అలరించే మిస్టరీ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Slow-burn thriller…………

‘ఎకో’ (Ekō – 2025) ఇదొక  మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. సాలిడ్, ఇంటెన్స్ స్లో-బర్న్ థ్రిల్లర్. మనుషులతో పాటు  కుక్కలు కథలో కీలక పాత్ర పోషించడం ఈ సినిమా ప్రత్యేకత. ‘కిష్కింధ కాండం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు దింజిత్ అయ్యతన్, రచయిత బాహుల్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది.

కథ క్లుప్తంగా ……..  

కేరళలోని పశ్చిమ కనుమల్లోని ఒక దట్టమైన అటవీ ప్రాంతం (ఎత్తైన కొండపై ఉన్నఎస్టేట్) నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అరుదైన విదేశీ జాతి కుక్కలను పెంచే కురియాచన్ (సౌరభ్ సచ్‌దేవా) అనే వ్యక్తి అదృశ్యమవుతాడు. అతని ఎస్టేట్‌లో కురియాచన్ భార్య మ్లాతి (బియానా మోమిన్), కేర్ టేకర్ పీయూష్ (సందీప్ ప్రదీప్), కొన్ని ప్రమాదకరమైన మలేషియన్ కుక్కలు మాత్రమే ఉంటాయి.

కురియాచన్‌ను వెతుక్కుంటూ నేవీ ఆఫీసర్ (నరైన్) మోహన్ పోతన్ (వినీత్) అక్కడికి రావడంతో కథ మలుపు తిరుగుతుంది.కురియాచన్ ఎక్కడికి వెళ్లాడు? ఆ కుక్కల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనేదే మిగిలిన కథ. 

బాహుల్ రమేష్ రాసిన నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే (ఒక్కో పొర విప్పుతూ వెళ్లే విధానం) ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

మేఘాలయకు చెందిన బియానా మోమిన్ ఈ సినిమాకు అసలైన ప్రాణం. ఎప్పుడూ మౌనంగా, నిస్సహాయంగా కనిపిస్తూనే, లోలోపల బలమైన ఆత్మవిశ్వాసం, ప్రతీకార జ్వాల కలిగిన వృద్ధ మహిళ పాత్రలో ఆమె కళ్లతోనే భావాలను పలికించారు. 

కేర్ టేకర్ పీయూష్ పాత్రలో సందీప్ ప్రదీప్ నటనతో ఆకట్టుకున్నాడు. మొదట ఒక సాధారణ, అమాయకమైన సహాయకుడిలా కనిపిస్తూ, కథ ముందుకు సాగుతున్న కొద్దీ తన అసలు ఉద్దేశాలను దాచిపెట్టే విధానం,క్లైమాక్స్‌లో అతని నిస్సహాయత చాలా సహజంగా పండాయి.

‘యానిమల్’ సినిమాతో గుర్తింపు పొందిన సౌరభ్ సచ్‌దేవా, అరుదైన కుక్కల పెంపకందారుడిగా,ఒక మిస్టరీ వ్యక్తిగా గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. తన చుట్టూ ఉన్నవారిని, జంతువులను తన అధీనంలో ఉంచుకోవాలనుకునే ఆధిపత్య మనస్తత్వం కలిగిన పాత్రలో ఆయన పర్ఫెక్ట్‌గా సరిపోయారు.

కురియాచన్ పాత స్నేహితుడిగా, అతని కోసం వెతుక్కుంటూ వచ్చే మోహన్ పోతన్ పాత్రలో సీనియర్ నటుడు వినీత్ మెప్పించారు. అడవిలోకి వచ్చే నేవీ అధికారి పాత్రలో నరైన్ హుందాగా, చాలా సహజంగా నటించారు. ఆ ఎస్టేట్‌లోని వింత వాతావరణాన్ని చూసి సందేహపడే సన్నివేశాల్లో ఆయన నటన కథకు బలాన్నిచ్చింది. మిగిలిన పాత్ర దారులు కూడా బాగా నటించారు.

సినిమాలో మలేషియన్ జాతి కుక్కలను ఉపయోగించిన తీరు, అవి రక్షణకు,బంధనానికి ప్రతీకలుగా నిలిచే విధానం చాలా కొత్తగా ఉంటుంది.తన భర్త కురియాచన్ ఎప్పుడో వదిలేసి వెళ్లినా, దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఆ కొండపై మ్లాతి ఏళ్ల తరబడి ఒంటరిగా జీవిస్తుంటుంది.

తన చుట్టూ ఉన్న కుక్కలు తనను కాపాడుతున్నాయా లేక తనను ఆ ఇంటికే బంధించి ఉంచాయా తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె కళ్లలో కనిపించే ఆవేదన, మౌనం ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి.

కుక్కలలాగే మనుషుల్లో కూడా కొందరు విశ్వాసం ఉన్నవారు ఉంటారని, యజమానిని కాపాడుకోవాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పీయూష్ పాత్ర ప్రవర్తించే తీరు,మ్లాతి పట్ల అతను చూపించే బాధ్యత భావోద్వేగానికి గురిచేస్తాయి.

కథ ముందుకు సాగుతున్న కొద్దీ, అందరూ గొప్పవాడిగా, ప్రకృతి ప్రేమికుడిగా భావించే కురియాచన్ అసలు స్వరూపం అతను మ్లాతి జీవితాన్ని ఎలా శాసించాడో తెలిసే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు షాక్‌తో పాటు ఒక రకమైన విషాదాన్ని మిగులుస్తాయి.

క్లైమాక్స్‌లో ఆ కుక్కల క్రూరమైన, రక్షణాత్మక రూపం చూసినప్పుడు గుండెల్లో ఒక రకమైన గుబులు, ఆవేదన కలుగుతాయి. “ఇంతకాలం రక్షణ అనుకున్నదే అసలైన పంజరం” అనే భావన సినిమా ముగిసిన తర్వాత కూడా వెంటాడుతుంది.  

సినిమా మొదటి నుండి చివరి వరకు చాలా నిదానంగా సాగుతుంది. అయినప్పటికీ చివరివరకు సస్పెన్స్ కొనసాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నప్పటికీ, కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ప్రేక్షకుల ఊహకే వదిలేసినట్లుగా అనిపిస్తుంది.

కేరళలోని పశ్చిమ కనుమల్లోని పొగమంచుతో కూడిన కొండలు,వర్షం, ఎస్టేట్‌లోని ఒంటరితనాన్ని ఒక రకమైన మిస్టరీ మూడ్‌తో చాలా సహజంగా  బాహుల్ రమేష్ చిత్రీకరించారు. రచయిత,కెమెరామెన్ ఒకరే కావడం సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాల్లోని ఉత్కంఠను,పాత్రల ఆలోచనలను ఎక్కడ, ఏ యాంగిల్‌లో చూపించాలో స్పష్టంగా కెమెరాలో బంధించారు.

ముజీబ్ మజీద్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ఒక గంభీరమైన, ఉత్కంఠభరిత మూడ్‌ను తీసుకొచ్చాయి.

 ‘ఎకో’ ఒక విభిన్నమైన, ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్.’ లోతైన భావోద్వేగాలు, షాకింగ్ ట్విస్టులు ఉండే సినిమాలను ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది.ఈ సినిమా తెలుగు వెర్షన్  నెట్ఫ్లిక్ లో ఉంది ఆసక్తిగలవారు చూడవచ్చు.   

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!