Murder Mystery……..
‘కోల్డ్ కేస్’ (Cold Case) మలయాళ ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.తను బాలక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా Amazon Prime లో స్ట్రీమింగ్ అవుతోంది. సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ ఏమిటంటే ?
ఒక చెరువులో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టబడిన ఒక మనిషి పుర్రె లభిస్తుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను ఏసీపీ సత్యజిత్ (పృథ్వీరాజ్)కు అప్పగిస్తారు. కేవలం పుర్రె ఆధారంగా, ఎలాంటి ఇతర క్లూస్ లేకుండా సత్యజిత్ పూర్తిగా సైన్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్, తన లాజికల్ ఆలోచనలతో దర్యాప్తు ప్రారంభిస్తాడు.
మరోవైపు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్,సింగిల్ మదర్ మేధా పద్మజ (అదితి బాలన్) తన కూతురితో కలిసి ఒక పాత అద్దె ఇంట్లోకి మారుతుంది. ఆ ఇంట్లో కొన్ని పారానార్మల్ అనుభవాలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో ‘ఇవా మారియా’ అనే అమ్మాయి ఆత్మ ఉందని ఒకరి ద్వారా ఆమెకు తెలుస్తుంది.
ఒకవైపు పోలీస్ ఆఫీసర్ సైన్స్ ఆధారంగా, మరోవైపు జర్నలిస్ట్ పారానార్మల్ శక్తుల ఆధారంగా ఒకే మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు, చివరికి వీరిద్దరి దర్యాప్తు ఎక్కడ ఏకమైంది అనేదే మిగతా కథ.
ఒకే లీడ్‌ను పట్టుకుని అటు పోలీసులు సైంటిఫిక్ పద్ధతిలో, ఇటు జర్నలిస్ట్ హారర్ కోణంలో సమాంతరంగా నడవడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది.ఏసీపీ సత్యజిత్‌గా పృథ్వీరాజ్ చాలా సెటిల్డ్ గా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఎలాంటి అనవసరపు బిల్డప్స్ లేకుండా నిజాయితీ గల ఆఫీసర్‌గా మెప్పించారు. ‘అరువి’ ఫేమ్ అదితి బాలన్ కూడా భయపడుతూనే నిజం తెలుసుకోవాలనే జర్నలిస్ట్ పాత్రలో చక్కగా నటించింది.మిగతా పాత్రధారులు తమ పరిధిలో బాగానే చేశారు.
సినిమాలో చూపించే క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్,సైంటిఫిక్ విశ్లేషణలు చాలా సహజంగా, ఆసక్తికరంగా డిజైన్ చేశారు.చెరువులో దొరికిన మానవ పుర్రెను పట్టుకుని పృథ్వీరాజ్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో కేవలం ఆ పుర్రె ఆకృతి ఆధారంగా ఆ వ్యక్తి వయసు, లింగం, ముఖ రూపాన్ని (Facial Reconstruction) డిజిటల్‌గా రీ-క్రియేట్ చేసే సీన్స్ చాలా సైంటిఫిక్‌గా, ఆకట్టుకునేలా ఉంటాయి.
చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు పాత రేషన్ కార్డ్ రికార్డులు, ఆధార్ లింక్‌లు, మిస్సింగ్ కేసుల ఫైళ్లను వెతికే సీన్స్ చాలా నైపుణ్యంతో స్క్రీన్‌పై చూపించారు. రియలిస్టిక్ క్రైమ్ నవల చదువుతున్న అనుభూతిని ఈ సన్నివేశాలు ఇస్తాయి.
అయితే కథ చాలా ఫ్లాట్‌గా, స్లోగా సాగుతుంది. కమర్షియల్ హంగులు లేదా స్క్రీన్‌ప్లేలో వేగం ఆశించే తెలుగు ప్రేక్షకులకు కొద్దిగా బోర్ కొట్టవచ్చు.సినిమాలో అనవసరమైన సన్నిశాలను తీసివేసి నిడివి తగ్గించి ఉండే బాగుండేది ..పారానార్మల్ ట్రాక్‌లో చూపించిన భయానక సన్నివేశాలు రొటీన్‌గా ఉంటాయి (ఉదాహరణకు దెయ్యం బొమ్మ, వింత శబ్దాలు). ఫ్రిజ్ సీన్స్ భయపెట్టేలా ఉండవు.
హంతకుడు ఎవరు అనే సస్పెన్స్ పెద్దగా థ్రిల్ ఇవ్వదు. రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలను చూసేవారు క్లైమాక్స్ ట్విస్ట్‌ను సులభంగా ఊహించేయవచ్చు.కథ చివరవరకు ఇద్దరు ప్రధాన పాత్రధారులు విడివిడిగానే సమాచారం సేకరిస్తుంటారు.క్లైమాక్స్‌కు కొద్ది నిమిషాల ముందే వారు కలుసుకోవడం వల్ల రెండు ట్రాక్‌ల మధ్య బలమైన కనెక్టివిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది.
ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన కెమెరా వర్క్ సినిమాకు ఒక పెద్ద అసెట్. ఈ చిత్రానికి ప్రకాష్ అలెక్స్ సంగీతాన్ని అందించారు. సినిమాలో పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
మొత్తం మీద ఓ మోస్తరుగా ఆకట్టుకునే క్రైమ్-హారర్ థ్రిల్లర్. సైన్స్, పారానార్మల్ ఎలిమెంట్స్‌ని ఒకే కథలో బ్యాలెన్స్ చేయాలనే ప్రయత్నం బాగున్నప్పటికీ, స్క్రిప్ట్ లోపాలు, నెమ్మదైన కథనం వల్ల సినిమా అనుకున్న రేంజ్‌ను అందుకోలేకపోయింది.
లౌడ్ హారర్ ఎలిమెంట్స్ లేకుండా, కేవలం లాజికల్ మర్డర్ మిస్టరీ,ఇన్వెస్టిగేషన్ చిత్రాలను ఇష్టపడేవారు ఓసారి Amazon Prime లేదా యూట్యూబ్ లో ఈ చిత్రాన్ని చూడవచ్చు.

