Thriller movie with message …….
‘ఈటి’ (ఎవరికి తలవంచడు ) 2022 నాటి తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం Netflix లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం
లాయర్ కృష్ణమోహన్ (సూర్య) తన ఊరి ప్రజల క్షేమం కోసం నిలబడే ధైర్యవంతుడు. కేంద్ర మంత్రి కుమారుడైన ఇన్బా (వినయ్ రాయ్) ఒక పెద్ద గ్యాంగ్‌తో కలిసి అమ్మాయిల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి అశ్లీల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు.
ఈ క్రమంలో కృష్ణమోహన్ భార్య అధిర (ప్రియాంక మోహన్) కూడా ఈ ముఠా వలలో చిక్కుకుంటుంది. చట్టం చేతులు దాటిన పరిస్థితుల్లో, లాయర్ కృష్ణమోహన్ ఆ మాఫియా ముఠాను ఎలా అంతమొందించాడు, నారీలోకానికి ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు అనేదే మిగిలిన కథ.
పొల్లాచి లైంగిక దాడి ఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో, లైంగిక వేధింపుల బాధితులు సమాజానికి భయపడి ఆత్మహత్యలు చేసుకోకూడదని, ధైర్యంగా ఎదురుతిరగాలని ఇచ్చిన సందేశం బాగుంది. సినిమా సూర్య వన్ మ్యాన్ షో గా నడుస్తుంది. ఎమోషన్స్, యాక్షన్, లాయర్ పాత్రలో గంభీరతను సూర్య అద్భుతంగా పండించాడు. సినిమాను తన భుజాలపై వేసి నడిపించాడు. సూర్య,ప్రియాంక మోహన్ కెమిస్ట్రీ బాగుంది.
ప్రథమార్ధంలో వచ్చే పల్లెటూరి వాతావరణం, కామెడీ, కొన్ని పాటలు పాత పద్ధతిలో సాగుతాయి. విలన్ ముఠా తన భార్య (ప్రియాంక మోహన్) రహస్య వీడియో తీశామని బ్లాక్‌మెయిల్ చేసినప్పుడు, సూర్య ఆమెకు అండగా నిలబడే సన్నివేశం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ‘తప్పు చేయని మహిళలు కాదు ..అశ్లీల చిత్రాలు తీసేవారు సిగ్గు పడాలి’ అని సూర్య చెప్పే డైలాగులు హృదయానికి హత్తుకుంటాయి.
ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, సూర్య లాయర్ అవతారంలోకి మారి యాక్షన్ మోడ్‌లోకి వచ్చే సీన్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తుంది. లాయర్ కృష్ణమోహన్‌గా సూర్య కోర్టులో బాధితుల తరపున వాదించే సన్నివేశాలు, మహిళల రక్షణ గురించి మాట్లాడే డైలాగ్ డెలివరీ ఆయన నటనలోని తీవ్రతను చూపిస్తాయి.
సూర్య ఆయన తండ్రి పాత్ర పోషించిన సత్యరాజ్ మధ్య వచ్చే కుటుంబ సన్నివేశాలు, వారి మధ్య ఉండే బాండింగ్ నవ్వులు పూయిస్తూనే మంచి అనుభూతిని ఇస్తుంది. సూర్య పెళ్లి సన్నివేశాలు బాగా వచ్చాయి. నటీనటులంతా బాగా చేశారు..సినిమా నిడివి కాస్త ఎక్కువగా అనిపిస్తుంది.ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది.
సినిమా చివర్లో విలన్ ముఠాను అంతమొందించే యాక్షన్ సీక్వెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా సూర్య విలన్లను చట్టానికి కాకుండా, బాధితులైన మహిళలకు అప్పగించే సీన్ ప్రేక్షకులకు నచ్చుతుంది.క్లైమాక్స్ ను డిఫెరెంట్ గా తీశారు.
డి.ఇమ్మాన్ ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లలో ఇచ్చిన బిజీఎం (BGM) సూర్య ఎలివేషన్లకు బాగా సెట్ అయింది.
రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ఫైట్స్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పల్లెటూరి వాతావరణాన్ని చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా చూపించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే పండగ పాటలు, ఫ్యామిలీ సీన్స్ విజువల్స్ కంటికి ఇంపుగా ఉంటాయి.
ఈ సినిమా నిర్మాణానికి సుమారు ₹75 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది.ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల క్లబ్‌లో చేరి సూర్య మార్కెట్ పవర్‌ను నిరూపించింది.
ఒక సామాజిక సందేశానికి మాస్ యాక్షన్‌ను జోడించి తీసిన ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. సూర్య అభిమానులకు, మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

