క్లాసిక్ ఎమోషనల్,ఫీల్ గుడ్ మూవీ !!

Sharing is Caring...

Feel-good movie……..

“చిన్న చిన్న ఆశై” (Chinna Chinna Aasai) వారణాసి (కాశీ) నేపథ్యంలో సాగే ఒక అందమైన, హృదయానికి హత్తుకునే  ఫీల్-గుడ్ డ్రామా చిత్రం.  ప్రస్తుతం జియో హాట్ స్టార్లో తెలుగుతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాల, సీనియర్ నటుడు ఇంద్రాన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

కథాంశం ఏమిటంటే ?

52 ఏళ్ల లీల (మధుబాల) జీవితంలో ఎన్నో కష్టాలు, ఒంటరితనాన్ని అనుభవించి ఒక ఆధ్యాత్మిక యాత్ర కోసం వారణాసికి వస్తుంది. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె తన టూర్ గ్రూప్‌ను మిస్ అవ్వడమే కాకుండా, తన బ్యాగ్, డబ్బు, ఫోన్ పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉండిపోతుంది.

అలాంటి క్లిష్ట సమయంలో ఆమెకు మాధవన్ మాష్ (ఇంద్రాన్స్) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు పరిచయమవుతాడు. జీవితంలో తమదైన గాయాలతో ఒంటరిగా మిగిలిపోయిన ఈ ఇద్దరు మిడిల్ ఏజ్ వ్యక్తులు కాశీ ఘాట్లలో కలిసి ప్రయాణిస్తూ, ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారు? వారి నిశ్శబ్ద పరిచయం జీవితంలో సరికొత్త ఆశలను ఎలా రేకెత్తించింది? అనేదే ఈ సినిమా కథ. 

లీల పాత్రలో మధుబాల అద్భుతమైన నటనను కనబరిచారు. ఒంటరితనం, మానసిక వేదన, ఆపై లభించిన ఓదార్పును ఆమె తన కళ్లతోనే ఎంతో పరిణతితో పలికించారు.లీల పాత్రకు ప్రాణం పోసిన మధుబాల సినిమాను నిలబెట్టే భావోద్వేగ సన్నివేశాలలో చక్కగా నటించారు.  

ఆమె తన కెరీర్‌లోనే ఒక ఉత్తమ పాత్రలో జీవించారని చెప్పాలి. డైలాగ్స్ లేకుండా కేవలం కళ్లతోనే భావాలను పలికించారు. గంగా హారతిని చూస్తున్నప్పుడు, ఆమె ముఖంలో భక్తితో పాటు జీవితంపై ఒక కొత్త ఆశ, వైరాగ్యం కలగలిసిన భావాలు కనిపిస్తాయి. ఆ విజువల్స్ లో ఆమె నటన క్లాసిక్‌గా ఉంటుంది. 

మిడిల్ ఏజ్ పాత్రలో ఆమె ప్రదర్శించిన పరిణతి సినిమా చూసే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మాధవన్ పాత్రలో మలయాళ సీనియర్ నటుడు ఇంద్రాన్స్ ఒదిగిపోయారు. ఆయన ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్,  సున్నితమైన డైలాగ్ డెలివరీ పాత్రకు ప్రాణం పోశాయి.కీలక పాత్రల్లో కనిపించిన అపర్ణ బాలమురళి, విష్ణు అగస్త్య కూడా కథ గమనంలో తమ వంతు పాత్రలు పోషించారు. 

త‌న భార్య అస్తిక‌లు తీసుకుని ఒక వ్యక్తి ఘాట్ పై నడుస్తున్నపుడు లీల కి త‌గిలి అత‌డి చేతులోని ఆ అస్తిక‌ల పాత్ర కింద ప‌డిపోతుంది. ఆ త‌ర్వాత అత‌డికి లీల, మాధవన్ సారీ చెబుతారు. అత‌డు త‌న భాగ‌స్వామి గురించి ఏడుస్తూ మాట్లాడే మాటలు గుండెను మెలిపెడతాయి. 

మొత్తం మీద రెండు కీలక పాత్రలు, కొన్ని చిన్న పాత్రలతో కథను దర్శకురాలు ఆసక్తికరంగా నడిపించారు. సినిమాలో అనవసరమైన సీన్లు దాదాపుగా లేవు. ముగింపు సన్నివేశం ప్రేక్షకుడి మనసును బరువెక్కిస్తుంది.  రచయిత్రి, దర్శకురాలైన వర్ష వాసుదేవ్ మానవ సంబంధాలు, ఒంటరితనం, జీవితంలో లభించే రెండో అవకాశం అనే అంశాలను ఎంతో సున్నితంగా హ్యాండిల్ చేశారు.

వారణాసి ఘాట్లు, గల్లీలు, గంగా హారతి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా పాత్రలతో పాటు కాశీ వీధుల్లో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ‘నైంటీసిక్స్’ ఫేమ్ గోవింద్ వసంత అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రతి ఎమోషనల్ సీన్‌ను సంగీతం వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది.

సినిమాలో ఆర్టిఫిషియల్ లైటింగ్ ఎక్కువగా వాడకుండా, కాశీ వీధుల్లోని స్ట్రీట్ లైట్లు, ఘాట్‌ల దగ్గరి దీపాల వెలుతురును వాడుకుంటూ కెమెరామెన్ పద్మకుమార్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇద్దరు వయసు పైబడిన వ్యక్తులవారి ముఖాల్లోని అమాయకత్వం, ఆనందం, బాధ, కళ్లలోని హావభావాలను కెమెరా చాలా దగ్గరగా క్యాప్చర్ చేసింది. పాత్రల ఎమోషన్స్ ప్రేక్షకుడికి నేరుగా కనెక్ట్ అవ్వడానికి కెమెరా వర్క్ పెద్ద అసెట్ అని చెప్పవచ్చు.

మధుబాల,ఇంద్రాన్స్ ల నటన.కాశీ అందాలను కళ్లకు కట్టినట్లు చూపించిన విజువల్స్ ,గుండెలను మెలిపెట్టే భావోద్వేగ క్లైమాక్స్. గోవింద్ వసంత నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం.

అయితే కథనం నెమ్మదిగా సాగుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్లు, చురుకైన ట్విస్టులు ఆశించే వారికి కాస్త బోర్ కొట్టవచ్చు.అందరికి సినిమా నచ్చకపోవచ్చు.

ఒక క్లాసిక్ ఎమోషనల్ డ్రామా ఇది . హృదయానికి హత్తుకునే సున్నితమైన కథ, లీనమయ్యే విజువల్స్ ఇష్టపడేవారు వీకెండ్‌లో తప్పకుండా చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ ఇది.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!