ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా !!

Sharing is Caring...

Romantic comedy movie ……..

‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ ఏడీ మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తూ, నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) ఒక క్లీన్, హృదయపూర్వకమైన ఫీల్-గుడ్ రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ చిత్రం. మలయాళంలో ₹300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు.

 కథ ఏమిటంటే  ?

కేరళలోని అంగమాలి క్యాథలిక్ కమ్యూనిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా, ఊరి జనాలు అందరికీ ఇష్టుడిగా ఉంటూ క్యాటరింగ్ వ్యాపారం చేసుకునే జస్టిన్ (నివిన్ పౌలీ) పొరుగున ఆష్లే (మమితా బైజు) కుటుంబం వచ్చి చేరుతుంది.

13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, కాలేజీ స్టూడెంట్ అయిన ఆష్లే జస్టిన్ వైపు ఆకర్షితురాలవుతుంది. వీరి మధ్య చిగురించిన సీక్రెట్ లవ్ స్టోరీకి, వారి కుటుంబ సభ్యులు నుండి ఎదురైన అడ్డంకులు ఏమిటి ? ఇద్దరూ ఒక్కటయ్యారా  అనేది మిగతా కథ. 

నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా జీవించేశారు. జెన్-జీ అమ్మాయిగా మమితా బైజు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పోటీ పడి నటించి సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా, ఎక్కడా ఇబ్బందిగా అనిపించకుండా కెమిస్ట్రీ చాలా నాచురల్‌గా వర్కవుట్ అయింది.

‘ప్రేమలు’ తరహాలోనే లౌడ్ కామెడీ లేకుండా, కేరళ నేటివిటీ చుట్టూ పాత్రల మధ్య వచ్చే ఆర్గానిక్,  ఫన్నీ సంభాషణలు  నవ్వులు పూయిస్తాయి. సంగీత్ ప్రతాప్ క్యారెక్టర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. విష్ణు విజయ్  వింటేజ్ మ్యూజిక్ కనెక్టివిటీతో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను చాలా ప్లెజంట్‌గా మార్చాయి. 

సినిమా ఫస్ట్ హాఫ్‌లో కథ చాలా నిదానంగా సాగుతుంది. పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం డైరెక్టర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. కథనం పరంగా కొన్ని ఉపకథలు (Sub-plots) సినిమా నిడివిని పెంచినట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ కాస్త ఊహించదగినదిగా ముగుస్తుంది.

నివిన్ పౌలీ తన క్యాటరింగ్ గ్రూప్‌తో కలిసి చర్చి ఫంక్షన్లలో చేసే వంటలు, అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు, కామెడీ సీన్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. కాలేజీ అమ్మాయి అయిన ఆష్లే (మమితా బైజు), తనకంటే వయసులో చాలా పెద్దవాడైన జస్టిన్‌కు చాలా క్యాజువల్‌గా తన ప్రేమనొక సీన్ లో వ్యక్తపరుస్తుంది. ఆ సమయంలో నివిన్ పౌలీ ఇచ్చే అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్, “నా వయసేంటి.. నీ వయసేంటి” అంటూ అతను కంగారుపడే సీన్ సినిమాకే వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ అండ్ క్యూట్ మూమెంట్‌గా నిలుస్తుంది.

‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ఈ సినిమాలో ఒక విచిత్రమైన సైడ్-కిక్ పాత్రలో కనిపిస్తారు. ఒక పాత వింటేజ్ కారును రిపేర్ చేస్తూ, ఊరంతా తిరుగుతూ అతను చేసే కామెడీ, లోకల్ గ్యాంగ్‌లతో వచ్చే గొడవలు సినిమా ఫేసింగ్‌ను చాలా సరదాగా ముందుకు నడిపిస్తాయి.అతగాడి లవ్ ఎపిసోడ్స్ కూడా సరదాగా ఉంటాయి. 

ఇంట్లో వాళ్లకు తెలియకుండా జస్టిన్, ఆష్లే ఇద్దరూ  ఫోన్లలో మాట్లాడుకునే సీన్స్ ‘జెన్-జీ వర్సెస్ 90s కిడ్’ తరహాలో చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ముఖ్యంగా మమితా బైజు తన క్యూట్ లుక్స్, డామినేటింగ్ క్యారెక్టర్‌తో నివిన్ పౌలీని ఆటపట్టించే ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

వయసు వ్యత్యాసం వల్ల సమాజం, కుటుంబాల నుండి వచ్చే ఒత్తిడిని జస్టిన్ ఎదుర్కొనే సన్నివేశాలు బాగుంటాయి. ఆష్లే పట్ల తనకున్న నిజమైన బాధ్యతను చర్చిపెద్దల ముందు ఒప్పుకునే సీన్ సినిమాలోని డ్రామాను పీక్స్‌కి తీసుకెళ్తుంది. ఇక్కడ నివిన్ పౌలీ మెచ్యూర్డ్ నటన ఆకట్టుకుంటుంది.

‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ భారీ ట్విస్టులు లేదా యాక్షన్ లేని, ఒక పర్ఫెక్ట్ ‘హ్యాపీ పిల్’ కంఫర్ట్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ , యూత్‌కు, ముఖ్యంగా ఒక ఆహ్లాదకరమైన ప్రేమకథను చూడాలనుకునే వారు ఈ సినిమా చూడవచ్చు. ఈ సినిమా ప్రముఖ  జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!