Price must be paid……………………………
ఇల్లు కొనే ముందు కానీ అపార్ట్మెంట్ కానీ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కీలకమైన అంశాలను పరిశీలించాలి. ఇటీవల నోయిడాలో జంట భవనాల కూల్చివేతను అందరూ చూసే ఉంటారు. భారీ వ్యయంతో నిర్మించినప్పటికీ..వాటిని కూల్చివేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయక తప్పలేదు.
ఈ సంఘటన ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదన్న బలమైన సందేశాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రజల్లోకి తీసుకెళ్లింది. అందుకే ఎవరైనా ఇల్లు లేదా ఏదైనా ఆస్తి కొనే ముందు వాటి అనుమతుల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన తెలియ జేస్తున్నది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఇబ్బందులు పడక తప్పదు. అక్కడి నిర్మాణ సంస్థ సూపర్ టెక్ కొన్ని తప్పులు చేసింది.
@ నోయిడా జంట భవనాల నిర్మాణ ప్రణాళికను సూపర్ టెక్ సంస్థ పలుసార్లు సవరించింది.
@ ప్రతిసారీ కొత్తగా మరిన్ని అంతస్తులను యాడ్ చేసింది. నోయిడా భవన నిర్మాణ నిబంధనల ప్రకారం.. భారీ భవంతులను నిర్మించే ముందు వాటి మధ్య నిర్దేశిత దూరాన్ని పాటించాలి. ఇది భవంతుల ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. కూల్చివేసిన జంట భవనాల విషయంలో మాత్రం నిబంధనల్ని ఉల్లంఘించి చాలా దగ్గరగా నిర్మించారు.
@ ఉత్తర్ ప్రదేశ్ అపార్ట్ మెంట్ చట్టాన్ని సైతం సూపర్ టెక్ సంస్థ పట్టించుకోలేదు. @ ఒకసారి ప్రాజెక్టులోని ఇళ్లను విక్రయించిన తర్వాత.. దాని నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయాలంటే కొనుగోలుదారుల అనుమతి తీసుకోవాలి. సూపర్ టెక్ అలా చేయలేదు. @ ప్రాజెక్టు తొలి ప్లాన్ ప్రకారం.. జంట భవనాలు నిర్మించిన ప్రదేశంలో సూపర్ టెక్ ‘గ్రీన్ ఏరియా’ను అభివృద్ధి చేయాలి.
కానీ, దానికి విరుద్ధంగా ఆ స్థలంలో మరో రెండు భారీ భవంతులను నిర్మించాలని నిర్ణయించడంతో స్థానికులు న్యాయపోరాటానికి సిద్ధమై విజయం సాధించారు. @ ఆ రెండు భవంతుల నిర్మాణ ప్రణాళికకు ప్రభుత్వ అనుమతి ఉంది. అందుకే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ.. ఇల్లు కొనుగోలుదారులకు 100 శాతం రక్షణ లభిస్తుందన్న హామీ లేదని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది.
@ బిల్డర్ తాము నిర్మించబోయే భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెబితే.. సంతృప్తి చెందడం సమంజసం కాదు. క్రాస్ చెక్ చేసుకోవాలి. లక్షలు .. కోట్లు పెట్టేముందు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది.
@ నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులో ఇల్లు కొనే ముందు వీలైతే గుర్తింపు పొందిన ఓ కన్సల్టెంట్ ను సంప్రదించాలి. లేదా ఈ రంగంలో అనుభవం ఉన్న ఓ న్యాయవాదినైనా సంప్రదించడం మేలని నిపుణులు అంటున్నారు. ఇది నిజానికి అదనపు ఖర్చే. కానీ, ఖరీదైన ఇల్లు కొనే ముందు జాగ్రత్త కోసం ఈ మాత్రం ఖర్చు చేయడంలో తప్పులేదు. లేదంటే ఒక్కోసారి మూల్యం చెల్లించాలి.
@ భవంతిని నిర్మిస్తున్న స్థలం .. నిర్మాణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా ఉందేమో చెక్ చేసుకోవాలి వివిధ శాఖల నుంచి అనుమతులు వచ్చాయా.. లేదా.. చెక్ చేసుకోవాలి. భవంతి ఎత్తుకు ఏవియేషన్ విభాగం అనుమతి తప్పనిసరి. విద్యుత్తు, నీటి సరఫరా, పర్యావరణ క్లియరెన్సూ ఉండాలి. ఒకవేళ అనుమతులు ఉన్నా.. వాటికి ఏమైనా షరతులు ఉన్నాయేమో పరిశీలించాలి.
@ డెవలపర్ గత చరిత్ర ఏమిటో కూడా తెలుసుకోవాలి. గతంలో ఇళ్లను సకాలంలో కొనుగోలుదారులకు అందించారా.. లేదా.. ఆరా తీయాలి. లేకుంటే నష్ట పోయేది మనమే.