Haunted place …….
ముంబైలోని కొలాబా (Colaba) ప్రాంతంలో సముద్ర తీరాన ఉన్న ‘ముఖేష్ మిల్స్’ (Mukesh Mills) మన దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. ఎన్నో బాలీవుడ్, తెలుగు సినిమాల షూటింగ్‌లకు వేదికైన ఈ పాడుబడిన వస్త్ర కర్మాగారం వెనుక అనేక భయానక సంఘటనలు, నిజ జీవిత అనుభవాలు ఉన్నాయి. అయితే ఇపుడు దాని రూపు రేఖలు మారాయి.కల్చరల్ హబ్ గా మారిపోయింది.
బాలీవుడ్ ఇక్కడి పాడుబడిన షెడ్లను 1960ల నాటి బాంబే నుండి, హారర్ సినిమాలకు సరిపోయే భయానక నేపథ్యాలకు అనుకూలంగా మార్చుకుంది. మిల్లులోని చెక్క దూలాలు, మంగళూరు పెంకులు,పగిలిన గోడలను అందంగా అలంకరిస్తే ..ఆకర్షణీయం గా మారిస్తే ఒక ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తాయని ఆమధ్య ఫ్యాషన్ డిజైనర్లు గుర్తించారు. దీంతో మిల్ యజమానులు మిల్ రూపురేఖలు మార్చేశారు. ఆప్రాంతాన్ని ఈవెంట్ షో కేంద్రంగా రూపొందించారు.
ససూన్ డాక్స్ (Sassoon Docks) ఐఎన్ఎస్ షిక్రా (INS Shikra) నావికాదళ స్థావరం మధ్య ఉన్న, పిచ్చి మొక్కలతో నిండిపోయిన సముద్ర తీర ప్రాంతంలోని సుమారు మూడు ఎకరాల భూమిని శుభ్రం చేసి ఎంటర్టైన్మెంట్ & కల్చరల్ హబ్‌గా మార్చేశారు. ఇపుడు అక్కడ పెద్ద ఈవెంట్లు జరిగాయి,జరుగుతున్నాయి,జరగబోతున్నాయి.ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం ఇపుడు రకరకాల కార్యక్రమాలతో కళ కళ లాడుతోంది.
ఒకప్పుడు సొంత డాక్ (రేవు) కలిగి పనిచేసిన వస్త్ర కర్మాగారం ఈ మిల్లు. 1975లో అగర్వాల్ దీనిని కొనుగోలు చేశారు. జనవరి 1982లో ముంబై టెక్స్టైల్ సమ్మె కారణంగా మిల్లులో పనులు నిలిచిపోయే వరకు వారి కుటుంబమే దీనిని నడిపింది. ఆ తర్వాత జరిగిన అగ్నిప్రమాదంతో మిల్లు కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం కాలేదు.
తర్వాత దీని శిథిలాలు బాలీవుడ్ కథల్లో భాగమయ్యాయి.బాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు ఇక్కడి గంభీరమైన, విభిన్నమైన వాతావరణం బాగా నచ్చింది. ‘హమ్’ సినిమాలోని అమితాబ్ బచ్చన్ పాట ‘జుమ్మా చుమ్మా దే దే’ ఇక్కడే తీశారు.
ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌లతో పాటే అతీంద్రియ శక్తుల కథనాలు కూడా పెరిగాయి. వింత గొంతులు, దెయ్యాలు పట్టడం, అంతుచిక్కని సంఘటనల గురించిన కథలు ప్రచారంలోకి వచ్చాయి. బాగా ప్రాచుర్యం పొందిన ఒక ప్రముఖ నటి అనుభవం కూడా అంత నాటకీయంగా ఏమీ లేదు. బిపాషా బసు ఇక్కడ షూటింగ్ సమయంలో తన డైలాగులను పదేపదే మర్చిపోయేవారని గుర్తుచేసుకున్నారు.
ఒక గదిలోకి వెళ్లగానే తీవ్రమైన భయం,అస్వస్థత కలిగేవని స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత ఒక కేర్ టేకర్ ఆమెను జుట్టు ముడి వేసుకోవాలని సూచించడం,ఒక చిన్న పూజ చేయడం జరిగింది.దాంతో పరిస్థితి మారింది.రాత్రిపూట షూటింగ్ చేస్తున్నప్పుడు లైట్లు వాటంతట అవే ఆగిపోవడం, ఎవరో నీడల్లా కదలడం, ఆడవారి ఏడుపులు లేదా నవ్వులు వినిపించడం .. కెమెరా లెన్స్‌లు పగిలిపోవడం వంటివి తరచుగా జరిగేవని అనేవారు.
భద్రతా కారణాలు, ఈ వింత సంఘటనల వల్ల కొంతకాలం ఇక్కడ షూటింగ్‌లను నిలిపివేశారు.ప్రత్యేక అనుమతులు ఉన్నప్పుడు పగటిపూట కొన్ని షూటింగ్‌లకు అనుమతి ఇచ్చే వారు.ఇక్కడ సుమారు 500 సినిమాల షూటింగ్ జరిగింది. ఈ ప్రదేశం చుట్టూ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడి వాతావరణం మారిపోయింది.
గత ఏడాది కాలంలో ముఖేష్ మిల్స్ ఫుడ్ ఫెస్టివల్, కళా, సాంస్కృతిక ఉత్సవాలు, ప్రొడక్ట్ లాంచ్‌లు, ఫ్యాషన్ ఈవెంట్లు, ప్రైవేట్ వేడుకలకు వేదికైంది. ఇక్కడున్న 10 కట్టడాలలో ప్రస్తుతం ఐదు మాత్రమే ఉపయోగించడానికి వీలుగా ఉన్నాయి. వీలైనంత వరకు చిమ్నీ,దూలాలు, స్తంభాలు, పారిశ్రామిక ఆనవాళ్లను అలాగే ఉంచుతున్నారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షూటింగ్లకే కాకుండా, ఇతర ఈవెంట్ల కోసం ఈ ప్రదేశాన్ని ముందుగా బుక్ చేసుకుంటున్నారు.

