Pudota Showreelu ……………………… A different film
మంగోలియా సంచారజాతులకు సంబంధించిన ప్రేమకావ్యం ఈ సినిమా. 2022 లో ఈ సినిమాను తీసినప్పటికీ ఎక్కడా ప్రేమికులు అసహ్యకరమైన భంగిమల్లో కనిపించరు.పావుగంట కో పాటరాదు.నటీ నటులు అద్భుతమైన నటనను ప్రదర్శించిన ప్రేమకత ఇది.ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మసాలా సినిమా కాదు.
ఇక కతలోకొస్తే తల్లి చిన్నపిల్లలైన తన కూతురుకి,ఆమె స్నేహితురాలికి ఒక గుఱ్ఱంబొమ్మ చెక్కివున్న అందమైన లాకెట్ తో వున్న గొలుసును చూపిస్తూ కత చెపుతూ వుంటుంది.అది చెక్కమీద చెక్కిన అందమైన గుఱ్ఱంబొమ్మ.ఒకానొక రోజుల్లో ఒక అందమైన యువరాణి తనకిష్టమైన ప్రకృతిని చూస్తూ,కొండలు,లోయలు,అడవులు,దాటుతూ ఒక ఎడారికి చేరుకుంటుంది.
ఆ ఎడారిలో ఒక యువకుడు తారసపడి ఆమెకు ఎడారి విశేషాలు చూపిస్తూ వుంటాడు. ఇంతలో ఒక భయంకరమైన ఇసుక తుఫాను వస్తుంది.వాళ్ళిద్దరూ ఒక పెద్ద కొండరాయి చాటుకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకుంటారు.” వింటున్న కూతురు” అమ్మా, ఈ లాకెట్ ఎంత అందంగా వుంది. గుఱ్ఱంబొమ్మ లో గుర్రం నిజం గుఱ్ఱం లాగా వుంది.”అంటూ ఆ గొలుసును తన మెడలో వేసుకుంటుంది.
అప్పటికే కేన్సర్ తో బాధపడుతున్న తల్లి తక్కిన కత చెప్పలేకపోతుంది.కొన్నాళ్ళకు తల్లి చనిపోతుంది.అప్పటికి కూతురు ” మయా,ఆమె స్నేహితురాలు పాతికేళ్ల యువతులు.
ఒకరోజు ఇంట్లో సామాను సర్దుతూవుంటే, మయా కి పైన షెల్ఫ్ లో సామాను వెనుక దాచిన ఒక చిన్నచెక్కపెట్టే కనిపిస్తుంది.
దాన్ని కిందకు దించి చూడగా అందులో మంగోలియాలోని గోబి ఎడారి,మంగోలియాకే ప్రత్యేకమైన రెండు మూపురాల ఒంటెలు, ఒక అందమైన యువకునితో కలిసివున్న ఆమెతల్లి,ఇంకా కొన్ని ఫోటోలు కనిపిస్తాయి.ఆఫోటోల వెనుక రాసినదాన్ని బట్టి,ఆ యువకుడే తన తండ్రి” తుమెన్ జార్గిల్” అని,అతన్ని తన తల్లి ఎంతగా ప్రేమించింది తెలుసుకుంటుంది.
అసలు అమెరికన్ అయిన తన తల్లి,అమెరికా నుండి ఎందుకు గోబి ఎడారికి వెళ్ళింది? అక్కడ ఏమి జరిగింది.? సంచార తెగకు చెందిన తన తండ్రి ఇంకా అక్కడే వున్నాడా.? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి,ఎలాగైనా తన తండ్రిని కలవాలనే తపనతో,స్నేహితురాలు వద్దని వారిస్తున్నా వినకుండా,ఒంటరిగా మంగోలియాలోని గోబిఎడారికి బయలుదేరుతుంది.
మంగోలియాలో దిగీ దిగగానే,దుండగులు కిడ్నాప్ చేయబోతున్న ఏడేళ్ల పాప మయా కంటపడుతుంది.వాళ్ల బారినుండి ఆ పాపను కాపాడుతుంది.అది చూసిన పాప తండ్రి ఆమెను తన ఇంటికి పిలుస్తాడు.అతడు సంచారతెగకు చెందిన గోబి ఎడారి నివాసి. తల్లి లేని ఆ పాప,భార్యను కోల్పోయి ఒంటరిగా తాతతో వుంటున్న యువకుడు ” బాటా” ఆ ఇంట్లో ఉంటారు.
మయా తను వచ్చిన పని వారితో చెప్తుంది.తన తండ్రిని వెతకటంలో వారి సాయం కావాలని కోరుతుంది.బాటా కు మరో పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూస్తారు..కానీ బాటా తాత అప్పుడప్పుడే మయా,బాటా మధ్య చిగురిస్తున్న ప్రేమను పసిగడతాడు.
మయా,బాటా,తాత ముగ్గురూ కలిసి,వారి గుండ్రని గుడారాల(YURT)నుండి, మయా తండ్రిని వెతకటానికి మూడు గుర్రాలపై మంగోలియా పచ్చిక మైదానాలలోకి బయలుదేరుతారు.
ఆ పచ్ఛిక మైదానంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన చెంఘీజ్ ఖాన్ విగ్రహం(131 అడుగులు) చెంఘీజ్ ఖాన్ బూట్లను వారు చూస్తారు..ఇక్కడ ఆదేశానికే పేరు తెచ్చిన ఆ విగ్రహం విశేషాలు చక్కగా చూపించారు.
అక్కడున్న మేనేజర్ ని కలిసి,ఫోటోలు చూపించి వివరాలు అడగగా,అతడు సంచార తెగకు చెందిన ఒక గైడ్ అని, Go Gobi అనే టూర్ కంపెనీ లో పనిచేసేవాడనీ, చెక్కపై చక్కని డిజైన్ లు( కార్వింగ్) చెక్కుతాడని,కానీ ఇప్పుడతడు ఎక్కడున్నది తనకు తెలియదని చెప్తాడు.
తండ్రిని వెతుకుతూ వెళ్తున్నపుడు అనుకోకుండా కొందరితో, మయా తన విలువైన కెమెరాను పందెం ఒడ్డాల్సివస్తుంది.ఇక్కడ మంగోలియా సాంప్రదాయ పోటీలైన,కుస్తీ,విలువిద్య,గుర్రపు స్వారీలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు.వాటిని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసేటట్లు చేశాడు.
ముగ్గురూ ఆ పోటీలలో పాల్గొని,ప్రత్యర్ధులను ఓడించి,గెలుపొందుతారు. అలా గోబిఎడారిలో అన్వేషిస్తూ ఒక సంచారతెగని కలుసుకుంటారు.వారిని మయా తండ్రి ” తుమెన్ జార్గిల్” గురించి అడుగగా… ఆమె అతడు తనకు తెలుసునని,అతని వద్దకు తన మనవరాలిని తోడిచ్చి పంపుతుంది.
ఎంతో ఉద్వేగంతో తండ్రిని కలిసిన మయా సంతోషపడుతుంది. అచ్చం తల్లి కళ్ల ( బ్లూ eyes) లాంటి కళ్ళు కలిగిన మయాను చూసి ” మీ తల్లి పెగ్గీ నా.? ” అని తుమెన్ అడుగుతాడు.
మయా తన మెడలో వున్న లాకెట్ చూపించి,”మీరే నా తండ్రి కదా?” అని అడుగుతుంది.
తుమెన్ ఏమంటాడు.?కూతురని ఒప్పుకుంటాడా? మయా, బాటా పెళ్లి జరుగుతుందా.? బాటా కు ముందుగా నిశ్చయమైన అమ్మాయి ఏమవుతుంది? మంగోలియా ఒంటెల మీద పరిశోధన చేయటానికి వెళ్లిన మయా తల్లి పెగ్గి, తుమెన్ మధ్య ఏమి జరిగింది.? అసలు మయా, తుమెన్ కూతురేనా.?
ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వున్న ఈ సినిమా చూడాల్సిందే..రకరకాల భావోద్వేగాలు,హాస్యం నిండిన ఈ చిత్రం లో దర్శకుడు గోబిఎడారి సౌందర్యాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపుతారు.
పచ్చిక మైదానాలు,సంచారుల గుడారాలు, వారి జీవనవిధానం,వారి జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన క్రైస్తవ మతం,దానిపై చర్చలు,ఇసుక తుఫానులు,రెండు మూపురాల ఒంటెలు,వారి పెళ్ళిళ్ళు,అన్నిటినీ గుదిగుచ్చి, కథలో ఇమిడ్చి మంగోలియా ను మన కళ్ల ముందుంచిన సినిమా ఇది.
2022 లో విడుదలైన ఈ సినిమా నిడివి 1 గం 41 నిమి.. డైరెక్టర్ డోనాల్డ్ లియో,సినిమాటోగ్రఫీ తిమొతీ జాన్,బాటా గా ముంఖ్ణాసన్ దాస్ డోర్జి, మయా గా రాచెల్ డేవిడ్,తాత గా జర్గల్,ఇంకా తక్కినవారందరూ తమ తమ పాత్రలను చక్కగా పోషించారు.ఒక మంచి సినిమా చూసిన ఆనందం కలుగుతుంది..