Social Drama ………..
‘ఎన్నా విలై’ (Enna Vilai) సజీవ్ పళూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుణాస్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు.‘ఒక పేదవాడి పరువుకు, నిజాయితీకి ఉన్న విలువ ఎంత?’ అనే ఆలోచనాత్మక కథాంశంతో తెరకెక్కినఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం
రామేశ్వరం సముద్రంలో వేటాడుతూ బ్రతికే ఒక సామాన్య జాలరి తవశి (కరుణాస్) కి ఒకరోజు సముద్రంలో ఖరీదైన బంగారు హారం దొరుకుతుంది. దానిని నిజాయితీగా తీసుకెళ్లి స్థానిక పోలీసులకు ఇస్తాడు. అయితే పోలీసులు అతడినే దొంగగా చిత్రీకరించి అక్రమ కేసు బనాయిస్తారు.
తన పరువును కాపాడుకోవడానికి, తను నిజాయితీపరుడు అని నిరూపించుకోవడానికి అతనికి అడ్వకేట్ కాంచన (నిమిషా సజయన్) అండగా నిలబడుతుంది. ఆ తర్వాత కోర్టులో జరిగే పోరాటం, సామాన్యుడిపై వ్యవస్థ చూపే ప్రతాపం ఏంటి అనేది మిగతా కథ.
కమెడియన్‌గా సుపరిచితుడైన కరుణాస్ ఈ చిత్రంలో జాలరి ‘తవశి’ పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. అడ్వకేట్‌గా నిమిషా సజయన్ కోర్టు రూమ్ సీన్స్‌లో తన ఇంటెన్స్ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు.”డబ్బు ముఖ్యం కాదు, మనిషి పరువు, ఆత్మగౌరవం ముఖ్యం” అనే పాయింట్‌ను చక్కగా చర్చించారు.
సముద్రంలో దొరికిన వస్తువు ను నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే సన్నివేశం జాలరి నిజాయితీని, అమాయకత్వాన్ని చాలా సహజంగా చూపిస్తుంది. నిజాయితీగా వస్తువును అప్పగించిన తవశిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ఉపయోగించే సీన్లు చూసేవారికి వ్యవస్థపై కోపం తెప్పిస్తాయి.
కరుణాస్ ఆ వేదనను తన నటనతో అద్భుతంగా పండించారు. అడ్వకేట్ కాంచనగా నిమిషా సజయన్ రంగంలోకి దిగి, పోలీసుల కుట్రను ఛేదించడానికి చేసే వాదనలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక సామాన్య జాలరి పరువు కోసం న్యాయమూర్తి ముందు జరిగే వాదనలు, పోలీసుల అబద్ధాలను లాయర్ కాంచన ఒక్కొక్కటిగా బట్టబయలు చేసే కోర్టు రూమ్ డ్రామా సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
“ఒక పేదవాడి ఆత్మగౌరవానికి సమాజం కట్టే ధర ఎంత?” అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చే క్లైమాక్స్ సీన్ చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ సీన్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిదానంగా, రొటీన్‌గా సాగుతుంది. లీగల్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ, కోర్టులో జరిగే వాదనలు మరింత బలం గా ఉండేలా కసరత్తు చేస్తే బాగుండేది.సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు పదే పదే పునరావృతమైనట్లు అనిపిస్తాయి.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని (BGM) అందించారు. ఒక నిరుపేద కుటుంబం వ్యవస్థ చేతిలో మోసపోయినప్పుడు పడే వేదనను, కోర్టు రూమ్‌లో జరిగే వాదనలలోని సీరియస్‌నెస్‌ను సామ్ సి.ఎస్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.
ఈ సినిమాకు ఆల్బీ ఆంటోనీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఆయన చూపిన అద్భుతమైన కెమెరా పనితనానికి గాను అట్లాంటా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ సినిమాటోగ్రాఫర్’ అవార్డు లభించింది. రామేశ్వరం సముద్ర తీరం, జాలరుల జీవితాలు, అలల అలజడిని కెమెరాలో చాలా సహజంగా బంధించారు. డాక్యుమెంటరీ స్టైల్లో కాకుండా, ఒక ఇంటెన్స్ డ్రామాకు సరిపోయే విజువల్ లాంగ్వేజ్‌ను క్రియేట్ చేశారు.
కమర్షియల్ హంగులు లేకుండా, వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కించిన ఒక సాధారణ సామాజిక డ్రామా. రొటీన్ మాస్ ఎంటర్టైనర్స్కి భిన్నంగా కాస్త సీరియస్, ఎమోషనల్ కోర్టు రూమ్ కథలు ఇష్టపడేవారు నెట్‌ఫ్లిక్స్‌లో ఒకసారి చూడవచ్చు.

