ఎన్టీఆర్ కల్వకుర్తి లో ఎందుకు ఓడిపోయాడు ?

Sharing is Caring...

రాజకీయాల్లో అపుడపుడు  తమాషాలు జరుగుతుంటాయి. 1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి  కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక అవిశ్రాంతంగా  ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన దివంగత నేత నందమూరి తారకరామారావు  1989 లో కల్వకుర్తి  లో పోటీ చేసి ఓడిపోయారు. ఎవరూ ఊహించని ఓటమి అది. ఎన్టీఆర్ కూడా అక్కడ  ఓటమి ఎదురవుతుందని అనుకుని ఉండరు. ఎన్టీఆర్ కి రాజకీయాల్లో అదొక మరువలేని షాక్.

అంతే కాదు అప్పటి ఎన్నికల్లో తెలుగు దేశం అధికారం కోల్పోయి 71 స్థానాలతో ప్రతి పక్షం లో కూర్చోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో  ఎన్టీఆర్ ఖిన్నుడయ్యారు. అసెంబ్లీ కంటే లోకసభ ఎన్నికల తీర్పు మరీ ఘోరంగా ఉంది. తెలుగు దేశం కేవలం రెండు స్థానాల్లో నే గెలిచింది.ఇక ఎన్టీఆర్ ను కల్వకుర్తి లో పోటీ చేయమని అప్పటి జనతాదళ్ నేత  జైపాల్ రెడ్డి సూచించారు.1969….  1983 లో జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచారు.

అయితే అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల తీరు తెన్నులు, ప్రజల సమస్యలు , ప్రభుత్వ పధకాల అమలు తీరు…  తదితర  అంశాలపై టీడీపీ సరిగ్గా స్టడీ చేయలేదు. కొంతమంది అక్కడ పోటీ చేయ వద్దని చెప్పినా ఎన్టీఆర్ వినలేదు. హిందూ పూర్ ,కల్వకుర్తి రెండు చోట్ల పోటీకి దిగారు.కల్వకుర్తి లో  బంజారాల ఓట్లు 25 వేలకు పైగా ఉన్నాయి.

వారంతా   కాంగ్రెస్ అనుకూల వైఖరితో ఉన్నారు. అధికారంలో కొచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆ ప్రాంతంలో అసలు పర్యటించలేదు. అక్కడ ప్రచారం పెద్దగా జరగకపోవడం. ఎన్టీఆర్ కూడా ప్రచారం చివరి రోజు 3 గంటలపాటు ప్రచారానికొచ్చారు.  స్థానిక సమస్యల పట్ల ప్రభుత్వ ఉదాసీనత,టీడీపీ ప్రచారం కోసం ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడం వంటి అంశాలు ఆయన ఓటమికి దారి తీశాయి.

కాగా  అంతకుముందు 31మంది మంత్రులను బర్తరఫ్ చేయడం, న్యాయస్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు,  ప్రజల్లో గూడు కట్టుకున్నఅసంతృప్తి వంటి అంశాలు ఓటమి కి దోహద పడ్డాయి. వీటన్నిటితో పాటు పార్లమెంట్, అసెంబ్లీ కి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగడం కూడా ఎన్టీఆర్ కి మైనస్ అయింది. 

ఎన్టీఆర్ పై పోటీ చేసిన చిత్తరంజన్ దాస్ కేవలం 3568 ఓట్ల ఆధిక్యత తో గెలుపొందారు. ఎన్టీఆర్ కి 50786 ఓట్లు రాగా చిత్తరంజన్ దాస్ కి 54354 ఓట్లు వచ్చాయి. మరో నలుగురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు కానీ వాళ్ళు పెద్దగా ఓట్లు చీల్చలేదు.

ఫలితాలకు ముందే ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్టీఆర్ గెలవడం కష్టం అని చెప్పారు.. కానీ ఎన్టీఆర్ ప్రజలపై గట్టి నమ్మకం ఉంచారు. అయితే ఆయన అంచనాలు  తారుమారు అయ్యాయి. ఇక హిందూ పూర్ లో మాత్రం గెలిచారు. ఈ చిత్తరంజనుదాస్ 85 లో కూడా కల్వకుర్తి నుంచి గెలుపొందారు.94 లో మాత్రం ఎడ్మ కృష్ణారెడ్డి ఇండిపెండెంట్గా  పోటీ చేయగా ఆయన చేతిలో ఓడిపోయాడు.

అది కూడా నాలుగో స్థానం లో నిలిచాడు.  ఎన్టీఆర్ పై గెలిచినప్పుడు మాత్రం మంత్రి గా చెన్నారెడ్డి క్యాబినెట్ లోకి తీసుకున్నారు.తర్వాత నియోజకవర్గంపై పట్టు పెంచుకోలేక పోయారు. అదే సమయంలో మహబూబ్ నగర్  నుంచి లోకసభకు పోటీ చేసిన జైపాల్ రెడ్డి కూడా ఓడిపోయారు. 

కాగా ఆనాటి కల్వకుర్తి ఓటమి వెనుక ఎన్టీఆర్ కుటుంబ గొడవలు తెరవెనుక కీలక పాత్ర పోషించాయని అంటారు. ఎన్టీఆర్ చివరి కూతురు ఉమామహేశ్వరి కి తమిళనాడుకి చెందిన నరేన్ రాజన్ తో వివాహం అయింది. అయితే నరేన్ రాజన్ వ్యవహార శైలి నచ్చక ఉమామహేశ్వరి కి విడాకులు ఇప్పించి ఎన్టీఆర్ మరో పెళ్లి చేశారు.

ఇది అందరికి తెల్సిందే. ఈనరేన్ రాజన్ కోయంబత్తూర్ లో లిక్కర్ బిజినెస్ చేసేవారు. ఆయనకు అప్పటి కాంగ్రెస్ నేత మాగంటి రవీద్రనాథ్ చౌదరి వ్యాపార మిత్రుడు.అవేర్ ఎన్జీవో అధినేత మాధవన్ తో కల్సి ఎన్టీఆర్ ఓటమి కోసం ఆ ఇద్దరు పని చేశారని అంటారు.

గిరిజనులతో అవేర్ సంస్థ కలసి పని చేసేది. అక్కడ బంజారాలు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీరిని అవేర్ బాగా ప్రభావితం చేసిందని కూడా చెబుతారు. ఇక  ఎన్టీఆర్  తరఫున జైపాల్ రెడ్డి  గిరిజన తండాల్లో ప్రచారం చేశారు .

kalప్రజాస్వామ్య పరిరక్షణ తదితర అంశాలపై  ఇంగ్లీషులో మాట్లాడుతూ ప్రచారం చేసేవారట. వెళ్లి పోతూ ప్రతి చోట జనానికి చేయి ఊపుతూ టాటా చెప్పేవారట. అయోమయంలో ఉన్న జనాలు… ’’దొర చేయి చూపించిండు‘‘ అనేసి హస్తం గుర్తుపై గుద్దేశారు అని కూడా సరదాగా చెప్పుకుంటారు. 

1 Chittaranjan Dass   INC  * 0   M   54354 50.94%
2 Nandamoori Taraka Ramarao   TDP  * 0   M   50786 47.59%
3 Inna Reddy   IND  * 0   M   556 0.52%
4 Masna Shankaraiah   IND  * 0   M   376 0.35%
5 Krishana Reddy Y.   IND  * 0   M   337 0.32%
6 Ramakistaiah Chinthoji   IND  * 0   M   303 0.28%
———– KNMURTHY

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!