డీసెంట్ సైకలాజికల్ మిస్టరీ డ్రామా !

Sharing is Caring...

psychological mystery drama ………

“ది డాగ్స్” (The Dogs) కెనడియన్ సస్పెన్స్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇది . రచయిత అల్లాన్ స్ట్రాటన్ రాసిన ప్రసిద్ధ యంగ్ అడల్ట్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాలెరీ బుహాగియర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 2025లో విడుదలయింది.  

 కథాంశం ఏమిటంటే ?

టీనేజ్ కుమారుడు క్యామెరాన్ (డోనోవన్ కోలన్) తో కలసి కాథరిన్ (కాథ్లీన్ మన్రో) హింసాత్మక ప్రవర్తన గల భర్త నుంచి తప్పించుకోవడానికి దూర ప్రాంతంలోని పాత ఫామ్‌హౌస్‌లో అద్దెకు చేరతారు. ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ, దానికి ఒక భయంకరమైన గతం ఉంటుంది. ఆ ఇంట్లో నివసించిన యజమానులు అనుమానాస్పద స్థితిలో మరణించారు.

కొత్త ఇంట్లోకి వచ్చిన కొద్దిరోజులకే క్యామెరాన్‌కు వింత శబ్దాలు వినబడటం, అక్కడ ఒక చిన్నారి (జాకీ) దెయ్యం కనిపించడం మొదలవుతుంది. అంతేకాకుండా ఆ ఫామ్‌హౌస్ చుట్టుపక్కల భయంకరమైన కుక్కల మంద తిరుగుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. అసలు ఆ ఇంట్లో గతంలో ఏం జరిగింది? తన తండ్రి నుండి క్యామెరాన్ ఎలా బయటపడ్డాడు? అనేదే మిగిలిన కథ.

ప్రధాన పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ డోనోవన్ కోలన్ చాలా అద్భుతంగా నటించాడు. తండ్రి పట్ల ఉండే భయం, దెయ్యాల వల్ల వచ్చే మానసిక గందరగోళాన్ని (Psychological Trauma) తన హావభావాల ద్వారా బాగా పండించాడు. తల్లిగా నటించిన కాథ్లీన్ కూడా మెప్పించింది.

సినిమాటోగ్రఫీ , విజువల్స్ చాలా బాగున్నాయి. ఆ పాత ఫామ్‌హౌస్, దాని చుట్టూ ఉండే అడవి ప్రాంతాన్ని చూపించిన విధానం ప్రేక్షకుల్లో ఒక రకమైన మూడీ  వాతావరణాన్ని, సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది.జాకీ అనే చిన్నారి దెయ్యం చుట్టూ నడిచే సస్పెన్స్ ఎలిమెంట్స్, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది. 

సినిమా ప్రచార పోస్టర్లపై, ప్రమోషన్లలో భయంకరమైన రాక్షస కుక్కల హారర్ సినిమాగా చూపించారు. కానీ సినిమాలో కుక్కల పాత్ర తక్కువ.ఎక్కువగా మానసిక సంఘర్షణ , దెయ్యాల మిస్టరీపైనే దృష్టి పెట్టారు. దీనివల్ల ప్యూర్ క్రిచర్-హారర్ (జంతువుల దాడి) ఆశించే ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. 

సినిమా కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని హారర్ సీన్స్,లాజిక్స్ సరిగ్గా వర్కవుట్ కాలేదు. పేరుకు హారర్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టించే లేదా భయపెట్టే సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

ఫామ్‌హౌస్ వెనుక ఉన్న దట్టమైన అడవిని ఎక్స్‌ప్లోర్ చేయడానికి క్యామెరాన్ ఒంటరిగా వెళ్తాడు. అక్కడ చెట్ల మధ్య నుండి వచ్చే వింత శబ్దాలు, ఆ వాతావరణం ప్రేక్షకుడిలో ఒక తెలియని భయాన్ని, సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తాయి.

చీకటి పడ్డాక ఫామ్‌హౌస్ కిటికీల బయట, పొగమంచులో భయంకరమైన కళ్లతో క్రూరమైన కుక్కల మంద నిలబడి చూస్తున్న సీన్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సీన్‌ను బాగా ఎలివేట్ చేసింది.
జాకీ అనే దెయ్యం క్యామెరాన్‌కు కనిపించే సన్నివేశాలు, వాళ్లిద్దరి మధ్య జరిగే  సంభాషణలు సినిమాలోని మిస్టరీని పెంచుతాయి.

ఇంటి కింద ఉన్న పాత బేస్‌మెంట్‌లోకి క్యామెరాన్ టార్చ్ లైట్ వేసుకుంటూ వెళ్లి, ఆ ఫామ్‌హౌస్ గతానికి సంబంధించిన పాత వస్తువులను, నిజాలను కనుగొనే సీక్వెన్స్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది.సినిమా చివరలో తన తండ్రి భయం నుండి క్యామెరాన్ మానసికంగా ఎలా బయటపడ్డాడు, అలాగే ఆ దుష్టశక్తుల నుండి తల్లిని ఎలా కాపాడుకున్నాడు అనే క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది.

సినిమాలో హారర్ ఎలిమెంట్స్ కంటే కూడా తల్లి (కాథరిన్) కొడుకు (క్యామెరాన్) మధ్య సాగే అనుబంధం, వారి మానసిక సంఘర్షణ ప్రేక్షకులను ఎక్కువగా ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయి.ఇంట్లో దెయ్యం తిరుగుతోందని, బయట కుక్కలు కనిపిస్తున్నాయని క్యామెరాన్ చెప్తుంటే, తల్లి మొదట్లో నమ్మదు. భర్త పెట్టిన మానసిక హింస  వల్ల అలా అతను భ్రమపడుతున్నాడని ఆమె ఆవేదన చెందుతుంది.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య వచ్చే వాదోపవాదాలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేక బాధ పడే  సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో తల్లిని హగ్ చేసుకుని ఓదార్చే సీన్ చాలా ఎమోషనల్‌గా ముగుస్తుంది.

ఈ చిత్రంలో హారర్ కంటే కూడా గృహ హింస వల్ల ఒక కుటుంబం ఎలాంటి మానసిక వేదనను అనుభవిస్తుందో ఈ పాత్రల ద్వారా దర్శకుడు చాలా బాగా చూపించారు. ప్రేక్షకులను ఆ కథలోకి తీసుకెళ్లడంలో సంగీతం, కెమెరా పనితనం ముఖ్యమైన పాత్ర పోషించాయి.

ఈ సినిమా ఒక స్లో-బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ కావడం వల్ల, ఇందులో భారీ శబ్దాలతో భయపెట్టే మ్యూజిక్ కంటే సున్నితంగా వెన్నులో వణుకు పుట్టించే సంగీతాన్ని ఉపయోగించారు. చాలా సీన్లలో ఎటువంటి మ్యూజిక్ లేకుండా కేవలం నిశ్శబ్దాన్ని, కుక్కల అరుపులను, గాలి శబ్దాలను మాత్రమే వాడారు. ఇది ప్రేక్షకులలో సస్పెన్స్‌ను మరింత పెంచింది.

సినిమాలోని ఎక్కువ భాగం సీన్లను తెల్లవారుజామున వచ్చే దట్టమైన పొగమంచులో లేదా లో-లైటింగ్  లో చిత్రీకరించారు. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడే ప్రేక్షకుడికి ఏదో కీడు జరగబోతుందనే ఫీలింగ్ కలుగుతుంది.
ప్రధాన పాత్ర పోషించిన చిన్న కుర్రాడు (క్యామెరాన్) భయపడుతున్నప్పుడు, అతని కళ్లలోని ఆందోళనను, తండ్రి గుర్తొచ్చినప్పుడు అతని ముఖంలో వచ్చే హావభావాలను కెమెరా క్లోజప్ షాట్స్ ద్వారా చాలా పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు.

మొత్తంగా చెప్పాలంటే, కథనంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సంగీతం,  కెమెరా వర్క్ కలిసి ఈ సినిమాకు మంచి హారర్/సస్పెన్స్ లుక్‌ను తీసుకువచ్చాయి.  ఈ సినిమా జియో హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ లో ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!