందుకు కొందరు మధ్యవర్తులు సిద్ధంగా ఉంటారు.
ఆ పిల్లలకు తిండి పెట్టి, బట్టలు ఇచ్చి తాము చెప్పినట్లు వినేలా చేసుకుంటారు. వారికి నాట్యం నేర్పుతారు. కొన్నేళ్ల క్రితం వరకూ ఇదొక నిరంతర కార్యక్రమంగా సాగేది. అధికారులు, పోలీసులు కూడా వీటిని చూసీచూడనట్లు వదిలేసేవారు.
ప్రస్తుతం అక్కడ తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిగా నిషేధించారు. అయితే అక్కడో, ఎక్కడో ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయని అంటుంటారు. ‘The Kite Runner’ పేరుతో Khaled Hosseini ఈ అంశంపై ఓ నవల రాశారు. 2007లో ఇదే పేరుతో సినిమా సైతం వచ్చింది.

